మహిళల్లో మధుమేహం.. డి-విటమిన్‌ మాత్రలతో కట్టడి

న్యూఢిల్లీ, జనవరి 22 : డి-విటమిన్‌ మాత్రల వాడకంతో మహిళల్లో కొవ్వు, రక్తంలో చక్కెర మోతాదులు గణనీయంగా తగ్గుతాయట!! ఢిల్లీలోని అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌), డయాబెటిస్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో ఈవిషయం వెల్లడైంది. ముఖ్యంగా మధుమేహం తొలిదశలో ఉన్న, స్థూలకాయులైన మహిళలకు డి-విటమిన్‌ మాత్రలు ఎంతో దోహదపడుతాయని గుర్తించారు.

 స్థూలకాయుల్లో శరీర బరువు తగ్గడానికి, మధుమేహుల రక్తంలో చక్కెర మోతాదు కట్టడికి అవి అత్యుత్తమ మార్గాలని పేర్కొన్నారు. దేశంలోని నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న మహిళల్లో 94 శాతం మంది డి-విటమిన్‌ లోపంతో బాధపడుతున్నారని అధ్యయన నివేదిక పేర్కొంది. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఉదయాన్నే ఎండలో తిరిగే అలవాటు లేకపోవడంతో డి- విటమిన్‌ లోపం తలెత్తుతోందని వివరించింది.