థైరాయిడ్‌, షుగర్‌ పేషంట్ల కోసం డైట్

24-08-2018: నాకు హైపో థైరాయిడ్‌ ఉంది. 15 ఏళ్ల నుంచి మందులు వాడుతున్నా. ఈమధ్య షుగర్‌ వచ్చింది. హిమోగ్లోబిన్‌ 9 శాతం ఉంది. బరువు ఎక్కువ ఉన్నా. అప్పుడప్పుడు గ్యాస్‌ట్రబుల్‌ కూడా వస్తుంటుంది. అన్నింటికి మందులు వాడుతున్నాను. నేను మోనోపాజ్‌ దశలో ఉన్నాను. అప్పుడప్పుడు బడలిక, ఒళ్లు నొప్పులు ఉంటాయి. సరిగా నిద్ర పట్టదు. ప్రతీరోజూ రెండు కిలోమీటర్లు నడుస్తాను. బరువు తగ్గడానికి, షుగర్‌ కంట్రోల్‌ కావడానికి, హిమోగ్లోబిన్‌ పెరగడానికి, నిద్ర బాగా పట్టడానికి సరైన ఆహార ప్రణాళిక చెప్పండి.
-వాణి, విజయవాడ
 
మీకు ఉన్న మల్టీపుల్‌ ఆరోగ్య సమస్యలకు మీ లైఫ్‌స్టయిల్‌లో మార్పులు అవసరం.
థైరాయిడ్‌ మందు ఉదయాన్నే వేసుకుని ఒక గంట ఆగిన తర్వాత మాత్రమే కాఫీ, టీ, ఆహారం తీసుకోవాలి.
ప్రతీరోజూ సాఫీగా విరోచనం అయ్యేట్టు చూసుకోవాలి. ఇందుకోసం ఆహారంలో తగినంత పీచు పదార్థం తీసుకోవాలి. ఠీ ఎట్టి పరిస్థితుల్లో రాత్రి 11 గంటలకల్లా నిద్రపోవాలి. వేడిపాలు అర టీ స్పూను పంచదార లేదా తేనె కలుపుకుని, వేడిని పీల్చుతూ తాగితే కొద్దిసేపటికే నిద్ర పడుతుంది.
మూడు పూటల భోజనంతో పాటు సలాడ్‌ తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూను నానబెట్టిన మెంతులు, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు, 3 టీ స్పూనులు మొలకెత్తిన గింజలు కలుపుకుని... రెండు రకాల కూరగాయలు (ఉదాహరణకు కీరదోస, టొమాటో) ఉపయోగించి సలాడ్‌ తయారుచేసుకోవాలి.
మీ ఆహార ప్రణాళిక ఇలా ఉండాలి...
ఉదయం 5 గంటలకు: థైరాయిడ్‌ టాబ్లెట్‌
5.30 గంటలకు: 20 నిమిషాల వాకింగ్‌
6.30 గంటలకు: 5 బాదం, టీ లేదా కాఫీ
8 గంటలకు: సలాడ్‌, ఒక గుడ్డు (పసుపు సొనతో పాటు), చట్నీతో 2 ఇడ్లీ
11 గంటలకు: ఒక కప్పు దానిమ్మ గింజలు
మధ్యాహ్నం ఒంటిగంటకు: సలాడ్‌, ఒక కప్పు అన్నం, అరకప్పు పప్పు, అరకప్పు ఆకుకూర, ఒక గ్లాసు మజ్జిగ
సాయంత్రం 4 గంటలకు: అరటిపండు, ఆపిల్‌, పుచ్చకాయ, బొప్పాయిలలో ఏదో ఒకటి
4.30 గంటలకు: 20 నిమిషాల వాకింగ్‌
5 గంటలకు: టీ లేదా కాఫీ (ఇష్టాన్ని బట్టి)
రాత్రి 7 గంటలకు: సలాడ్‌, రెండు పుల్కాలు, బొబ్బర్ల కూర, ఒక గ్లాస్‌ మజ్జిగ
10 గంటలకు: రెండు ఖర్జూర పళ్లు, ఒక కప్పు వేడి పాలు
ఈ ప్రణాళిక మొదలు పెట్టిన తర్వాత షుగర్‌ను ఒకసారి పరీక్షించుకుని దానికి తగిన విధంగా మార్పులు చేసుకోవాలి. 
డాక్టర్‌ బి. జానకి
న్యూట్రిషనిస్ట్‌