ఈ యోగాసనాలు బెస్ట్‌

14-05-2018:

గరుడాసన
ఈ ఆసనంలో ఒకే అంశం మీద మనసు లగ్నం చేయాలి. ఇది ఒత్తిడిని నియంత్రించడానికి బాగా ఉపయోగపడుతుంది. భుజాలు, తుంటి భాగంలోని కండరాలు రిలాక్స్‌ అయ్యేందుకు కూడా సాయపడుతుంది. 
 
యోగ నిద్ర
యోగ నిద్ర అనేది శారీరక, మానసిక, భావోద్వేగాల పరంగా విశ్రాంతి పొందేలా చేస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఇది బాగా తోడ్పడుతుంది.
 
ఉత్థానాసన
విపరీతమైన ఆలోచనలు కలిగినవారి మనసు నిశ్శబ్దంగా ఉండటానికి, నెర్వ్‌ససిస్టమ్‌ బ్యాలెన్స్‌ కావడానికి ఈ ఆసనం సహాయపడుతుంది.
  
వజ్రాసన
ఈ ఆసనం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం, మనసు ప్రశాంతతకు తోడ్పడుతుంది.
 
ఇలా కూడా బయటపడొచ్చు
ఒత్తిడికి కారణాలను అన్వేషించాలి. అది శారీరకమా లేక మానసికమా అనే సంగతి తెలుసుకోవాలి. కొన్ని ఒత్తిళ్లు పాక్షికంగా ఉంటాయి. కొంతమంది టీ, సిగరెట్‌ తాగి టెన్షన్‌ నుంచి కాస్త రిలాక్స్‌ అయ్యామని భావిస్తుంటారు. అయితే ఆ కాసేపు ఉపశమనం కలిగినా దీర్ఘకాలంలో వీటివల్ల ఇతర ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చు.
పూర్తిచేయగలిగే లక్ష్యాలను ఏర్పరుచుకోవాలి. ఆ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని చేరుకోగలిగితే చాలావరకూ ఒత్తిడితగ్గుతుంది.
రోజువారీ కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనవాటిని ముందుగా చేయటానికి ప్రయత్నించాలి. అనవసర విషయాలకు ప్రాధాన్యతఇవ్వక పోతే సమయం చాలావరకూ ఆదా అవుతుంది. మొహమాటాలవల్ల కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని తెలుసుకుంటే మంచిది.
పోటీకోసమంటూ పరుగులు తీయకూడదు. మీ ప్రతిభ ఏమిటో మీకు తెలుసు కాబట్టి ఆ స్థాయిలోనే పనిచేస్తే బెటర్‌.
ఒకవేళ మీ వల్ల ఏదైనా పని కాకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. బెటర్‌లక్‌ నెక్ట్స్‌ అనుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీకోసం కొంతసమయం కేటాయించుకోవడం వల్ల కూడా ఒత్తిడిని అధిగమించవచ్చు.
స్నానం చేయడం.. సంగీతం వినటం వల్ల కూడా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే ఆ స్నానం హడావిడిగా చేస్తే ఫలితం ఉండదు. నెమ్మదిగా, తనివితీరా స్నానం చేయటం వల్ల మాత్రమే ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.