కుటుంబ నియంత్రణలో ఆమెకు తప్పని కష్టం..

మెడికల్‌ హబ్‌గా ఎదిగిన హైదరాబాద్‌లో కుటుంబ నియంత్రణలో పురుషల పాత్ర చాలా తక్కువగా ఉంది. వ్యాసెక్టమీ చేయించుకుంటే శక్తి తగ్గుతుందనే అపోహ చాలా మంది పురుషుల్లో నెలకొని ఉండడమే దీనికి కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

 
నేడు ప్రపంచ వ్యాసెక్టమీ డే
 
 హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఏడాదికి 500 మంది పురుషులు కూడా కుటుంబ నియంత్రణ చేయించుకోవడం లేదంటే పరిస్థితి ఏ మేరకు ఉందో చెప్పకనే చేబోతుంది. ప్రతి ఏడాదిలో మహిళలు 28 వేల మంది, పురుషులు 490 మంది వరకు మాత్రమే కుటుంబ నియంత్రణ చేయించుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటీ వరకు 12,635 మందికి కుటుంబ నియంత్రణ చేయగా అందులో పురుషుల సంఖ్య కేవలం 107 మాత్రమే. మహిళలు 12,528 మంది కుటుంబ నియంత్రణకు ముందుకు వచ్చారని అధికార వర్గాలు తెలిపాయి.
 
పురుషులు దూరం దూరం..
 
మహిళల కంటే పురుషుల్లోనే కుటుంబ నియంత్రణ ప్రక్రియ త్వరగా జరిగిపోతోంది. కానీ పురుషులు మాత్రం వ్యాసెక్టమీ చేయించుకోవడంలో ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు మాకేందుకు ఈ కష్టా నష్టాలు అంటు తప్పుకుంటున్నారు. మేం చేసుకోలేం... ఆ బాధ్యత మీదేనని భార్యలపై మోపుతున్నారు. కుటుంబ నియంత్రణ చేయించుకోవడం మాది కాదు...మీరే చేయించుకోండని దగ్గర ఉండి మరీ చేయిస్తున్నారు. దీంతో కుటుంబ నియంత్రణలో భర్త పాత్ర నామమాత్రమే. ఇంకా మూఢ నమ్మకాలు, భయం పురుషులను వీడడం లేదు. దీంతో కుటుంబ నియంత్రణలో మహిళలే ముందుంటున్నారు. చింత లేని కుటుంబానికి మహిళలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. ప్రపంచ పటంలో ఆధునిక వైద్యానికి ప్రత్యేక పీట వేసుకున్న రాష్ట్ర రాజధాని నగరంలోనే వ్యాసెక్టమీ శాతం చాలా తక్కువగా ఉంది. వ్యాసెక్టమీ గురించి పెద్దగా ప్రచారం లేదు. అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగ విఫలమవుతోంది. ప్రచార సాధనాల ద్వారా ఆశించిన ప్రయోజనాన్ని సాధించలేకపోతోంది.
 
ఏడాదికి 5 శాతం మించదు
 
హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఏడాదికి 500 కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు కూడా మగవారు చేసుకోవడం లేదు. అంటే కుటుంబ నియంత్రణ మగవాడి పాత్ర 5 శాతం కూడా ఉండడం లేదన్నట మాట. 2008-2009లో మినహా ఎప్పుడు భారీ సంఖ్యలో వ్యాసెక్టమీ చేయించుకోవడంలో ఆసక్తి చూపలేదు. ఆ ఏడాదిలో ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశించడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో ఆ ఏడాదిలో 3వేల మంది వ్యాసెక్టమీ చేయించుకున్నారు. 2008-2009లో ట్యూబెక్టమీ 38,185 చేయగ, వ్యాసెక్టమీ 3263 జరిగాయి. 2006 నుంచి 2016 వరకు వాసెక్టమీలు ప్రతి ఏడాది 500 మంది లోపు మాత్రమే నిర్వహించారు.
 
మూడు నిమిష్లాలోనే వ్యాసెక్టమీ..
 
కుటుంబ నియంత్రణలో అనేక ఆధునాతన పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త విధానాల వల్ల కోతలు, కుట్లు వంటి సమస్యలే ఉండవు. రక్తస్రావం జరిగే అవకాశముండదని వైద్యులు పేర్కొంటున్నారు. నిజానికి ట్యూబెక్టమీ కంటే వ్యాసెక్టమీ చాలా సులువు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స జరిగిన గంట తరువాత మగవారు తమ పనులను యఽఽథావిధిగా కొనసాగించవచ్చు. అదే మహిళలకు ట్యూబెక్టమీ అయితే కష్టాలతో కూడకున్నదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రసవ సమయంలో ఒకసారి సిజేరియన్‌ అయితే కుటుంబ నియంత్రణకు మరో శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుందని, ఇది మహిళలకు అంత ప్రయోజనం కాదని వైద్యులు పేర్కొన్నారు. అంతే కాకుండా నొప్పి, వైట్‌ డిశ్చార్జీ వంటి సమస్యలను ట్యూబెక్టమీ చేయించుకున్న మహిళలు ఎదుర్కొంటారని వైద్యులు వివరించారు.
 
ప్రచారమేదీ..
 
ట్యూబెక్టమీ కంటే వ్యాసెక్టమీ చేయించుకునే వారికే ఎక్కువ ప్రొత్సాహకాలు ఇస్తున్నారు. మహిళలకు 880 రూపాయల వరకు ప్రోత్సాహక నగదు ఇస్తుంటే, పురుషులకు 1300 రూపాయల వరకు ఇస్తున్నారు. అయినప్పటికీ వ్యాసెక్టమీ చేయించుకోవడానికి పురషులు ముందుకు రావడం లేదు. కుటుంబ నియంత్రణలో పురుషల సంఖ్య పెంచడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పెద్దగా అవగాహన కార్యక్రమాలు జరిపించడం లేదు. ఏటా లక్ష్యం చేరుకునే దిశలో ఆలోచిస్తున్నారే తప్ప పురుషలకు అవగాహన కల్పించడంలో దృష్ఠి సారించడం లేదు.  
 
గడిచిన పదేళ్లలో వ్యాసెక్టమీ పరిస్థితి
 
సంవత్సరం        వ్యాసెక్టమీ 
2007                   228 
2008                   437 
2009                 3263 
2010                   799 
2011                   480 
2012                   788 
2013                   480 
2014                   381 
2015                   375 
2016                   107 
 
పురుషులు కుటుంబ నియంత్రణ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నీరసించిపోతాం, ఉద్యోగం చేయలేము, మున్ముందు శక్తితగ్గిపోతుందన్నవన్నీ అపోహలే. పురుషులు వ్యాసెక్టమీ చేయించుకున్న గంటలోపే తమ పనులు తాము యథావిధిగా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అదే మహిళలు అయితే కనీసం మూడు రోజుల విశ్రాంతి అవసరం. వారం రోజుల పాటు వారికి నీరసం కూడా ఉంటుంది. మహిళల ఆరోగ్య రీత్యా పురుషులే కుటుంబ నియంత్రణ చేయించుకోవడం చాలా మంచిది. ఇక మురికివాడలు, బస్తీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. వ్యాసెక్టమీ వల్ల కలిగే ఉపయోగాలను వారికి వివరిస్తున్నాం. 
   -డాక్టర్‌ సృజన,
                                                                               మెడికల్‌ ఆఫీసర్‌,యుపీహెచ్‌సీ