మనసు పెట్టి తింటేనే...!

ఆంధ్రజ్యోతి, 22-01-2019: ఉరుకుల పరుగు జీవితం... వేళకు ఏదో గబాగబా తినేసి కానిచ్చేద్దాం అంటే సమస్యలు తప్పవు. భోజనం మీద మనసు లగ్నం చేయడం వల్ల శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయని, ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారని, మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇటీవల బరువు తగ్గేందుకు డైట్‌ పాటిస్తున్న 53 మందిపై ఆరు నెలలుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విశేషాలేమంటే... 6 నెలల్లో మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌కు సంబంధంచి మూడు, నాలుగు సెషన్స్‌కు హాజరైన వారు సగటున 3 కిలోల బరువు తగ్గారట. ఒకటి, రెండు సెషన్లకు వచ్చినవారు కిలో మాత్రమే తగ్గారట.

 
పండుగలు, సెలవురోజుల్లో కుటుంబం, స్నేహితులతో కలిసి వివిధ రకాల ఆహారపదార్థాలను కడుపునిండా లాగించేస్తాం. తీరా బరువు పెరిగి, మునుపటి షేప్‌లోకి వచ్చేందుకు కసరత్తులు, నానా కష్టాలు పడతాం. అయితే ఈ సమస్యకు సులువైన పరిష్కారం చెబుతున్నారు పరిశోధకులు. మనసుపెట్టి పనిచేయడం వల్ల ఉద్రేకం తగ్గి, ఆలోచనల మీద గురి ఉంటుంది. ఒత్తిడి తగ్గి, అదనపు శక్తి సమకూరి, రెట్టించిన ఉత్సాహం సొంతమవుతుంది. అదేవిధంగా మనసుపెట్టి తినడం వల్ల ఆహారాన్ని సంతృప్తిగా తినడం అలవడుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పటిష్ఠమవుతుందంటున్నారు పరిశోధకులు.