అనారోగ్యాన్ని గుర్తించే కలలు!

కలలు రావడం ప్రతి మనిషికి సహజం. జీవితానికి సంబంధించిన ఒడిదుడుకులో లేక జ్ఞాపకాలో, రోజంతా చేసిన పనులో ఇలా దేనిగురించైనా కలలు రావచ్చు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చేసే ముందస్తు హెచ్చరికలు కూడా కావచ్చునని కొందరు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అసలు కలలు మనిషి ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసుకోండి!
 
మనిషి మానసిక స్థితికి ప్రతిరూపాలు కలలు. సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాంటి కలలు వస్తే బాధలో ఉన్నప్పుడు మరో రూపంలో కలలు వస్తాయి. మరి నిజానికి కలల్లో కనిపించే దృశ్యాలు మనకేం చెబుతున్నాయి? వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది మనమిప్పుడు తెలుసుకుందాం! అయితే ఇవన్నీ కేవలం పరిశోధనలు మాత్రమే. ఇలాంటివే కచ్చితంగా జరగాలనేమీ లేదు కానీ జరగ డానికి అవకాశాలు ఉన్నాయి.
 
పీడకలలకు గుండె సమస్యలకు లింకు? 
కొంతమందికి పీడకలలు వస్తుంటాయి. అలా తరచూ పీడకలలు వస్తోంటే అవి గుండె సంబంధిత వ్యాధుల గురించి చెబుతాయట. 2003లో జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా 40 సంవత్సరాల వయసున్న మహిళలకే ఎక్కువగా పీడకలలు వస్తాయట. దీనికి కారణం నిద్రలేమి. నిద్రలేకపోవడంవల్ల వారు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. దీని వలన వారిలో గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. క్రమంగా ఛాతినొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి పీడకలలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వయసు పెరిగిన తర్వాత మెదడులో జరిగే రసాయనిక చర్యలలో తేడాలు వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు.
 
కలలు ఎక్కువగా వస్తుంటే 
మరికొందరికేమో ఒకటీ రెండూ కాదు చాలా ఎక్కువగా కలలు వస్తుంటాయి. వారెప్పుడూ కలత నిద్రలోనే ఉంటారు. ఈ కలతనిద్రవల్ల ఆలోచనలు మరింతపెరిగి కలలు మరింతఎక్కువ వస్తుంటాయి. ఇది కూడా మహిళలోనే ఎక్కువ. మహిళ మానసికస్థితిపై ఇది ప్రభావం చూపిస్తుంది. అతిగా ఆలోచించడం, వాతావరణం వేడిగా ఉండడం, చిరాగ్గా ఉండడం లాంటి పలు సమస్యలు కూడా కారణం అవుతాయి. ఇక హార్మోన్ల అసమ తుల్యత, బహిష్టు సమయంలో వచ్చే నొప్పులు, మెనోపాజ్‌ అనేవి ఇలా ఎక్కువగా కలలు రావడానికి ప్రధాన కారణాలు.
 
వెంటాడే కలలు
కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడూ కలల రూపంలో వెంటాడుతూనే ఉంటాయి. ఇలా జ్ఞాపకాల రూపంలో కలలు వస్తున్నాయంటే మెదడులో నరాల బలహీనత, మతిమరుపు, వణుకు, దడ రావడంలాంటి వ్యాధులకు కారణమవుతాయి. మరిచిపోయిన సంగతులన్నీ గుర్తొచ్చి వెంటాడుతూ ఉంటాయి. ఇవన్నీ నరాల రుగ్మతకు సూచికలని నరాల నిపుణులు అంటున్నారు. అందుకే ఇలా కలలు వస్తున్నవారు మతిమరుపు, వణుకు, దడలాంటి వ్యాధులకు వెంటనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. 
 
తొందరగా నిద్రలేస్తున్నారా 
కొంతమంది కలతనిద్రవల్ల త్వరగా నిద్ర లేస్తుంటారు. ఇలా సరిగా నిద్రపోకుండా కలత నిద్ర పోతుంటే ఒత్తిడి, ఊబకాయ సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. నిద్రకు ఉపక్రమించే ముందు కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల, మితిమీరిన ఆహారం తీసుకోవడం వల్ల వారిలో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పన్నమయ్యి కలత నిద్రకు కారణమవుతాయి. దీంతో తొందరగా నిద్ర లేస్తారు. ఇక రోజంతా చిరాకుగా, తలనొప్పిగా ఉంటుంది. దీంతో ఎన్నో కలల్ని మరచిపోవాలనుకున్నా మరచిపోలేం. కొన్ని కలలు భయంకరంగా ఉంటే మరికొన్ని ఆనందం కలిగిస్తాయి. మెదడులో జరిగే రసాయనిక చర్యల మార్పుల వల్లనే ఇదంతా. కాబట్టి జీవనవిధానంలో ఆహారంలో మార్పులు అంటే పోషకాలున్న ఆహారం స్వీకరించడం, వ్యాయామాలు చేయడంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుసరించాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలుగు తుంది. దీనివల్ల కలత నిద్ర నుంచి దూరం కాగలుగుతారు.
 
నిద్రలో రకాలు 
స్థూలంగా చెబితే నిద్ర రెండు రకాలు. కొంచెం వివరంగా ఆలోచిస్తే మాత్రం ఐదురకాలని శాస్త్రవేత్తలు చెబుతారు. ముందుగా రెండు రకాల నిద్రల గురించి చూద్దాం. ఇందులో మొదటిది రాపిడ్‌ ఐ మూమెంట్‌ (ఆర్‌ఈఎం), రెండోది నాన రాపిడ్‌ ఐ మూమెంట్‌ (నాన్‌ ఆర్‌ఈఎం), దీంట్లో మరో నాలుగు దశలుంటాయి. కలతనిద్ర, మగతనిద్ర, దీర్ఘనిద్ర లాంటివన్నమాట. ప్రతిరోజు నిద్రను నానఆర్‌ ఈఎం స్లీప్‌తో మొదలుపెడతాం. ఈదశ దాదాపు 90 నిమిషాల పాటు ఉంటుంది. ఆ తరువాతి దశ ఆర్‌ఈఎం స్లీప్‌ది. కలలు ఎక్కువగా వచ్చేది ఈ దశలోనే. ఈ దశలో శరీరం మొత్తం చచ్చుబడి పోయినట్లు ఉన్నా మెదడు మాత్రం మెలకువగా ఉన్నప్పటి మాదిరిగా చురుకుగా ఉంటుంది. గుండెకొట్టు కునే, ఊపిరి తీసుకునే వేగం కూడా ఈ దశ లో ఎక్కువగా ఉంటుంది. మెదడు విడుదల చేసే గ్లైసిన అనే అమినోయాసిడ్‌ కారణంగా ఇదంతా జరుగుతుంది. అందువల్లనే ఆర్‌ఈఎం నిద్రలో ఎంతటి భయంకరమైన కలలు వచ్చినా వాటికి మన శరీరం స్పందించదు.
 
ఈ డ్రీమ్స్‌కి అర్థం తెలుసా? 
మన మనస్సు లోలోపల దాగిఉన్న భావాలను కొన్ని కొన్ని కలల రూపంలో చూస్తూ ఉంటాం. కలలకి అర్థం ఏంటన్నది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ కుతూహలంగా ఉంటుంది కదూ! ప్రతి మనిషీ నిద్రలో దాదాపు 90 నిమిషాలపాటు కలల ప్రపంచంలో విహరిస్తాడట. కలలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ కొంతమందికి ఒకేరకమైన కల పదేపదే వస్తూ ఉంటుంది. అసలు ఎలాంటి కలలు వస్తాయో వాటి అర్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
  
పై నుంచి పడిపోతున్నట్టు కల 
ఇలా ఎత్తుపై నుంచి కిందికి పడుతున్నట్లుగా కొందరికి కల వస్తుంది. దీనర్థం జీవితంలో చాలా కఠిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని! వాటిని ఎదుర్కొనలేకపోతే ఈ కల వస్తుంది. అందువల్ల ఎలాంటి సమస్యలకూ తల వంచకుండా దృఢసంకల్పంతో ఎదుర్కోవడానికి ప్రయత్నించండి.
 
స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు 
ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగురుతున్నట్లు మీరు కలగన్నారా? అయితే మీరు చాలా సంతోషంగా ఉన్నా రని అర్థం. మీ బాధల నుంచి విముక్తి లభించిన సందర్భంగా మీరు ఆనందంతో ఎగురుతున్నారని అర్థం. ప్రశాంత భావనతో నిద్రించడంవల్ల ఇలాంటి కలలు వస్తాయి. ఈ కల మీరు సమర్థవంతంగా సమస్యను ఎదురించగలరు అనే అర్థాన్ని చెప్తుంది. ఈ కలలో విచారంగా ఎగరడం, సంతోషంగా ఎగరడం అనే రెండు రకాలున్నాయి. విచారంగా ఎగరడానికి గల కారణం మీరు కొంచెం ఏకాగ్రత చూపించడం లేదని అర్థం. అంతేకాదు మీరు పై స్థాయికి వెళతారనడానికి సూచనగా కూడా ఇలాంటి కల వస్తుంది.
 
మరణానికి సంబంధించిన కల 
కలలో ఎవరైనా చనిపోయిన ట్లు లేదా చనిపోయిన వారు కనిపించినా చాలా నిరాశతో ఉన్నారని అర్థం. నిజజీవితంలో ఎవరైనా నమ్మించి మోసం చేసినా అనుకోని సందర్భాలలో ఎవరైనా మిమ్మల్ని వదిలేసినా ఇలాంటి కలలు వస్తాయి. లేదా ఏదైనా కొత్తపని మొదలు పెట్టగానే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి కలలు వస్తాయి. అందుకని నిరాశ వదిలి జీవితంలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆగిపోయిన పనిని మళ్లీ మొదలు పెట్టి విజయాల వెనుక పరుగులు తీయండి.
 
తరుముతున్నట్లు కల 
కొందరికి కలలో మనల్ని ఎవరో తరుముతున్నట్లు, మనం వారి నుంచి పారిపోతున్నట్లు కల వస్తుంది. ఇలాంటి కల చాలామందికి వస్తుందట. ఎలాంటి కలనైనా మర్చిపోతారేమో కానీ ఇలా తరుముతున్నట్లు వచ్చే కల ఎవ్వరూ మరిచిపోరట. ఈ కల నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకోవడానికి చూస్తున్నారనడానికి సూచనగా వస్తుందట. అందుకని సమస్యల నుంచి దూరంగా పారిపోకుండా ఎదుర్కోవడానికి కృషి చేయండి. ఇలాంటి కలలు రావడం తగ్గిపోతుంది.
 
మెలుకువతో జ్ఞాపకాలు మాయం
మంచి కల కంటున్నప్పుడు ఏకారణం చేతనైనా అకస్మాత్తుగా మెలకువ వచ్చిందనుకోండి. వెంటనే మీకల దేనికి సంబంధించినదో బేషుగ్గా గుర్తుంటుంది. ఐదు నిమిషాలు గడిస్తే మాత్రం సగం అంశాలు మరిచి పోతారు.  పదినిమిషాల తరువాత మిమ్మల్ని నిద్రలేపి అడిగితే ఏమో..గుర్త్తులేదు అనే సమాధానం మీ నుంచి రావటం గ్యారెంటీ! ఎందుకిలా జరుగుతుందంటే అవన్నీ అణచివేతకు గురైన ఆలోచనలట. కాబట్టి కలలు గుర్తుండవని ఇతర శాస్త్రవేత్తల అంచనా. పైగా కలలు చాలా అస్పష్టంగా మొదలవుతాయి కాబట్టి, రెండు మూడుసార్లు వాటిని అనుభూతి పొంది అర్థం చేసుకోవడం వీలుకాదు కాబట్టి అవి గుర్తుండవని పరిశోధకులు చెబుతున్నారు.
 
కలల్ని కంట్రోల్ చేయవచ్చా?
అవును! కలను కంట్రోల్‌ చేసుకోవచ్చు. కాస్త శ్రమతో కూడినదైనా ప్రాక్టీస్‌ చేస్తే మీకు నచ్చినట్లు కలలు కనడం సాధ్యమే! అంటోంది ఈ కాలపు సైన్స. ఈ రకమైన కలలను లూసిడ్‌ డ్రీమింగ్‌ అంటారు. కలలను గుర్తుపెట్టుకునేందుకు ఉపయోగించిన టెక్నిక్స్‌ లాంటివే దీనికీ పనికొస్తాయని కొందరు పరిశోధకుల అంచనా. కలల్ని గుర్తుంచుకోవాలని గట్టిగా అనుకోవడం, 90 నిమిషాలకు ఒకసారి మోగేలా అలారం పెట్టుకుని మెలకువ వచ్చినప్పుడల్లా మన కల సారాంశాన్ని రాసుకోవడం వల్ల కలలను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చట.