మృదువైన చర్మం మేనికి సింగారం..

చర్మం మృదువుగా ఉండాలంటే యాంటాక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పళ్లను, ఆకుకూరల్ని, గ్రీన్‌టీని తీసుకుంటే మంచిది. అలాంటి కొన్ని టిప్స్‌ ఈ చలికాలంలో మీ కోసం...
 
  • బ్లూబెర్రీస్‌ తింటే మంచిది. ఇవి తీయగా ఉండడమే కాదు వీటిల్లో కాలరీలు చాలా తక్కువ. యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల వ యసు తొందరగా మీదపడదు. చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది. బ్లూబెర్రీ పండులోని జ్యూసును పెరుగులో కలుపుకుని తిన్నా మంచిదే. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఆకట్టుకునే రూపం మీ సొంతం అవుతుంది. 
  • పాలకూరలో విటమిన్‌-బి, సి, ఇ లు, లుటీన్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. పాలకూర బాగా తినడం వల్ల ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువ. 
  • వాల్‌నట్స్‌ రోజూ తినడం ఆరోగ్యానికి, అందానికి ఎంతో మంచిది. వీటిని నిత్యం తినడం వల్ల జుట్టు పట్టులా ఉంటుంది. కళ్లు మెరుస్తుంటాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాదు వీటిని డైట్‌లో నిత్యం తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వాల్‌నట్స్‌ని అలానే తినొచ్చు లేదా సలాడ్సలో, పాస్తాలో వేసుకుని కూడా తినొచ్చు. వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌-ఇ, పీచుపదార్థాలు, యాంటాక్సిడెంట్లు, ప్రొటీన్లు వంటి ఎన్నో న్యూట్రియంట్లు ఉంటాయి. 
  • కివీ పండులో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడతాయి. అంతేకాదు ఈ పళ్లల్లో సి-విట మిన్‌ బాగా ఉంటుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు ఒత్తిడిని పారద్రోలుతుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఫ్యాట్‌-ఫ్రీ విటమిన్‌-ఇ ఉంది. ఇది శరీరంలోని కొలెసా్ట్రల్‌ పాళ్లను తగ్గిస్తుంది. 
  • పసుపు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దీనిలో యాంటిబాక్టీరియల్‌ గుణాలు పుష్కలం. ఇది చర్మం మెరుపుకు, పిగ్మెంటేషన్‌ తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. 
  • కొబ్బరినీళ్లు నిత్యం తాగడం వల్ల బరువు తగ్గుతాము. ఆకలి తగ్గుతుంది. అదే సమయంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. కొబ్బరినీళ్లు తరచూ తాగడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మంలో తేమదనాన్ని కాపాడుతుంది. మచ్చల్ని పోగొడుతుంది. యాక్నేను సైతం నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ మీద కూడా బాగా పనిచేస్తుంది. 
  • కమలాపళ్లు చర్మం, ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దపేగుకు సంబంధించిన కేన్సర్లను తగ్గించడంలో ఎంతో శక్తిమంతంగా పనిచేస్తుంది. కమలాపళ్ల రసం కిడ్నీ వ్యాధులకు కూడా మందులా పనిచేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. కమలాపళ్ల తొక్కలను పొడిగా చేసి చర్మం మీద రాసుకుంటే చర్మం మీద ఉన్న మృతకణాలు పోతాయి. రోజుకు రెండు కమలాపళ్లు తినడం వల్ల బెటా-కెరొటినా శరీరంలో పుష్కలంగా చేరుతుంది. ఇవి యాంటాక్సిడెంట్లు. చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.