యోగ.. డాన్స్‌.. ‘బుటి యోగ’

24-04-2018: మానసిక ప్రశాంతత కోసం యోగ, ఫిట్‌నెస్‌ కోసం రకరకాల ఎక్సర్‌సైజులు చేస్తుంటారు. అయితే ఈ రెండింటినీ మిక్స్‌ చేసి బిజ్జీగోల్డ్‌ అనే సెలబ్రిటీ ట్రైనర్‌ ఐదారేళ్ల క్రితమే ‘బుటి యోగా’కు రూపకల్పన చేసింది. ఇప్పుడా యోగా ట్రెండ్‌గా మారింది. కేవలం ఒక చోట కూర్చుని యోగా సాధన చేయడం కాకుండా ‘బుటి యోగ’ వల్ల ఒంట్లో క్యాలరీలను తగ్గించుకోవచ్చు. 75 నిమిషాలు ఈ యోగాసాధన చేస్తే 800 నుంచి 1000 క్యాలరీలు ఖర్చవుతాయని బుటి యోగా సాధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట తగ్గించుకుని, స్లిమ్‌గా మారాలంటే ‘బుటి యోగ’ చేయాల్సిందే.

 ఈ యోగ సాధన ఎస్‌ఎస్‌టీ (స్పిర్చువల్‌ స్ట్రక్చర్‌ టెక్నిక్‌)ని అనుసరించి రూపుదిద్దుకుంది. ఫిజికల్‌గా, స్పిర్చువల్‌గా శరీరంపై, మనసుపై ఏకకాలంలో ప్రభావం చూపుతుంది. ‘‘బుటి యోగ అనేది యోగాకు అనుసంధానంగా ఉండే వర్కవుట్‌ లాంటిది. ప్రధానంగా మహిళల కోసమే రూపొందించింది. డాన్స్‌, యోగాలను మిక్స్‌ చేయడం వల్ల ఫన్నీగా ఉంటూనే క్యాలరీలను కరిగిస్తుంది’’ అని యోగా ట్రైనర్‌ రినా హిండోచా అంటున్నారు. దీనివల్ల ముఖ్యంగా పొట్టభాగంలో ఉన్న కొవ్వు కరిగి, ఫ్లాట్‌గా తయారవుతుంది. అందుకే ఆధునిక మహిళలు ఈ సరికొత్త యోగా వైపు మొగ్గుచూపుతున్నారు.
 
‘బుటి యోగ’ గిరిజన నృత్యాలు, హిప్‌ హాప్‌ పాటలతో లయబద్ధంగా సాగుతుంది. యోగ ప్రారంభం నుంచి చివరిదాకా ఒక క్రమపద్ధతిలో, కదలికలతో శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. మనసు కేంద్రీకృతమైతేగానీ, పాటలకు తగ్గట్టుగా శరీరాన్ని కదపలేం. ఇవి రెండూ ఏకకాలంలో సాగుతాయి కాబట్టి ఈ ‘బుటి యోగ’తో చక్కని ఫలితాలుంటాయని అంటున్నారు నిపుణులు. కాకపోతే వట్టి పాదాలతోనే పాల్గొంటారు కాబట్టి, మూవ్‌మెంట్స్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. క్యాలరీలు ఖర్చు చేయడం కోసం నగరాల్లో మహిళలు ప్రస్తుతం ‘బుటి యోగ’ వైపు మొగ్గుచూపుతున్నారు.