రుతుక్రమ లోపాలకు కారణాలేమిటి?

ఆంధ్రజ్యోతి, 18-09-2017: నా వయసు 28. గడచిన ఐదేళ్లుగా ఏనాడూ రుతుక్రమం సరిగా లేదు. ఒక్కోసారి 20 రోజులకే వస్తే, ఒక్కోసారి 40 రోజులు దాటుతుంది. ప్రతి నెలా ఈ విషయం అటు శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ అపక్రమ స్థితికి అసలు కారణాలేమిటో తెలిస్తే ఆ విషయాల్లో జాగ్రత్త పడొచ్చు కదా అనిపిస్తోంది. ఆ వివరాలు తెలియచేస్తారా?     - సి. కరుణ, అనంతపూర్‌
 
రుతుక్రమం కాల వ్యవధిలో తేడా రావడానికి, బహిష్టు ఎక్కువ రోజులు లేదా తక్కువ రోజులు ఉండడానికి చాలా కారణాలు ఉన్నా వాటిలో ప్రధానమైనవి ఇవి...
భోజనానికి సరియైున వేళలు పాటించకపోవడం.
గర్భనిరోధక మాత్రల్ని దీర్ఘకాలికంగా వాడుతూ ఉండడం.
అతిగా వ్యాయామం గానీ, శరీరశ్రమ గానీ చేయడం.
తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు.
వాతావరణ మార్పులకు తట్టుకోలేని అశక్తత.
ఎక్కువ కాలంగా యాంగ్జయిటీ, డిప్రెషన్‌ మందులు వాడటం.
శరీరంలో ఐరన్‌ లోపం ఎక్కువగా ఉండడం.
అంతకు ముందు ఏదైనా పెద్ద శస్త్ర చికిత్స జరిగి ఉండడం.
థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయకపోవడం.
మెదడులోని పిట్యూటరీ గ్రంథి మీద గడ్డలు ఏర్పడటం,
గర్భాశయ సమస్యలు
ఇలాంటి పలు కారణాలు రుతుక్రమాన్ని దెబ్బ తీస్తుంటాయి. అందుకే ఏ కారణంగా ఈ సమస్య ఉందో తెలుసుకోవడానికి గైనకాలజిస్టును సంప్రదించడం చాలా అవసరం. సరియైున చికిత్సలు తీసుకుంటే ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.
- డాక్టర్‌ కె. శ్రావణి,
కన్సల్టెంట్‌ గైనకాలజిస్టు