మెదడులో ప్రకంపన

విశాఖపట్నం: జీవనయానం ఓ ప్రయాణం వంటిది. పుట్టుకతో ప్రారంభమైన జీవితంలో మరణం చివరి మజిలీ. ఈ మధ్య జీవితం అంతా సంతోషాల సంగమం కావాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అంతా అనుకున్నట్లే ఉండకపోవచ్చు. అనుకోని అవాంతరాలు ఎదురైతే, హఠాత్తుగా విషాదం చుట్టుముడితే అది మనిషి జీవితాన్నే దెబ్బతీస్తుంది. ఈ విషయంలో ఆరోగ్యానిది మొదటి స్థానం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి దేన్నైనా సాధించగలడు. శరీరం గతి తప్పితే జీవితం దారితప్పుతుంది. కుటుంబానికి భారంగా మారే అవకాశం ఉంది. అటువంటి ప్రమాదమే బ్రెయిన్‌ స్ట్రోక్‌. పక్షవాతంగా చెప్పుకునే దీని బారిన పడితే వ్యక్తికే కాదు కుటుంబానికీ తీరని విషాదమే. 
జీవితాన్ని తారుమారు చేసే స్ట్రోక్‌ 
రక్తం సరఫరాలో అవరోధాలే కారణం
నాళాలు చిట్లినా పక్షవాతం వస్తుంది
నలభై ఏళ్లు దాటితే జాగ్రత్తగాఉండడం మంచిది
మద్యపానం, ధూమపానం, మత్తు మందులతో ప్రమాదం
రోజూ వ్యాయామం, నియమిత ఆహారంతో మేలు
లక్షణాలు కనిపిస్తే గోల్డెన్‌ అవర్‌లో చికిత్స చేయించాలి
నేడు వరల్డ్‌ స్ట్రోక్‌ డే
 
శరీరం ఓ యంత్రంలాంటిది. యంత్రం సక్రమంగా పనిచేయాలంటే అందులోని అన్ని విభాగాల పనితీరు పద్ధతిగా ఉండాలి. మనిషి కూడా అంతే. శరీరంలోని కొన్ని వందల అంగాల సమన్వయంతోనే మనిషి జీవనయానం సాగుతుంది. ఎక్కడ ఏ లోపం ఏర్పడినా అది ఏదో ఒక రోగం రూపంలో బయటపడుతుంది. కొన్ని రోగాలు సాధారణమైనవి. మందులు వాడితే తగ్గిపోతాయి. విశ్రాంతి తీసుకుని మన దైనందిన జీవితాన్ని యథావిధిగా గడిపే యవచ్చు. కానీ కొన్ని ప్రమాదకరమైనవి. దానివల్ల ప్రాణమే పోవచ్చు, శాశ్వత అంగవైకల్యమే రావొచ్చు. అటువంటి ప్రమాదకరమైన వాటిలో ‘స్ట్రోక్‌’ ఒకటి. మెదడు భాగాల్లో సమతౌల్యం దెబ్బతినడం వల్ల వచ్చే ఈ వ్యాధినే పక్షవాతం (పెరాలసిస్‌) అంటారు. నేడు ప్రపంచ స్ట్రోక్‌ డే సందర్భంగా నిపుణులతో మాట్లాడి ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. 
బ్రెయిన్‌ స్ట్రోక్‌ అంటే?
బ్రెయిన్‌ స్ట్రోక్‌ అంటే పక్షవాతం. ఇది రెండు రకాలు. మొదటిది మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణకు అడ్డు ఏర్పడడం వల్ల సంభవించేది. రెండోది శరీర రక్తనాళాల్లో అడ్డంకుల వల్ల ఏర్పడుతుంది. దీన్నే ఇస్కీమిక్‌ పక్షవాతం (85 శాతం) అని, రక్తస్రావం వల్ల వచ్చే పక్షవాతం అని అంటారు. రక్తనాళాలు శరీరంలో అతిముఖ్యమైనవి. మెదడు, ఇతర అంగాలకు ఆహారం, ఆక్సిజన్‌ సరఫరా చేసేవి ఇవే. వీటిలో అడ్డంకులు ఏర్పడినా, పగిలినా రక్తం సరఫరాలో అడ్డంకులు ఏర్పడి సంబంధిత కణజాలం చనిపోతుంది. దీన్నే పక్షవాతం అంటారు. పక్షవాతం అనేది ఒక విపత్తు. మెదడు కణాలు చనిపోవడం, రక్తనాళాలు బ్లాక్‌ కావడం వల్ల వచ్చే పక్షవాతాన్ని ఇస్కీమిక్‌ అంటారు. మరొకటి హెమరేజ్‌ స్ట్రోక్‌. రక్తనాళాలు పగలడం వల్ల వచ్చేది. ఇది 20 శాతం మందిలో వస్తుంది. 
వీరికి ప్రమాదం ఎక్కువ
బ్రెయిన్‌ స్ట్రోక్‌ ప్రమాదం అనేది కొన్ని వయసులు, వర్గాల వారిలో అధికమని నిపుణులు చెబుతున్నారు. 
40 ఏళ్లు పైబడిన వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. 
మధుమేహం (షుగర్‌)తో బాధపడుతున్న వారిలో...
ఇప్పటికే స్వల్ప పక్షవాతం, టీఏఐ ఉన్న వారికి...
బాలింతల్లోనూ ప్రమాదం ఉంది.
మోతాదు మించి మద్యం సేవించే వారిలో...
నిమిషానికి ముగ్గురు బాధితులు
దేశంలో ప్రతి నిమిషానికి ముగ్గురు పక్షవాతం బారిన పడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లో పదిహేను వందల మందితో ఓ అవగాహన సర్వే నిర్వహించారు. ఈ స్ట్రోక్‌పై అత్యంత తక్కువ అవగాహన ఉన్నది హైదరాబాద్‌లోనేనని తేలింది. ఏటా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది వ్యాధి బారిన పడుతున్నారు. వారిలో 30 శాతం మంది  చనిపోతున్నారు. మరో 30 శాతం మంది వికలాంగులవుతున్నారు. 
ఇవీ ప్రధాన కారణాలు?
ధూమపానం, మద్యపానం, డ్రగ్స్‌ తీసుకునే వారిలోను, బీపీ, మధుమేహం సమస్యలతో బాధపడేవారిలోను పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతు న్నారు. అధిక కొలెస్ట్రాల్‌, జన్యుపరమైన లోపాలు కూడా కారణం కావొచ్చు.
పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే తక్షణం యాస్పిరిన్‌ టాబ్లెట్‌ను అందించాలి. ఇది ఒక విధమైన ప్రాథమిక వైద్యమని కేర్‌ వైద్యుడు జి.కిశోర్‌బాబు తెలిపారు. వీలైనంత వేగంగా వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలి. 
పక్షవాతం వచ్చిన మూడు గంటల్లోపు గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఈలోగా ఆసుపత్రికి తీసుకువెళ్లగలిగితే ఖరీదైన ఇంజక్షన్లను అందించి రోగిని కాపాడే అవకాశం ఉంటుంది.
పక్షవాతం రాకుండా ఏం చేయాలి?
పక్షవాతం ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మంచి ఆహార నియమాలు, అలవాట్లతో 80 శాతం స్ట్రోక్‌లను నివారిం చవచ్చు.
రోజుకి కనీసం గంటపాటు వ్యాయామం చేయాలి. షుగర్‌, కొవ్వు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
రైస్‌ తక్కువగా తీసుకుని ఆకుకూరలు ఎక్కువ తినాలి. స్వీట్స్‌ వీలైనంత తక్కువ తినాలి.
ఫ్రూట్స్‌, సలాడ్స్‌, ఫిష్‌, ఎగ్‌ ఎక్కువ తీసుకోవాలి.
ఒత్తిడికి దూరంగా ఉండాలి. యోగా, మెడిటేషన్‌ చేయడం మంచిది.
బీపీని నియంత్రణలో ఉంచుకునేలా చూడాలి. ఊబకాయం తగ్గించుకోవాలి. 
కొలెస్ట్రాల్‌, బ్లడ్‌షుగర్‌ తగ్గించాలి.
ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా దురదృష్టవశాత్తు పక్షవాతం బారినపడితే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండి చికిత్సకు సహకరించాలి.
 సత్వరం స్పందించాలి
మెదడుకు రక్తం సరఫరా నిలిచిపోగానే అందులోని కణాలు (న్యూరాన్లు) చనిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే మెదడుభాగం పనిచేయడం మానేస్తుంది. కాలు, చెయ్య, మాట పడిపోతుంది. ఇటు వంటి లక్షణాలు (పక్షవాతం) గమనించగానే రోగిని ఆసుపత్రికి తరలించాలి. కనీసం రెండు మూడు గంటల్లోపే తరలించినప్పుడే రోగిని రక్షించుకోగలం. నాటువైద్యం, మూఢనమ్మ కాలతో ఆలస్యం చేస్తే రోగి ప్రమాదంలో పడేందుకు అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లలో మార్పులు, రోజువారీ వ్యాయామంతో ఇటువంటి సమ స్యలకు దూరం కావచ్చు. గత కొన్నేళ్లుగా పరిస్థితి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 30 ఏళ్ల వయసులోనే కొందరు స్ట్రోక్‌ బారిన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆల్కహాల్‌, స్మోకింగ్‌, డ్రగ్స్‌ తీసుకోవడమే. వీటన్నింటికీ దూరంగా ఉండి వ్యాయామం చేయాలి.
- డాక్టర్‌ జి.కిశోర్‌బాబు, న్యూరోఫిజీషియన్‌, కేర్‌ ఆసుపత్రి