రక్తస్రావం అరికట్టాలంటే

ఆంధ్రజ్యోతి(22/07/15): శరీరంలో రక్తాన్ని మోసుకుపోయే రక్తనాళాలు ప్రమాదవశాత్తుగానీ లేదా వ్యాధికారకంగా గానీ చిట్లి రక్తం స్రవించటాన్ని ‘రక్తపిత్తం’ అని ఆయుర్వేదంలో పిలుస్తారు. దీన్నే ఆధునిక వైద్యులు ‘హెమరేజ్‌’ అని అంటారు. సహజంగా ప్రమాదాల్లో జరిగే గాయాలవల్లగానీ, మూకుమ్మడి దాడుల్లో పిడి గుద్దుల వల్ల, కత్తులు, బరిసెలు మొదలైన మారణాయుధాలతో పొడుచుకోవటం, నరకటం వల్ల శరీరం లోపలి భాగాల్లోని అవయవాలు గానీ, శరీరం బయట గానీ ఏర్పడిన గాయాల నుంచి రక్తస్రావం అధికంగా జరుగుతుంది. ఇలాంటి స్థితిలో ధమనులు పగిలి రక్తస్రావం జరిగితే వెంటనే వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. అదే సిరల విషయంలో అయితే ప్రమాదం ఉండదు. ధమనుల నుంచి స్రవించే రక్తం ముదురు రంగులో ఉండి ఒక్కసారిగా బయటకు దూసుకుని వస్తుంది. గుండె చాలా దడగా ఉంటుంది. అదే రక్తస్రావం సిరల నుంచి మెల్లగా స్రవిస్తుంది. ముఖ్యంగా తొడ భాగంలోని ధమని రక్తపాతానికి గురైతే రక్తం అతి వేగంగా, అధికంగా బయటకు వస్తుంది. సరైన సమయంలో వైద్య సహాయం అందకపోతే ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. చిన్న చిన్న ధమనులు చిట్లినప్పుడు ఏ చికిత్స లేకుండానే చిట్లిన భాగాల నుంచి రక్తస్రావం కొద్దిసేపటికే ఆగిపోతుంది. కొన్ని సులభ చికిత్సల ద్వారా ఈ రక్తస్రావాలను అరికట్టటం ఎలాగో చూడండి!

50 గ్రాముల ఉసిరిక రసాన్ని తేనె, చక్కెర కలిపి రోజుకి మూడుసార్లు తాగిస్తే రక్తపిత్తం వ్యాధి తగ్గుతుంది.
బూడిద గుమ్మడికాయ రసాన్ని 50 గ్రాముల చొప్పున రోజుకి మూడుసార్లు తాగిస్తే రక్తపిత్తం తగ్గుతుంది.
ఉసిరిక వేరును నేతిలో వేయించి నీటితో మెత్తగా నూరి తలపై పట్టువేస్తే ముక్కు నుంచి కారే రక్తం అతి త్వరగా తగ్గిపోతుంది.
శొంఠిని నీటిలో నూరి ఆవుపాలు, చక్కెరతో కలిపి తాగుతుంటే మూత్రనాళం నుంచి స్రవించే రక్తం ఆగిపోతుంది.
చెరుకు రసాన్ని తాగుతుంటే రక్తపిత్తం తగ్గుతుంది.
మేడిపండ్ల రసాన్ని సేవించిన ఫలితం ఉంటుంది.
మూత్రమార్గం నుంచి బాధతో కూడిన రక్తస్రావం అతి త్వరగా తగ్గాలంటే పల్లేరు కాయల తోలు తీసి కాచిన ఆవు పాలు, చక్కెర చేర్చి తాగుతుండాలి. 
        నేరేడు మట్టను నీటిలో నానబెట్టి ఆ నీటిలో తేనె చేర్చి తాగుతుంటే రక్తపిత్తం తగ్గుతుంది.
దానిమ్మ పువ్వుల రసాన్ని ముక్కులో పిండితే రక్తస్రావం ఆగుతుంది.
దానిమ్మపండు బెరడు మెత్తగా నూరి చక్కెర కలిపి తినిపిస్తే నోరు, ముక్కు, చెవులు మొదలైన భాగాల నుంచి రక్తస్రావం ఆగిపోతుంది.
ద్రాక్షపండ్ల రసంలో తేనె కలిపి తాగిస్తే రక్తపిత్తం తగ్గుతుంది.
పచ్చి గరిక వేరు రసాన్ని పీల్చితే ముక్కు నుంచి వచ్చే రక్తస్రావం ఆగిపోతుంది.
ఖర్జూర పండ్లను నీటిలో నాన్చి తేనె కలిపి తినిపిస్తే రక్తస్రావం ఆగిపోతుంది.


 డాక్టర్‌ కందమూరి 

ఆయుర్వేద కేంద్రం