స్వైన్‌ ఫ్లూ డైట్‌

ఆంధ్రజ్యోతి:  రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దానికి     తగ్గట్టే ఈ వైరస్‌ వ్యాప్తిపై ప్రజల్లో తీవ్ర భయాందోళనలు చోటుచేసుకుంటున్నాయి. స్వైన్‌ ఫ్లూ వైరస్‌ సోకకుండా ఎలాంటి వైద్యం చేయించుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి లాంటి విషయాలు తెలియక చాలామంది వైరస్‌  బారిన  పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వైన్‌ ఫ్లూ వైరస్‌ సోకకుండా ఎలాంటి డైట్‌ తీసుకోవాలో ఈ వారం  తెలుసుకుందాం...


స్వైన్‌ ఫ్లూ వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు 
బాగా నీళ్లు తాగాలి. శరీర బరువుకు తగ్గట్టు  ఫ్లూయిడ్స్‌  తీసుకోవాలి. ఉదాహరణకు 80 కేజీల బరువున్న వాళ్లు 40 ఔన్సుల ఫ్లూయిడ్స్‌ అంటే 1200ఎంఎల్‌  ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలి.  మంచినీళ్లు ఎంత తాగితే అంత మంచిది.

 పళ్లు తోముకున్న వెంటనే గోరువెచ్చని నీటితో  నోటిని పుక్కిలించి మంచినీళ్లు తాగాలి. ఆ తర్వాత నానబెట్టిన పది బాదం పప్పులు  తినాలి.  ఎండిన రెండు అంజీరాలు కూడా తినాలి. 

బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఒక గ్లాసుడు కమలాపండురసం తీసుకోవాలి. అలాగే ఒక టీ స్పూను అల్లం జ్యూసు కూడా తాగాలి.

 మధ్యాహ్నం పూట క్యాబేజీ సూప్‌లో మిరియాలు, అల్లం దంచి ఆ పొడిని కలుపుకుని తాగాలి.
 లంచ్‌  తర్వాత అల్లం నీటిలో నానబెట్టిన పుచ్చకాయముక్కలను కాస్త మిరియాల పొడి చల్లుకుని తినాలి. పాలకూరలాంటి ఆకుకూరలతో తయారు చేసిన  సూప్‌ తీసుకోవాలి.
 సాయంత్రం బాదంపప్పులు, వాల్‌నట్స్‌, జీడిపప్పులు, సన్‌ఫ్లవర్‌ విత్తనాలను కలిపి రోస్టు చేసి స్నాక్‌లా తీసుకోవాలి. కాస్త రుచిగా తినాలనుకుంటే వీటికి కొద్దిగా కారం, మిరియాలపొడి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటోలు చేర్చి అందులో కాస్త ఉప్పు కలిపి స్నాక్‌లా తినొచ్చు. ఆ తర్వాత అల్లం వేసిన గ్రీన్‌ టీ లేదా నిమ్మకాయ టీ తాగాలి.
డిన్నర్‌తోబాటు అల్లం, మిరియాలపొడి, సన్‌ఫ్లవర్‌ విత్తనాలు మెత్తగా దంచి ఆ మిశ్రమాన్ని క్యారెట్‌ జ్యూసులో కలుపుకుని తాగితే మంచిది. 
ఇతర జాగ్రత్తలు
 వేడినీళ్లతో నోటిని పుక్కిలిస్తుండాలి.
శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కుంటుండాలి.
 చేతులు కడుక్కోకుండా కళ్లు, ముక్కు, నోటిని  తాకకూడదు.
 దగ్గినా, తుమ్మినా టిష్యు పేపర్‌ లేదా కర్చీఫ్‌ను అడ్డం పెట్టుకోవాలి.
వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలి.
 రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి.
శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.
 

డా.జానకి
న్యూట్రిషనిస్టు,
హైదరాబాద్‌