ముఖ యోగా...మంచిదేగా!

12-05-2018: మొహాన్ని ఎనిమిది వంకర్లు తిప్పితే... మీ వయసు ఓ ఏడెనిమిదేళ్లు తగ్గిపోతుంది. అదీ ఓ వ్యాయామమే, ముఖ వ్యాయామం. ‘ముఖయోగా’ అనీ అంటారు. వ్యాయామ ఫలితాల్ని ప్రపంచ పరిశోధకులు బల్లగుద్ది మరీ నిర్ధరిస్తున్నారు.
 
మహామహా కవులకూ అందమే ప్రేరణ. కానీ, ఎంతటి సౌందర్యమైనా వయసుతో పాటు మసకబారిపోవాల్సిందే. మారుతున్న వాతావరణానికి ముప్పయ్యేళ్లకే మొహంపై పలచని ముడతలు పలకరిస్తున్నాయి. నలభై దాటితే నానమ్మ అవతారమే! మళ్లీ పాత కళను తిరిగి తెచ్చుకోవడం కోసం... సంపన్నులు లేజర్‌ ట్రీట్‌మెంట్ల వెంట పరుగులు పెడుతుంటే, మధ్యతరగతి మహిళలు ముల్తానీమిట్టి, శెనగపిండి వగైరాలతో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా... అవకాశాలు యాభైశాతంలోపే! ‘కాణీ ఖర్చు లేకుండా, అయిదు నెలల పాటూ ఓ చిట్కా ప్రయోగిస్తే చాలు. మీ చర్మం వయసు మూడేళ్లు తగ్గించవచ్చు’ అంటున్నారు పరిశోధకులు. దీనిపేరు ‘ఫేస్‌ యోగా’.
 
కొవ్వు పనే ఇదంతా...
కొవ్వు ఒంట్లో చేరకూడదని డైట్‌ పాటిస్తాం కానీ, ఆ కొవ్వే చర్మం నిగారింపును నిర్ణయిస్తుంది. ముప్పయ్యేళ్లలోపు వారిలో కొవ్వు ముక్కలు దగ్గరదగ్గరగా ఉంటాయి. అందుకే, ముడతలూ గీతలూ కనిపించవు. వయసు పెరుగుతున్న కొద్దీ కొవ్వు ముక్కల మధ్య సఖ్యత ఉండదు. ఒకదానికొకటి దూరంగా జరిగిపోతాయి. దీని వల్ల చర్మం మెరుపును కోల్పోతుంది. ముడతలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో లేజర్‌ ట్రీట్‌మెంట్ల కన్నా ముఖానికి ‘ఫేస్‌ యోగా’నే మంచిదంటారు నిపుణులు. కోపంగా మాట్లాడితే ఒకలా, నవ్వితే ఇంకోలా, వెక్కిరిస్తే మరోలా మన ముఖ కవళికల్ని మారుస్తూ ఉంటాం. అంతమాత్రాన అది యోగా అనిపించుకోదు. దానికంటూ ఓ పద్ధతి ఉంటుంది.  వ్యాయామం అంటే, ముఖంలోని ప్రతి కండరం కదలాలి. ప్రతినరం ఉత్తేజితం కావాలి. అలాంటి ముఖ వ్యాయామాలపైనే పరిశోధకులు దృష్టిసారించారు.
 
ఇదీ పరిష్కారం... 
చికాగోలోని నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీకి చెందిన డెర్మటాలజిస్టులు ముఖ వ్యాయామాన్ని లోతుగా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన కోసం... నలభై ఏళ్ల నుంచి అరవై అయిదు ఏళ్ల మధ్య వయసు వారిని ఎంచుకున్నారు. మొత్తం ముప్పైరెండు రకాల ముఖ వ్యాయామాలను వారికి నేర్పించారు. ఇరవై నెలల పాటూ రోజుకు అరగంట చొప్పున చేయమన్నారు. ఆతర్వాత, వారి ముఖాల్లో వచ్చిన మార్పులను నమోదు చేశారు. అయిదు నెలల ముఖ వ్యాయామంతోనే చాలామంది చర్మం నిగారింపును సంతరించుకుంది. చర్మం వయసు దాదాపుగా మూడేళ్లు తగ్గిపోయింది. వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు శక్తిమంతంగా, కాస్త లావుగా మారతాయని... కొవ్వు వల్ల ఏర్పడ్డ ఖాళీలను ఆక్రమించడం ద్వారా చర్మం మీదున్న ముడతలు మాయం అవుతాయనీ షికాగో డెర్మటాలజిస్టులు నిర్ధరించారు. ఏ లోకాల్లోనో ఉన్న పతంజలి మహర్షి ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తాడో.

ఎలా చేయాలంటే..

ముఖ వ్యాయామాలు ఇప్పటికే చాలా నగరాల్లో ప్రవేశించాయి. ఫేస్‌ యోగా ట్రైనర్లూ పుట్టుకొస్తున్నారు. ఇంటి దగ్గరా ప్రయత్నించవచ్చు.
ముందుగా అద్దం ముందు ప్రశాంతంగా కూర్చోండి.
రెండు వేళ్లతో ఒక కనుబొమను మెల్లగా పైకి లాగి, దించండి. అలా రెండు కనుబొమలకూ చేయండి. ఇలా అయిదారుసార్లు సాధన చేయండి.
రెండు చూపుడు వేళ్లతో పెదవుల చివర్లను పట్టుకుని సాగదీసి వదిలేయండి. ఇలా అయిదారుసార్లు చేయండి. 
బుగ్గల నిండా గాలి పీల్చుకుని వదులుతూ ఉండండి. 
ముఖం తిప్పకుండా, కళ్లను కుడి వైపు చివరకు తీసుకెళ్లి, నోటిని ఎడమవైపు తిప్పుతూ నాలిక చిన్నగా బయటపెట్టాలి.