ఆపుకోలేకపోతుంటే...

04-03-2019: కొంత మంది మహిళల్ని అమితంగా వేధించే ఒక సమస్య ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌’. సహజంగా, శరీరాన్ని శుద్ధి చేసే ప్రక్రియలు మనలో నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కాకపోతే, అవి ఎల్లవేళలా మన అదుపులోనే ఉంటాయి. అందుకు భిన్నంగా, మలమూత్ర విసర్జనలు మనిషి అదుపు తప్పితే, ఆ ఇబ్బంది గురించి వేరే చెప్పాలా? అయితే వివిధ కారణాల వల్ల కొంతమంది ఆ నియంత్రణా శక్తిని కోల్పోతారు. ఫలితంగా, దగ్గినా, తుమ్మినా, గట్టిగా నవ్వినా మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతుంది. మౌలికంగా మూత్ర నియంత్రణకు తోడ్పడే స్పింక్టర్లు అనే కండరాలు బలహీనపడటమే ఇందుకు కారణం. ఆ పరిస్థితి వెనుకున్న నేపథ్యాన్ని పరిశీలిస్తే, స్థూలకాయం, శరీర శ్రమ లేకపోవడం, అధిక సంతానం, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఈ సమస్య మూలాలుగా కనిపిస్తాయి. కొంత మందిలో శ్వాసకోశ సమస్యలు ఉండి తరుచూ దగ్గడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. కొంత మందిలో పుట్టుకతో వచ్చిన లిగమెంట్ల లోపాలు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. ఈ నియంత్రణా కండరాలను శక్తివంతంగా మార్చడంలో కీగల్‌ ఎక్సర్‌సైజులు, యోగాలో సర్వాంగాసనం వంటివి తోడ్పడతాయి. అయితే దీర్ఘకాలికంగా వేధించే ఈ సమస్యకు ఔషధ చికిత్సలు కూడా అంతే అవసరం. ప్రత్యేకించి హోమియో వైద్య విధానంలో సెపియా, కాస్టికమ్‌, స్క్విల్లా వీటిల్లో ఏదో ఒక మందును వ్యాఽధి లక్షణాలను బట్టి తీసుకోవలసి ఉంటుంది. మందును రోజూ రెండు పూటలా మూడు రోజుల పాటు వేసుకోవాలి. 15 రోజుల గడువు ఇచ్చి మళ్లీ మూడు రోజుల పాటు వేసుకోవాలి. అలా మూడు నాలుగు దఫాల పాటు వేసుకుని ఆపేయాలి. ఆ తర్వాత కాల్కేరియాఫ్లోర్‌ - 6-ఎక్స్‌ అనే మందును కొంత కాలం పాటు వరుసగా వేసుకుంటే సమస్య సమూలంగానే తొలగిపోయే అవకాశం ఉంది. అయితే స్థూలకాయులు తమ బరువు తగ్గించుకునే ప్రయత్నాలు విధిగా చేయాలి.
- డాక్టర్‌ కె. క ల్పన
హోమియో కేర్‌ హోల్‌ హెల్త్‌ క్లినిక్‌
చిక్కడపల్లి, హైదరాబాద్‌