నెలలు నిండకుండా పుడితే!

ఆంధ్రజ్యోతి, 20-03-2018: మా బాబు నెలలు నిండకుండా ఏడో నెలలోనే పుట్టాడు. పుట్టిన వెంటనే కొన్ని రోజులపాటు ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఇప్పుడు బాబు వయసు 12 నెలలు. ఎదుగుదల బాగానే ఉంది. అయితే, ఇలా పుట్టిన పిల్లలకు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనని నా అనుమానం!

 
సాధారణంగా గర్భం దాల్చిన 37వ వారం, లేదా ప్రసవానికి మూడు వారాల ముందుగానే బిడ్డ పుడితే ఆ ప్రసవాన్ని ‘ప్రిమెచ్యూర్‌ బర్త్‌’ అంటారు. అయితే నెలలు నిండకుండా పుట్టినంత మాత్రాన మిగతా పిల్లల్లా ఉండరనుకుంటే పొరపాటు. పుట్టిన సమయంలో బిడ్డ ఊపిరితిత్తులు శ్వాస తీసుకోలేనంత బలంగా ఉండవు కాబట్టి ఇంక్యుబేటర్‌లో పెట్టక తప్పదు. అలాగే ఆ సమయంలో బిడ్డ శరీర ఉష్ణోగ్రతను సమం చేయటం కోసం కూడా ఇంక్యుబేటర్‌ను ఉపయోగిస్తారు. నెలలు నిండకుండా పుట్టినా, పుట్టిన వెంటనే తగిన వైద్య చికిత్స అందిస్తారు కాబట్టి ఇలాంటి పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తవు. అయితే కొన్ని నెలల పాటు ఈ పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో ఇన్‌ఫెక్షన్లు తేలికగా సోకుతాయి. కాబట్టి ప్రిమెచ్యూర్‌ బేబీస్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాలను జీర్ణం చేసుకోవటంలో ఇబ్బంది ఉండి విరేచనాలు అవుతున్నా, వాంతులు చేసుకుంటున్నా వెంటనే వైద్యులకు చూపించాలి. క్రమం తప్పక వైద్యుల చేత పరీక్షలు చేయిస్తూ పిల్లలకు శక్తి సమకూరేవరకూ జాగ్రత్తగా ఉండగలిగితే, ప్రిమెచ్యూర్‌ బేబీస్‌ కూడా మిగతా పిల్లల్లాగే ఆరోగ్యంగా ఎదుగుతారు.
- డాక్టర్‌ దినేశ్‌ కుమార్‌ చిర్ల,
పిడియాట్రీషియన్‌ అండ్‌ నియో నాటాలజిస్ట్‌,
రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌,
బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.