ముందస్తు మెనోపాజ్‌తో ఆయుక్షీణం!

ఆంధ్రజ్యోతి,రోటర్‌డామ్‌, సెప్టెంబరు 17: రుతుచక్రం త్వరగా ఆగిపోవడం(మెనోపాజ్‌) వల్ల మహిళలకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది! స్త్రీలకు 45 ఏళ్ల కంటే ముందే రుతుచక్రం ఆగిపోతే వారి జీవితకాలం కూడా తగ్గిపోయే అవకాశం ఉందని వెల్లడైంది. మహిళల్లో 45-50 ఏళ్ల మధ్య సహజంగానే రుతుచక్రం ఆగిపోతుంది. దీనివల్ల అండాశయాల్లో ఈస్ట్రోజన్‌, ఇతర హార్మోన్ల ఉత్పత్తి నిలిచిపోతుంది. అయితే, 45 ఏళ్లలోపే రుతుచక్రం ఆగిపోతే స్త్రీలకు గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతున్నట్లు నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో గల ఎరాస్మస్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 1990ల నుంచీ 3.10 లక్షల మంది మహిళలపై జరిగిన 33 పరిశోధనల ఫలితాలను విశ్లేషించి, వారు ఈ విషయం గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా పదిమందిలో ఒకరికి 45 ఏళ్లకే రుతుచక్రం ఆగిపోతోందని వర్సిటీ పరిశోధన బృందం సారథి డాక్టర్‌ తౌలాంత మూకా తెలిపారు. అలాగే చిన్న వయసులోనే రుతుచక్రం(పీరియడ్స్‌) మొదలై, 45 ఏళ్లలోపే ఆగిపోయేవారి జీవితకాలం కూడా తగ్గుతుందని మరో పరిశోధనలో వెల్లడైంది. ఆలస్యంగా పీరియడ్స్‌ మొదలై ఆలస్యంగా రుతుచక్రం ఆగిపోయే స్త్రీలే.. 90 ఏళ్ల వరకూ జీవించే అవకాశాలు ఎక్కువని ‘జామా కార్డియాలజీ’ జర్నల్‌లో కొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.