ఎబోలా వైర్‌సకు అడ్డుకట్ట

ఆంధ్రజ్యోతి, 14-10-15: ‘ఎబోలా’ అనగానే గడగడా వణికిపోయే రోజులివి. అయితే, ఆ భయాందోళనల నుంచి బయటపడేసే ఔషధమొకటి ఇటీవలే తయార య్యింది. కొత్తగా తయారైన ఈ యాంటి వైరల్‌  ఉత్పత్తిని ప్రస్తుతానికి  కోతుల వరకే పరిమితం చేశారు. ఎబోలా  వైరస్‌  పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బ తీసే ఈ మందు వల్ల కోతుల ప్రాణాలకు పూర్తి రక్షణ కలిగినట్లయ్యింది.  ఇప్పుడు  రూపకల్పన చేసిన ఈ  అతి  సూక్ష్మమైన యాంటీ వైరల్‌ ఏజంటు ఆధారంగా మున్ముందు మరింత మెరుగైన ఔషధాన్ని తయారు చేసే అవకాశాలు ఉండబోతున్నాయి. అమెరికాకు చెందిన  ఆర్మీ మెడికల్‌ రీసెర్చ్‌లోని ఇన్ఫెక్షన్‌ వ్యాధుల సంస్థ  సైన్స్‌ డైరెక్టర్‌ సారధ్యంలో జరుగుతున్న ఈ  పరిశోధనలో  ఎబోలా వైర్‌సతో పాటు ఇతర పేథోజన్ల మీద కూడా  తయారైన యాంటీ వైరల్‌ కాంపౌండ్‌  ఎంత సమర్థమంతంగా పనిచేస్తోంది అనేది ఒక ప్రశ్నే. అందుకే ఆ  అంచనా వేసే  ఒక అధ్యయనం  ఇప్పుడు తీవ్ర స్థాయిలో జరుగుతోంది. జంతువుల  మీద  వినియోగిస్తున్నంత  మేరకైతే, ఈ కంపౌండ్‌ నూటికి నూరు శాతం సమర్థవంతంగా పనిచేస్తోంది.

ఎబోలా వైర్‌సకు గురైన మొత్తం  కోతులు ప్రాణాలతో బయటపడటమే ఇందుకు నిదర్శనం. అందుకే  ‘‘ఈ కంపౌండ్‌ వాడటంతో  శరీరంలో వైరల్‌ లోడ్‌ గణనీయంగా తగ్గడంతో పాటు వ్యాధి లక్షణాలు కూడా చాలా వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. లోలోపల రక్తస్రావం కావడం గానీ, ధాతువులు దెబ్బ తినడం గానీ, బాగా తగ్గిపోయింది. పూర్తిగా కొత్తదైన ఈ  న్యూక్లియోటైడ్‌ అనలాగ్‌ ప్రోడ్రగ్‌,  వైరల్‌ ఆర్‌ఎన్‌ఏ పునరుత్పత్తి క్రమాన్ని బాగా అడ్డుకోగలుగుతోంది.’’ అన్నారు, ఆర్మీ మెడికల్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రిన్సిపాల్‌ ట్రావిస్‌ వ్యారన్‌.  ఈ కంపౌండ్‌,  ఎబోలా వైరస్‌ పునరుత్పత్తిని ఆపివేసిన మరుక్షణం సహజంగానే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరిగిపోతుంది. అప్పుడది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.  ఇదొక శుభసూచకం.  ముందు తీవ్రమైన జ్వరం తో మొదలై ఆ తర్వాత మెదడులో రక్తస్రావం అయ్యేదాకా వెళ్లే ఈ జబ్బుకు ఈ రకంగా అడ్డుపడటంతో అంతటా హర్షం వ్యక్తమవుతోంది.  పూర్తి స్థాయిలో ఈ వ్యాధిని నిర్మూలించేందుకు పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు కూడా ఈ ఫలితాలు గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి.