ఈ అల్పాహారం మేలు!

ఆంధ్రజ్యోతి (26-11-2019):ఉదయం తీసుకునే అల్పాహారం రోజు మొదలుపెట్టడానికి సరిపడా శక్తిని ఇచ్చేలా ఉండాలి. ఇతరత్రా రుచుల మీదకు మనసు మళ్లకుండా నియంత్రించేలా ఉండాలి. ఇందుకోసం తీసుకునే అల్పాహారం ఇలా ఉండేలా చూసుకోవాలి.. తక్కువ పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోవడం మూలంగా అడ్రినల్‌ గ్రంథి ఒడిదొడుకులకు లోనవుతుంది. దాని పర్యవసానాలైన బరువు పెరగడం, చర్మపు ముడతలు, తరచుగా నీరసించిపోవడం, నిస్సత్తువ మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి అల్పాహారంలో పీచు, మాంసకృత్తులు, కొవ్వులు సమంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి అల్పాహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు సమంగా ఉంటాయి.
 
ఫలితంగా అడ్రినల్‌ గ్రంథి కార్టిసాల్‌ స్రావం విడుదల కోసం పని చేసే పరిస్థితి తప్పుతుంది. ఫలితంగా తీపి తినాలనే కోరిక తలెత్తదు. అల్పాహారంలో మాంసకృత్తులు ఉండేలా చూసుకుంటే అవి శరీరంలోని హార్మోన్ల పనితీరును రోజంతా నియంత్రణలో ఉంచుతాయి. కాబట్టి అల్పాహారంలో చికెన్‌, చేపలు, బాదం వంటివి తీసుకోవాలి. క్యాన్స్‌లో నిల్వ చేసిన రెడీమేడ్‌ పదార్థాలకు బదులు తాజాగా తయారుచేసుకున్న పదార్థాలే తినాలి.