పీరియడ్స్‌ గురించి ముందే తెలుస్తుందా?

1-07-2017: అందరిలా నాకు పీరియడ్స్‌ ఒక నిర్ధిష్ట కాల వ్యవధిలో రావు. దీనివల్ల ప్రతిసారీ పలురకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. అలా కాకుండా పీరియడ్స్‌ రావడానికి ఒకటి రెండు వారాల ముందే పసిగట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి.

- ఎస్‌. కీర్తిక, అనంతపురం
 
నిర్ణీత కాల వ్యవధి అంటూ లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు పీరియడ్స్‌ రావడం వల్ల కలిగే ఇబ్బందులు చాలానే ఉంటాయి. అలాంటి వారు ఈ కింది లక్షణాల ఆధారంగా ఆ పీరియడ్స్‌ రాబోయే సమయాన్ని ఒకటి రెండు వారాల ముందే పసిగట్టే అవకాశం ఉంది.
వాటిల్లో ముఖ్యంగా.....
 
అండం విడుదల అయ్యే సమయంలో పొత్తి కడుపు కింది భాగంలో హఠాత్తుగా నొప్పిలాంటిది మొదలవుతుంది. ఈ నొప్పి వచ్చిన రెండు వారాలకు పీరియడ్స్‌ రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి.
అండం విడుదలకూ, పీరియడ్స్‌కూ మధ్య రోజుల్లో వక్షోజాలు బిగుతుగానూ, బరువుగానూ ఉండి, ఏ చిన్న ఒత్తిడి కలిగినా నొప్పి అనిపిస్తుంది. ఇలా జరగ్గానే పీరియడ్స్‌ వచ్చే సమయం ఆసన్నమైందని గ్రహించాలి.
పీరియడ్స్‌ దగ్గర పడుతున్నప్పుడు తలనొప్పి, వెన్నునొప్పి, నడుము పట్టేయడం వంటివి ఉంటాయి. నిద్ర. సరిగా పట్టదు. ముఖంపై మొటిమలు వస్తాయి. రోజంతా దిగులుగానూ, చికాకుగానూ ఉంటుంది.
ఈ అన్ని లక్షణాలు అందరిలోనూ ఉంటాయని కాదు. వీటిలో ఏ కొన్ని లక్షణాలు కనిపించినా పీరియడ్స్‌ ప్రారంభం కాబోతున్నట్లు గ్రహించాలి.
డాక్టర్‌ వి.ఎల్‌. సీత, గైనకాలజిస్ట్‌