క్యాబేజీ, కాలిఫ్లవర్‌ తింటే థైరాయిడ్‌ రాదు

ఎవరికైనా రావొచ్చు.. వస్తే పథ్యం అక్కర్లేదు

ఒకసారి వస్తే జీవితాంతం మందులు తప్పవు
దేశ జనాభాలో 10శాతం మందికి హైపో థైరాయిడ్‌
ముప్పు ఎదుర్కొంటున్న నగరాల్లో హైదరాబాద్‌
ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ బిపిన్‌ సేఠీ అధ్యయనం
 
హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ‘‘క్యాబేజీ, కాలిఫ్లవర్‌ తింటే థైరాయిడ్‌ వస్తుంది...ఈ రెండు కూరగాయలను తినడాన్ని మానుకున్నాం, ఇక మాకు థైరాయిడ్‌ వచ్చే ప్రసక్తేలేదు అని అనుకోవడం అపోహే’’నని ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ బిపిన్‌ సేథీ పేర్కొన్నారు. థైరాయిడ్‌ రావడానికి.. వచ్చిన సమస్యను నియంత్రించడానికి క్యాబేజీ, కాలిఫ్లవర్‌ తినడానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ కూరగాయలను భేషుగ్గా తినవచ్చునని చెప్పారు. మా కుటుంబంలో ఎవరికీ థైరాయిడ్‌ లేదు, అందుకే నాకు వచ్చే అవకాశం లేదు అని ఎవరికి వారు నిర్ధారించుకోవడమూ సరికాదన్నారు. ఒకవేళ థైరాయిడ్‌ ఉన్నప్పటికీ నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదని, ఆహార నియమాలు థైరాయిడ్‌ను పెంచవు, నియంత్రించవు అని స్పష్టం చేశారు. థైరాయిడ్‌ ఎవరికైనా.. ఎప్పుడైనా రావచ్చునని, ఒకసారివస్తే.. జీవితాంతం మందులు వాడాల్సిందేనన్నారు. 2014, 15లో దేశవ్యాప్తంగా 33 కేంద్రాల్లో హైపో థైరాయిడిజంతో 1500మందిపై క్లినికల్‌ స్డడీ నిర్వహించారు. గురువారం విలేకర్లతో ఆ అధ్యయన ఫలితాలను డాక్టర్‌ సేథీ వెల్లడించారు.
 
19-45 ఏళ్ల వయస్కుల్లో..
దేశవ్యాప్తంగా పది శాతం హైపో థైరాయిడ్‌తో బాధపడుతున్నట్టు వైద్య బృందం గుర్తించినట్టు డాక్టర్‌ సేథీ చెప్పారు. ఈ మేరకు 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారిలో హైపోథైరాయిడిజం శాతం ఎక్కువగా ఉందని నిర్ధారించారన్నారు. ఈ వయసు వారిలో 45 నుంచి 55 శాతం మంది హైపో థైరాయిడిజంతో బాధపడుతున్నట్టు గుర్తించారని చెప్పారు. వీరిలో ఎక్కువగా అలసట, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపించడం, మలబద్ధకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చలిగా ఉండడం, వెంట్రుకలు రాలిపోడం, మోకాళ్ల వాపు, చర్మం పొడిబారడం.. గరుకుగా తయారవడం, మహిళల్లో రుతుక్రమంలో సమస్యలు ఏర్పడడం వంటి లక్షణాలు కనిపించినట్టు నిర్ధారించారన్నారు. థైరాయిడ్‌ గ్రంధి తగినంత హార్మోన్‌ను ఉత్పత్తి చేయకపోతే హైపో థైరాయిడిజమ్‌ సమస్య వెంటాడుతుందని డాక్టర్‌ సేథీ వివరించారు. అయోడిన్‌ లోపం, కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నా థైరాయిడ్‌ వచ్చే ప్రమాదముందన్నారు. థైరాయిడ్‌ లక్షణాలు పురుషులలో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు.
 
హైదరాబాద్‌లో 10శాతం
థైరాయిడ్‌తో బాధపడే వారి సంఖ్య హైదరాబాద్‌లో క్రమంగా పెరుగుతోందని డాక్టర్‌ సేథీ చెప్పారు. దేశ జనాభాలో 8.88 శాతం నుంచి 10 శాతం వరకు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. ఈ ముప్పును ఎదుర్కొంటున్న తొలి పది నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని వివరించారు.నాలుగేళ్ల క్రితం ఇండియన్‌ థైరాయిడ్‌ ఎటమాలజీ సంస్థ సర్వే ప్రకారం.. థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నవారిలో దక్షిణాదిలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉన్నట్టు వెల్లడైందన్నారు. హైదరాబాద్‌లో దాదాపు పది శాతం థైరాయిడ్‌తో బాధపడుతున్నట్టు చెప్పారు.
 
బరువు పెరిగితే అనుమానించాల్సిందే
ఒక్కసారిగా బరువు పెరిగితే కచ్చితంగా అనుమానించాల్సిందేనని డాక్టర్‌ సేథీ స్పష్టం చేశారు. కారణాలు లేకుండా బరువు పెరిగిపోతుంటే దాన్ని ‘థైరోవెయిట్‌’గా వ్యవహారిస్తామన్నారు. చాలామంది బరువు పెరిగిపోతున్నా పట్టించుకోరని, వంశపారంపర్యంగా బరువు పెరిగిపోతున్నామనో, జీవనశైలి మార్పులు వల్ల అధిక బరువు సమస్య వచ్చిందనో అనుకుంటారని చెప్పారు.
 
తొలి పరీక్షకే మందులు వాడొద్దు
థైరాయిడ్‌ ఉందని తెలీగానే మందులు వాడాల్సిన అవసరం లేదని డాక్టర్‌ సేథీ చెప్పారు. 3 నెలల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకొని, సమస్యను నిర్ధారించుకోవాలని సూచించారు. టీఎ్‌సహెచ్‌(థైరాయిడ్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌) 10 కంటే తక్కువగా ఉంటే మందులను ప్రారంభించవద్దని, ఎక్కువగా ఉంటేనే మందులు వినియోగించాలని సూచించారు. టీఎ్‌సహెచ్‌ను రెండు, మూడు సార్లు పరీక్షలు చేయించుకుని ఎక్కువగా ఉందని డాక్టర్‌ నిర్ధారిస్తేనే మందులు వాడాలని సూచించారు. గర్భిణుల విషయంలో మాత్రం వైద్యులు సూచిస్తే వెంటనే మందులు వినియోగించాలని చెప్పారు. అనుమానం ఉంటే టీఎస్‌-3, టీఎస్‌ 4, పరీక్షలు చేయించుకోవాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణుల్లో థైరాయిడ్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు.