ఆ వ్యాధులను సమూలంగా నివారించాలంటే?

ఆంధ్రజ్యోతి, 22-01-2019:

  డాక్టర్‌! సుఖ వ్యాధులకు సమర్ధ చికిత్సలు ఉన్నాయా? వీటిని ఎంతవరకూ రూపుమాపగలిగే వీలుంది?

- ఓ సోదరుడు, వరంగల్‌

జవాబు: సుఖ వ్యాధులకు సమర్ధమైన చికిత్సలు ఉన్నాయి. అయితే వచ్చిన వ్యాధిని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. కొన్ని సుఖ వ్యాధులు (ట్రైఖోమోనాస్‌) యాంటీబయాటిక్స్‌తో అదుపులోకొస్తాయి. అయితే తిరిగి రెండవసారి అదే వ్యాధికి గురయితే చికిత్స కొంత క్లిష్టం కావచ్చు. మరికొన్ని ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పునరుత్పత్తి సామర్ధ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే ఒకే సమయంలో పలు రకాల సుఖవ్యాధులు సోకే ప్రమాదం కూడా లేకపోలేదు. వ్యాధులు సోకినప్పుడు మీతోపాటు మీ భాగస్వామి కూడా చికిత్స తీసుకునేలా చూసుకోవాలి.

 
జెనైటల్‌ వార్ట్స్‌: ఈ పుండ్లు వైరస్‌ వల్ల వస్తాయి. పుండ్ల మీద రసాయన లేపనం పూయడంతోపాటు, లేజర్‌ ట్రీట్మెంట్‌, సర్జరీ, యాంటీవైరల్‌ మందుల ద్వారా వైర్‌సను సమూలంగా శరీరం నుంచి తొలగించాలి.
 
క్లెమీడియా: బ్యాక్టీరియా వల్ల సోకే ఈ వ్యాధికి సింగిల్‌ లేదా రోజుల తరబడి సాగే మందుల కోర్సు తీసుకోవాలి.
గనేరియా: బ్యాక్టీరియా వల్ల సోకే ఈ సుఖ వ్యాధికి కూడా సింగిల్‌ లేదా రోజుల తరబడి సాగే మందుల కోర్సు తీసుకోవాలి.
 

జెనైటల్‌ హెర్పిస్‌: వైరస్‌ వల్ల సోకే ఈ వ్యాధి రెండు నుంచి మూడు వారాల్లో బయల్పడుతుంది. ఈ వైర్‌సను మందులతో శరీరం నుంచి సమూలంగా తొలగించడం అసాధ్యం. మొదటి విడత లక్షణాలను తగ్గించడం కోసం యాంటీవైరల్‌ మందులు వాడాలి. రెండవ విడతలో మందుల ప్రభావం తగ్గుతుంది. ఇలా పదే పదే తిరగబెడుతుంటే కనీసం ఆరు నెలల పాటు మందులు క్రమంతప్పక వాడవలసి ఉంటుంది.

డాక్టర్‌ షర్మిలా మజుందార్‌
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
 9676762665
(కన్సల్టేషన్‌ కోసం)