కాన్పు తర్వాత బరువు తగ్గాలంటే...

13-06-2019: అమ్మతనం ప్రతి మహిళ జీవితంలో అనిర్వచనీయమైన అనుభూతి. కాన్పు తర్వాత పసికందు బాధ్యతలు, అధిక బరువు తల్లులను కొంత వరకూ భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే ఆహారనియమాలతో పాటు తేలికైన వ్యాయామాలు చేయడం ద్వారా మునుపటి శరీరాకృతిలోకి మారవచ్చంటున్నారు ఫిట్‌నెస్‌, ఆరోగ్య నిపుణుడు యశోవర్ధన్‌ సింగ్‌. ఆయన చెబుతున్న కొన్ని చిట్కాలివి...
 
క్యాలరీలు: వేగంగా బరువు తగ్గాలనే ఆలోచనతో మొత్తానికే క్యాలరీలను తగ్గించడం సరికాదు. అయితే మీరు రోజు తినే ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉంటున్నాయో గమనించడం ముఖ్యం. బరువు తగ్గేందుకు మాంసకృత్తులు, కొవ్వులు, ప్రొటీన్స్‌ వంటి సూక్ష్మ పోషకాలను సరిపడా తీసుకోవాలి. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం మితంగా తినాలి.
 
ఆహరం ఎంపిక: కాన్పు తర్వాత బరువు తగ్గాలనుకునే మహిళలు పోషకాహారం తినడం ఎంతో ముఖ్యం. అన్నంతో పాటు పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తుల్ని డైట్‌లో భాగం చేసుకోవాలి. పీచుపదార్థాలున్న ఆహారపదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. దాంతో జీర్ణసంబంధ సమస్యలు దరిచేరవు.
 
నీళ్లు: శరీరంలో నీరు తగ్గిపోకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. రోజులో మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. దీంతో శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. జీవక్రియలు మెరుగవుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
 
నిద్ర: కాన్పు తర్వాత మహిళలు చాలినంత నిద్ర పోయేందుకు అవకాశం తక్కువ. అయితే వీరికి కంటినిండా నిద్ర ఉండడం ఎంతో ముఖ్యం. నిద్ర చాలకపోతే మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. దీంతో బరువు పెరిగేందుకు ఆస్కారముంది.
 
వర్కవుట్‌: బరువు తగ్గేందుకు సరైన ఆహారంతో పాటు వ్యాయామమూ అవసరమే. ఇంట్లోనే తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు చేయడం మంచిది. మొదట్లో చిన్న బరువులు ఎత్తాలి. రెసిస్టన్స్‌ బ్యాండ్స్‌తో వర్కవుట్‌ చేయాలి. రోజు గంటపాటు వ్యాయమాలు చేయడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు.
 
యోగ: దీంతో శరీరానికే కాదు మనసుకూ వ్యాయామం లభిస్తుంది. యోగ చేయడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. శ్వాస మీద ధ్యాస పెరుగుతుంది. మెదడుకూ విశ్రాంతి దొరకుతుంది.