మగపిల్లల్లో ఊబకాయం శాపమే!

ఆంధ్రజ్యోతి,0404-2017: టీనేజర్లలో కనిపించే ఊబకాయం వారు పెద్దయిన తరువాత శాపంగా మారుతుంది అంటున్నారు స్వీడన్‌ పరిశోధకులు. చిన్నతనంనుంచీ అధికబరువుతో ఉండే మగపిల్లలు పెద్దయిన తరువాత లివర్‌ సంబంధిత వ్యాధులతో బాధపడే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. సుమారు రెండు వందల మంది ఊబకాయులైన పిల్లల మీద సుదీర్ఘకాలం పరిశోధనలు నిర్వహించారు. వీరిలో టైపు1 డయాబెటీస్‌ వచ్చే అవకాశం కూడా ఎక్కువే అని వారు చెబుతున్నారు.

చిన్నతనం నుంచి సాధారణ బరువుతో ఉండి మధ్య వయస్సులో బరువు పెరిగితే లివర్‌ సమస్య అంతగా ఉండదనీ వారు అంటున్నారు. చిన్నతనం నుంచీ అధికబరువుతో ఉండే పిల్లల్లో మాత్రమే ఈ సమస్యను వారు గుర్తించారు. పెద్దవారిలో లివర్‌ సమస్యలు కనిపించడానికి పలు కారణాలున్నా పిల్లల్లో అధికబరువు, ఊబకాయం ప్రధానకారణం అవుతాయని వారు స్పష్టం చేస్తున్నారు. పిల్లల్లో కనిపించే ఊబకాయాన్ని తగ్గించడానికి పెద్దలు తగిన చర్యలు తీసుకుంటే పిల్లలు భవిష్యత్తులో పలు సమస్యల నుంచి తప్పించుకునే వీలుందని వారు సూచిస్తున్నారు.