భుజంగాసనంతో శ్వాసకోశ వ్యాధులు దూరం

 నెల్లూరు, ఆగస్టు 12: ఈ వర్షాకాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల్లో ప్రధానమైనవి  శ్వాసకోశ వ్యాధులు. వీటిని నియంత్రించడానికి యోగాసనాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో భుజంగాసనం ప్రసిద్ధి చెందింది. ఈ ఆసనం రోజూ వేస్తే శ్వాసకోశ వ్యాధుల నుంచి బయటపడవచ్చని నెల్లూరులోని ప్రణవ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా అనవెల్‌నెస్‌ సంస్థ నిర్వాహకుడు, యోగా మాస్టర్‌ చంద్రశేఖర్‌ అంటున్నారు. శరీరంలోని అన్ని భాగాలకు శక్తినిచ్చే ఆసనం ఇదని, ప్రత్యేకించి యువతకు ఉపయోగకర మని చెబుతున్నారు. ఈ ఆసనం ఎలా వేయాలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ..

ప్రశాంతమైన గదిలో మెత్తటి దుప్పటి పరుచుకోవాలి. నెమ్మదిగా బోర్ల పడుకోవాలి, గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచి, ఛాతీ పక్కన అరచేతులు ఆని ఉండేట ట్లుగా మోచేతులు పైకి ఉండేటట్లు చూసుకోవాలి. జారుగా చాపిన పాదాలు ఒకదానికొకటి ఆని ఉండేటట్లు చూసుకోవాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బరువును అరచేతిలపై ఉంచి ఛాతిని తద్వారా మెడను బాగా పైకి లేపాలి. బాగా తలను పైకి ఎత్తి ఆకాశం వైపు చూస్తు న్నట్లు ఉంచుకోవాలి. ఈ భంగిమలో వెన్ను చక్కగా ఆర్థచంద్రాకారంలాగా వెనుకకు వంగి ఉంటుంది. ఇలా ఎవరి అవకాశాన్ని బట్టివారు ఛాతీని పైకిలేపాలి. లేదంటే బొడ్డును కొలమానంగా ఉంచుకుని నడుము నుంచి పొట్ట, ఛాతీని పైకిలేపాలి ఈ సమయంలో చేతులను నిటారుగా లేపి ఉంచేకంటే కొంచెం వంచి ఉం డడం మంచిది. ఇలా చేయడం వల్ల భుజాలు, చేతులు శక్తివంతమవుతాయి. ఇది ఆసనం పాము పడగవిప్పినట్లు ఉంటుంది. ఇలా శ్వాస తీసుకుంటూ భంగిమకు వచ్చి కొంతసేపు ఉండాలి. రోజూ మూడు సార్లు ఈ ఆసనం వేయడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది.  

ఎవరు వేయకూడదు?

గర్భిణులు ఈ ఆసనం వేయరాదు. పొట్టపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందును దీనిని గర్భిణులు వేయరాదని నిపుణులు చెబుతు న్నారు. అలాగే వెన్నుకు సంబంధించి ఏవైనా ఇంజక్షన్లు వేయించుకుని శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు కూ డా వేయరాదు. మిగిలిన స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్థుల వరకు ఎవరైనా ఈ ఆసనాన్ని వేయవచ్చు. 

ఉపయోగాలు 
ఈ ఆసనం వేయడం వల్ల గొంతు దగ్గర ఉండే థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ అనే మెడకు సంబంధించిన వ్యాధి రాకుండా ఇది నివారిస్తుంది. ఊపిరితిత్తులు వ్యాకోచం చెంది శ్వాస బాగా ఆడడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవు. శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది. వెన్నుకు బాగా శక్తివచ్చి వెన్నులోని డిస్క్‌ల సమస్యలు తగ్గిస్తుంది. నాభి వరకు బాగా సాధన చేయడం వల్ల పొట్ట కండరాలు గట్టిపడటమేకాక జీర్ణశక్తి పెరుగుతుంది.