మెనోపాజ్‌కూ.. కీళ్లనొప్పులకు ఏమైనా సంబంధం ఉందా?

23-07-2017:నా వయసు 45. మెనోపాజ్‌ మొదలై ఇప్పటికి నాలుగేళ్లు. అయితే గత ఏడాదిగా, నేను కీళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటున్నాను. మెనోపాజ్‌కూ ఈ కీళ్లనొప్పులకు ఏమైనా సంబంధం ఉందా? లేక ఇది పూర్తిగా వేరే సమస్యా. ఇప్పుడే ఈ సమస్య ఇలా ఉంటే ఇంకొన్నాళ్లు పోతే ఎలా ఉంటుందా? అని ఆందోళన పడుతున్నాను. ఈ సమస్యను ఆదిలోనే నివారించే మార్గం చెప్పండి.

- వి. కారుణ్య, నిజాంపేట
 
 
పురుషులకు గానీ, స్త్రీలకు గానీ దాదాపు 35 ఏళ్లనుంచే ఎముకల్లో క్యాల్షియం తగ్గిపోవడం మొదలవుతుంది. ప్రత్యేకించి స్త్రీల విషయంలో అయితే మెనోపాజ్‌కు చేరుకున్నాక వారిలో క్యాల్షియం తగ్గిపోయే వేగం మరింత పెరుగుతుంది. ఈస్ట్రోజన్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవడమే ఇందుకు కారణం. ఏళ్లు గడుస్తూ 70వ ఏటికి చేరుకునే నాటికి ఎముకలు మరింతగా బలహీనపడతాయి. బోన్‌ డెన్సిటీ పరీక్షల్లో ఈ లోపం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
స్త్రీలందరిలోనూ ఇలాగే జరుగుతుందని కూడా కాదు, కొంద రు స్త్రీలు మెనోపాజ్‌ దాటినా వారి ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి పడిపోదు. క్యాల్షియం లోపమూ అంతగా ఉండదు.
మెనోపాజ్‌తో ముడిపడి ఉన్న ఆస్టియో పొరోసిస్‌ అనే ఈ కీళ్లవ్యాది వల్ల వృద్ధాప్యం వచ్చే
సరికి శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మనిషి ఎత్తు తగ్గిపోతుంది. వెన్ను వంగిపోతుంది. ఎముకలు తేలిగ్గా విరిగిపోతాయి.
ఇలాంటి స్త్రీలకు రోజుకు 50 నుంచి 1000 మి. గ్రాముల క్యాల్షియం అవసరం అవుతుంది. రోజూ గ్లాసు పాలు లేదా పెరుగు తీసుకుంటే ఆ అవసరం తీరుతుంది. లేదా రోజూ రెండు గుడ్లు గానీ, నువ్వులు, బెల్లం కలిపి చేసిన లడ్డూలు గానీ, సపోటా పండ్లు గానీ తరుచూ తీసుకోవడం వీరికి చాలా అవసరం.
జాగ్రత్తల విషయంలో అయితే రోజూ వాకింగ్‌ చేయడం వీరికి తప్పనిసరి.
ఏమైనా మీరు సాధ్యమైనంత త్వరగా ఒక గైనకాలజిస్టును సంప్రదించడం చాలా
అవసరం.
 
- పి. వసుధ, గైనకాలజిస్టు