పోల్‌ ఉంటే చాలు!

26-08-2018: కొందరు యోగా చేస్తారు... ఇంకొందరు జాగింగ్‌ చేస్తారు... మరికొందరు జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తారు... శరీరాన్ని ఫిట్‌గా ఉంచడం కోసం!! యోగా, జాగింగ్‌, జిమ్‌ బదులు కొందరు పోల్‌ డ్యాన్స్‌ని ఎంచుకున్నారు... ఇదీ ఈ అందగత్తెల ఫిట్‌నెస్‌ మంత్ర!!!

పోల్‌ డ్యాన్స్‌... నయా ఫిట్‌నెస్‌ మంత్ర! థ్యాంక్స్‌ టు బాలీవుడ్‌ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌! ఎందుకంటే... ఓ రకంగా మన భారతీయులకు పోల్‌ డ్యాన్స్‌ని పరిచయం చేశారు. శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చి సినిమాలు చేస్తున్న ఈ అందగత్తె... ఫిట్‌నెస్‌కు పోల్‌ డ్యాన్స్‌ ఓ సాధనంగా ఉపయోగపడుతుం దని మనవాళ్లకు పరిచయం చేశారు. హిందీ సినిమా ‘ఎ జెంటిల్‌మేన్‌’లోని ‘చంద్రలేఖ’ పాటలో జాక్వలైన్‌ పోల్‌ డ్యాన్స్‌ చేశారు. గతేడాది విడుదలైందీ సినిమా. అప్పట్లో పాట, అందులోని పోల్‌ డ్యాన్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. అందువల్ల, ప్రేక్షకులకు పోల్‌ డ్యాన్స్‌ గురించి బాగా తెలిసింది. ‘చంద్రలేఖ’ పాట చిత్రీకరించాలని అనుకున్నప్పుడు పోల్‌ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ లేదట! రెగ్యులర్‌ పార్టీ సాంగ్‌ ఎలా ఉంటుందో... అలాగే చిత్రీకరించాలని అనుకున్నారట! మియామీలో సాంగ్‌ షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. పాటలో కొత్తగా ఏం చేస్తే బావుంటుందని ఆలోచించిన జాక్వెలిన్‌... మియామీలో ప్రతిచోటా ఎక్కువమంది పోల్‌ డ్యాన్స్‌ చేయడాన్ని గమనించి, ‘పాటలో పోల్‌ డ్యాన్స్‌ చేస్తే బావుంటుంది’ అని చెప్పగా... యూనిట్‌ సభ్యులు అంగీకరించారు. అయితే... పోల్‌ డ్యాన్స్‌ నేర్చుకోవడం అంత సులభం కాదని ప్రాక్టీస్‌ స్టార్ట్‌ చేసిన తొలిరోజు తెలిసిందని అన్నారామె.
 
‘‘మొదట్లో పోల్‌ డ్యాన్స్‌ నేర్చుకోవడం చాలా అంటే చాలా కష్టం అనిపించింది. రెండు మూడు రోజులు కష్టపడ్డా. తర్వాత అద్భుతంగా ఉంది. పాట కోసం నేర్చుకున్న పోల్‌ డ్యాన్స్‌ తర్వాత నా ఫిట్‌నెస్‌ పాలసీలో ఓ భాగమైంది’’ అని జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పేర్కొన్నారు. తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోల్‌ డ్యాన్స్‌ చేస్తున్న ఫొటోలు, వీడియోలను జాక్వెలిన్‌ పోస్ట్‌ చేస్తుంటారు. ఈ ఏడాది విడుదలైన ‘రేస్‌-3’ సినిమాలోని ‘హీరియే...’ పాటలోనూ జాక్వెలిన్‌ పోల్‌ డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. హిందీ హీరోయిన్లు ఇషా గుప్తా, తెలుగులో ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌’ సినిమాల్లో నటించిన యామీ గౌతమ్‌ నయా ఫిట్‌నెస్‌ మంత్ర ఈ పోల్‌ డ్యాన్సే! ‘‘ప్రస్తుతం పోల్‌ డ్యాన్స్‌ని ఎంజాయ్‌ చేస్తున్నా. ఫిట్‌నెస్‌ని మెరుగుపరచుకోవడానికి గొప్ప మార్గం కూడా! మన ఫిట్‌నెస్‌ లెవల్స్‌కి పోల్‌ డ్యాన్స్‌ సవాల్‌ విసురుతుంది’’ అని యామీ గౌతమ్‌ పేర్కొన్నారు.
 
పాట కోసం పోల్‌ డ్యాన్స్‌ నేర్చుకుని తర్వాత ఫిట్‌నెస్‌ కోసం కంటిన్యూ చేస్తున్న కథానాయికలు కొందరయితే... కేవలం ఫిట్‌నెస్‌ కోసమే పోల్‌ డ్యాన్స్‌ నేర్చుకుంటున్న వారు కొందరున్నారు. ఇషా గుప్తా, యామీ గౌతమ్‌, ‘హార్ట్‌ ఎటాక్‌’ ఫేమ్‌ అదా శర్మ, ‘నేల టికెట్‌’ ఫేమ్‌ మాళవికా శర్మ రెండో కేటగిరీకి వస్తారు. పవన్‌ కల్యాణ్‌ ‘తీన్‌మార్‌’, మంచు మనోజ్‌ ‘మిస్టర్‌ నూకయ్య’ సినిమాల్లో హీరోయిన్‌గా, రామ్‌చరణ్‌ ‘బ్రూస్‌లీ’లో హీరో అక్కగా నటించిన కృతి కర్బందా మాత్రం మొదటి కేటగిరీలోకి వస్తారు. ఈమె హిందీ సినిమా ‘హౌస్‌ఫుల్‌-4’ కోసం పోల్‌ డ్యాన్స్‌ క్లాసులకు వెళ్లారు. అక్కణ్ణుంచి ఫిట్‌నెస్‌ కోసం చేస్తున్నారు. పోల్‌ డ్యాన్స్‌కి పెద్దగా ఖర్చూ లేదు... పరుగులు పెట్టాల్సిన అవసరమూ లేదు... కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు జిమ్‌ కోసం అన్వేషించాల్సిన పనీ లేదు. జస్ట్‌... ఓ పోల్‌ ఉంటే చాలు! దాన్ని ఫిట్‌నెస్‌ పోల్‌గా మార్చుకోవచ్చు!
 
‘‘పోల్‌ డ్యాన్స్‌ నేర్చుకునే కొత్తల్లో నొప్పి కలగడంతో పాటు గాయాలు కూడా అవుతున్నాయి. కష్టమైనా పోల్‌ డ్యాన్స్‌ ఎందుకు చేస్తున్నానంటే... దీని వల్ల ఫిట్‌నెస్‌ మెరుగవడమే కాదు, ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. డ్యాన్స్‌ కూడా మెరుగవుతుంది’’
- కృతి కర్బందా
 
‘‘ఫిట్‌నెస్‌ మీద ప్రేమే నన్ను పోల్‌ డ్యాన్స్‌కి దగ్గర చేసింది. కొన్ని రోజులుగా నేనిది ప్రాక్టీస్‌ చేస్తున్నా. చూస్తే చేయడం సులభమే అన్నట్టు ఉంటుంది. కానీ, నేర్చుకోవడం కష్టమే. ఒక్కసారి నేర్చుకున్నాక... అమేజింగ్‌గా అనిపిస్తుంది. పోల్‌ డ్యాన్స్‌ వల్ల బాడీ ఫ్లెక్సిబుల్‌గానూ ఉంటుంది’’
- మాళవికా శర్మ
 
‘‘ఒక్కటే తరహా వర్కవుట్స్‌ చేయడం నాకిష్టం లేదు! అందుకని, వీలును బట్టి మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వర్కవుట్స్‌ చేస్తా. జిమ్‌కి వెళ్తా. కొన్నిసార్లు యోగా చేస్తా. ట్రావెలింగ్‌ సమయాల్లో అయితే పోల్‌ డ్యాన్స్‌, బెల్లీ డ్యాన్స్‌ చేస్తా! ఎందుకంటే... ఎక్కువ శ్రమ లేకుండా సులభంగా చేయగల వర్కవుట్స్‌ ఇవి. వీటి వల్ల మనసు ఉల్లాసంగా, మన శరీరం ఫిట్‌గా ఉంటుంది’’
- అదా శర్మ