చికిత్స ఉంది! తీసేయకండి!!

ఆంధ్రజ్యోతి, 31-07-2018: సంతానానికి స్థావరంగా ఉండే గర్భాశయం కొందరిలో కణుతులకు (ఫైబ్రాయిడ్స్‌) నిలయమవుతుంది. వాస్తవానికి ఈ కణుతుల వల్ల వచ్చే పెద్ద ప్రమాదమేమీ లేదు. అయితే, ఇవి ఏదో ఒక దశలో కేన్సర్‌గా మారే ప్రమాదం ఉందని భయభ్రాంతికి గురిచేయడం ఆనవాయితీగా మారింది. నిజానికి, ఫైబ్రాయిడ్స్‌ కేన్సర్‌గా మారే అవకాశాలు 00.1 శాతం కన్నా తక్కువే. అలాంటిది కేన్సర్‌గా మారే అవకాశాలు నూటికి నూరు శాతం అన్నట్లు, కోట్లాది మందికి సర్జరీ చేసి గర్భసంచీలను తొలగిస్తూ వచ్చారు. అంటే ఏమిటి? సంతాన అవకాశాలు శాశ్వతంగా లేకుండాపోవడమే. అయితే, ఫైబ్రాయిడ్‌ ఎంబోలైజేషన్‌ చికిత్స ద్వారా గర్భసంచీని తొలగించే అవసరం లేకుండానే ఆ కణుతులు హరించుకుపోయేలా చేయడం సాధ్యమవుతోంది.
 
ఫైబ్రాయిడ్స్‌ పేరు వినపడితే చాలు, గర్భసంచీని తొలగించే ప్రక్రియే గుర్తుకొస్తుంది చాలామందికి. అప్పటికే ఒకరో ఇద్దరో బిడ్డలు ఉన్నారన్న ఆ ఒక్క మాట చాలు గర్భసంచీని తొలగించేందుకు సిద్ధమైపోవడానికి. ఒకవేళ అప్పటికింకా పిల్లలు కలగకపోయినా ఆగేదేమీ లేదు. కేన్సర్‌ పేరుతో భయపెట్టి నిరాటంకంగా సర్జరీలు చేస్తూ వస్తున్నారు. అయితే, సంతానానికే కాదు పలు ఇతర కార్యాలకు కూడా గర్భసంచీ ముఖ్యమే. హఠాత్తుగా దాన్ని తొలగించివేయడం వల్ల ఆ రకమైన పనులన్నీ కుంటుపడతాయి. మొత్తం శరీర వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది.
 
ఏమిటా దుష్ప్రభావాలు?
గర్భసంచీని తొలగించడం వల్ల ఎదురయ్యే తొలి పరిణామం రుతుక్రమం ఆగిపోయే మెనోపాజ్‌ సమస్య. దీనివల్ల హార్మోన్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుంది. ఫలితంగా, వీరిలో అసహనం, ప్రతి చిన్న విషయానికీ చికాకుపడే మనస్తత్వం మొదలవుతాయి.

దీనికి తోడు స్త్రీలల్లోని ప్రధాన హార్మోన్‌ ఈస్ట్రోజన్‌ తగ్గిపోతుంది. ఫలితంగా ఒళ్లంతా సెగలు పొగలుగా ఉంటూ, దాదాపు అన్నివేళల్లోనూ చెమలు కారుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గటం వల్ల గుండె జబ్బులకు గుర య్యే ప్రమాదం కూడా ఎక్కువే.

ఎముకలు బలహీనపడం దీనివల్ల ఎదురయ్యే మరో సమస్య. ఇది మూత్ర నియంత్రణ ను దెబ్బ తీస్తుంది. ఫలితంగా, తుమ్మినా, దగ్గినా మూత్రం చుక్కలు చుక్కలు పడుతూ దుస్తులు తడిసిపోతాయి.

జననాంగం పొడిబారిపోతుంది దీనివల్ల రతిలో నొప్పి కలిగే అవకాశం ఉంది.

ఏమిటీ ఫైబ్రాయిడ్స్‌?
గర్భధారణ కోసం ఉద్దేశించి ప్రకృతి రూపొందించినదే గర్భసంచీ. అయితే అందుకు భిన్నంగా కొందరి గర్భసంచీలో ఫైబ్రాయిడ్‌ కణుతులు పెరుగుతాయి. ఈ ఫైబ్రాయిడ్లు మొదట్లో ఏ అనారోగ్య లక్షణాలనూ కలిగించవు. కాకపోతే, ఆ కణుతుల పరిమాణాన్ని, అవి ఉన్న ప్రదేశాన్ని బట్టి కొందరిలో నొప్పి, రక్తస్రావం వంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. పరిమాణ పరంగా ఈ ఫైబ్రాయిడ్లు చాలా చిన్నవిగానూ, మరీ పెద్దవిగానూ తయారవుతాయి. ఈ కణుతుల వల్ల కొందరు 5 మాసాల గ ర్భంతో ఉన్నట్లు కనిపిస్తారు. గర్భసంచీలోని ఏ భాగంలోనైనా ఇవి పెరగవచ్చు.
 
మౌలికంగా ఈ ఫైబ్రాయిడ్లు మూడు రకాలుగా ఉంటాయి.
సబ్‌సెరోసల్‌ ఫైబ్రాయిడ్లు
ఇవి గర్భసంచీ వెలుపల పెరుగుతాయి. సాధారణంగా వీటివల్ల రుతుచక్రంలో తేడా ఏదీ ఉండకపోవచ్చు. కానీ, వాటి పరిమాణం పెద్దదైనప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు,
 
ఇంట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్లు
ఇవి గర్భసంచి గోడల్లో పెరుగుతాయి. వీటివల్ల గర్భసంచీ సాధారణ పరిమాణం కన్నా పెద్దగా తయారవుతుంది. ఎక్కువ మందిలో ఈ రకం ఫైబ్రాయిడ్లే కనిపిస్తాయి. దీనివల్ల అధిక రక్తస్రావం, పొత్తికడుపు కింది భాగంలో నొప్పి, ఒత్తిడి ఉంటాయి.
 
సబ్‌మ్యూకోజల్‌ ఫైబ్రాయిడ్లు
ఇవి గర్భాశయంలో చాలా లోపల పెరుగుతాయి, ఇవి చాలా అరుదుగా ఏర్పడే కణుతులు. వీటివల్ల అధికంగా రక్తస్రావం కావడంతో పాటు ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగుతుంది.
 
లక్షణాలు
  • ఎక్కువ రోజులు ఎక్కువ మొత్తంలో రుతుస్రావం కావడం, ఎప్పుడూ వచ్చే విధంగా కాకుండా, రక్తస్రావం ముద్దలు ముద్దలుగా రావడం ఉంటాయి. సహజంగానే ఇది రక్తహీనతకు దారి తీస్తుంది.
  • పొత్తి కడుపులో ఒత్తిడి, బరువుగా అనిపించడంతో పాటు నొప్పిగా కూడా ఉంటుంది,
  • నడుములో గానీ కాళ్లల్లో గానీ నొప్పి,
  • రతిలో నొప్పి అనిపించడం
  • మూత్రాశయం మీద ఒత్తిడి వల్ల పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లవలసి రావడం
  • మలద్వారం పైన ఏర్పడే ఒత్తిడి వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలు తలెత్తడం
  • పొట్ట అసహజంగా పెరిగిపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.
ఇవీ చికిత్సలు

గర్భాశయ ఫైబ్రాయిడ్లకు సంబంధించి వ్యాధి లక్షణాలేమీ కనిపించనప్పుడు చికిత్సలే అవసరం లేదు. ఒకవేళ ఆ లక్షణాలు కనిపించి వ్యాధి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్లు తెలిస్తే కొన్ని రకాల మందులతోనే నయం చేసే అవకాశం ఉంది. కాకపోతే కొన్నిసార్లు ఈ చికిత్సలతో ఫైబ్రాయిడ్లు తగ్గినట్లే తగ్గి, మందులు వేసుకోవడం ఆపేయగానే మళ్లీ పెరగ డం మొదలవుతాయి. ఈ స్థితిలో ఎంబోలైజేషన్‌ చికిత్స అవసరమవుతుంది. ఈ విధానం చాలా సులువైనది. ఇందులో ఇంటర్వెన్షనల్‌ రేడియాలజిస్టు చర్మం పైన చిన్న గాటు పెట్టి ఒక క్యాథెటిర్‌ను రక్తనాళంలోకి పంపిస్తారు. దీంట్లోంచి ఇసుక రేణువు పరిమాణంలో ఉండే కొన్ని పదార్థాలను ఆ రక్తనాళంలోకి పంపడం జరుగుతుంది. ఈ రేణువు వల్ల కణితికి వెళ్లే రక్తనాళం మూసుకుపోతుంది. ఇలా రక్తసరఫరా అందకపోవడంతో కణితి కుంచించుకుపోయి రాలిపోతుంది.

ఫైబ్రాయిడ్‌ ఎంబోలైజేషన్‌ చికిత్స తర్వాత ఆసుపత్రిలో ఆ వ్యక్తి ఒక రోజు ఉంటే సరిపోతుంది ఒకటి కంటే ఎక్కువ గడ్డలు ఉన్న సందర్భాల్లో కూడా ఈ విధానం ఎతో ఉపయుక్తంగా ఉంటుంది. చికిత్స తర్వాత ఆ భాగంలో వచ్చే కొద్దిపాటి వాపు, నొప్పి, పట్టేసినట్లు ఉండడం వంటి చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. వీటికి పెయిన్‌ కిల్లర్స్‌ ఇస్తే సరిపోతుంది. చికిత్స జరిగిన వారం రోజుల్లోనే ఆ వ్యక్తి సాధారణ స్థితికి వచ్చేస్తారు. అప్పుడింక అన్ని పనులూ చేసుకోవచ్చు.

ఇది ఎంతో సులువు
‘‘ఎంబోలైజే షన్‌ చికిత్స తీసుకున్న వారిలో 90 శాతం మంది ఫైబ్రాయిడ్‌ సమస్య నుంచి పూర్తి ఉపశమనాన్ని పొందారు. ఒకసారి ఫైబ్రాయిడ్స్‌ను తొలగించిన తర్వాత అవి తిరిగి తయారు కావడం అనేది చాలా అరుదు. గత ఆరేళ్లుగా ఎంబోలైజేషన్‌ చికిత్స తీసుకున్న వారిలో ఫైబ్రాయిడ్స్‌ మళ్లీ పెరగడం అనేది జరగనేలేదు. అందువల్ల ఏ రకంగా చూసినా ఈ ఎంబోలైజేషన్‌ చికిత్స ఎంతో సులువైనది, సురక్షితమైనది.’’
- డాక్టర్‌ రాజా వి. కొప్పాల
ఇంటర్వెన్షనల్‌ రేడియాలజిస్ట్‌,
అవిస్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌