నెలసరి సమయంలో ఏం తినాలి..? ఏమేం తినకూడదు..?

ఆంధ్రజ్యోతి (22-12-2019):

ప్రశ్న: నాకు ఇరవై రెండేళ్లు. నెలసరి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
- వైదేహి, మహబూబ్‌నగర్‌ 
 
డాక్టర్ సమాధానం: నెలసరి సమయంలో చాలామందికి పొత్తి కడుపు నొప్పి, తలనొప్పి, వికారం, అలసట, డయేరియా, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటి నుండి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి, కడుపు ఉబ్బరం తగ్గడానికి నీళ్లు బాగా తాగాలి. కనీసం రెండు నుంచి మూడు లీటర్లు తప్పనిసరి. పుచ్చ, కర్బూజా, కీరా, దానిమ్మ లాంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ ఏర్పడదు. నెలసరి సమయంలో రక్తం అధికంగా పోవడం వల్ల రక్తహీనత వస్తుంది. రక్తహీనతను నివారించడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజూ ఆకుకూరలతో పాటు సెనగలు, రాజ్మా, బొబ్బర్లు, అలసందలు లాంటి గింజలను తీసుకోవాలి. ఈ ఆహారంలో ఉండే ఇనుమును శరీరం శోషించుకోవడానికి విటమిన్‌- సి అవసరం. విటమిన్‌ - సి అధికంగా లభించే అన్ని రకాల పండ్లు, నిమ్మరసం, పచ్చి కాప్సికమ్‌ తీసుకోండి. ప్రొటీన్లు పుష్కలంగా లభించే చికెన్‌, చేప, గుడ్లు, అన్ని రకాల పప్పులు, సోయా గింజలు, పనీర్‌, మీల్‌ మేకర్‌ ఆహారంలో భాగం చేసుకోండి. ఉప్పు, చక్కెర తగ్గించండి. కాఫీ, టీలు; మసాలాలు వద్దు.
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను [email protected] కు పంపవచ్చు)