స్వైన్‌ ఫ్లూ పని పడదాం

అత్యంత త్వరగా వ్యాపించే అంటువ్యాధుల్లో స్వైన్‌ ఫ్లూ 

ప్రధానమైనది. సమర్థమైన చికిత్సతో అణచేకొద్దీ మరో కొత్త
రూపంతో తిరిగి విజృంభించే శక్తి ఈ వ్యాధికుంది. ఇంతటి శక్తిని 
ఈ వైరస్‌ ఎలా సంపాదించుకుంది? ఆ శక్తితో సమానంగా మన 
శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఎందుకు పెరగలేకపోతోంది? 
అసలు వ్యాక్సిన్‌ల సామర్థ్యం ఎంత?
వైరస్‌ అనే సూక్ష్మజీవులు అంటురోగాలను కలుగజేస్తాయి. వీటిలో కొన్ని రకాల వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు విపరీతంగా ప్రబలుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒకే కాలంలో వందలు, వేలు, లక్షల మంది ప్రజల మీద దాడి చేస్తాయి. ఈ పరిస్థితినే వైద్య పరిభాషలో ‘అపిడమిక్‌’ అంటూ ఉంటాం. ఈ వైరస్‌ వ్యాపించటానికి కొన్ని అంశాలు తోడ్పడుతాయి. తేమతో కూడిన వాతావరణం, జనసమ్మరఽ్ధం, అపరిశుభ్రతలాంటి అంశాలు తోడైనప్పుడు వైరస్‌ మహమ్మారిలా విజృంభిస్తుంది. అలా ఒక ప్రాంతానికే పరిమితమైపోకుండా వివిధ దేశాలకు విస్తరించి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ‘పాండమిక్‌’ పరిస్థితి కూడా నెలకొంటూ ఉంటుంది. వైరల్‌ అంటువ్యాదులు అసాధరణమైనవేమీ కావు. వైరల్‌ కారక ఇన్‌ఫ్లూయెంజా ఎపిడమిక్‌ ప్రతి ఏటా 15ు ప్రపంచ జనాభాను పీడిస్తూనే ఉంది. వీటిలో చాలావరకూ చికిత్సకు తేలికగా లొంగేవే అయినా స్వైన్‌ ఫ్లూ లాంటి మొండి ఎపిడమిక్‌ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 2,50,000 నుంచి 5,00,000 మంది ప్రాణాలను హరిస్తూనే ఉంది. 
ఇన్‌ఫ్లూయెంజా అంటే?
వైర్‌సలలో కొన్ని ఉప రకానికి చెందినవి ఫ్లూ జ్వరంతో కూడిన ఇన్‌ఫ్లూయొంజాను కలుగజేస్తాయి. కొన్ని రకాల ఫ్లూ కారక వైర్‌సలు మనుషులు మొదలుకుని పక్షులు, పందుల వరకూ అతిధేయులుగా ఎంచుకుని వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. అలా 20వ శతాబ్దంలో 1918లో ‘స్పానిష్‌ ఫ్లూ’, 1957లో ‘ఏసియన్‌ ఫ్లూ, 1968లో హాంకాంగ్‌ ఫ్లూ’...ఇలా పలురకాల పాండమిక్స్‌ వెలుగులో కొచ్చాయి. ఇలా ఓ కొత్త రకం పాండమిక్‌ తలెత్తినప్పుడల్లా మనుషుల్లో సరికొత్త వైరస్‌ కంటపడుతూ ఉండటం వైద్యులను ఆశ్చర్యపరిచింది. ఇందుకు కారణాలను పరిశోధిస్తే... వైరస్‌ మనుషుల నుంచి జంతువులకు వ్యాపించటం, లేదా పక్షులు, పందుల మీద దాడి చేసే వైర్‌సతో సంకరం చెంది జన్యు రూపాంతరం చెందటం అనే రెండు రకాల కారణాలు కనిపించాయి. అలా 2009 ఏప్రిల్‌లో ఓ సరికొత్త ఫ్లూ రకం వెలుగుచూసింది. మనుషులు, పక్షులు, పందులు...ఈ మూడు అతిధేయుల్లోని జన్యువులతో సంకరం చెంది ఓ కొత్త రకం వైరస్‌ ప్రబలటం మొదలుపెట్టింది. అదే...‘స్వైన్‌ ఫ్లూ’.
వైరస్‌తో పోరాడే వ్యాధి నిరోధక శక్తి 
వైర్‌సలు ఉనికిని కాపాడుకుంటూ వృద్ధిచెందాలంటే వాటికి జీవమున్న అతిథేయి అవసరం. అలా వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు కణాల్ని అదుపులోకి తీసుకుని మరిన్ని వైర్‌సలను వృద్ధిచేసేలా వాటిని ప్రోత్సహిస్తుంది. అయితే ఇదంతా జరగటానికి ముందు సహజసిద్ధమైన రోగ నిరోధక వ్యవస్థ వ్యాధికారక వైర్‌సకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెడుతుంది. శరీరం మీద వైరస్‌ దాడి చేయగానే రోగ నిరోధక శక్తి రంగంలోకి దిగి కణాలు వైర్‌సలను తిప్పికొట్టేలా శరీరాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజూ బిలియన్ల సంఖ్యలో ఎముక మజ్జలో తయారయ్యే తెల్ల రక్తకణాలు శరీర కణాలకు రక్షణ కల్పిస్తూ వైర్‌సతో పోరాడతాయి. మాక్రోఫేజెస్‌ అనే తెల్ల రక్తకణాలు సూక్ష్మక్రిములను గుర్తించగానే వెంటనే దాడిచేసి నాశనం చేస్తాయి. అంతటితో వైరస్‌ నశించకుండా మరింత విస్తరిస్తే అంతకంటే శక్తివంతమైన టి, బి లింఫోసైట్స్‌ అనే తెల్ల రక్త కణాలు పోరాటం మొదలుపెడతాయి. వీటికితోడు బి కణాలు తయారుచేసే ప్రత్యేకమైన ప్రొటీన్‌ అయిన యాంటీబాడీలు రంగంలోకి దిగుతాయి. ఇవి వైరస్‌ వృద్ధిచెందకుండా కట్టడి చేసి మరిన్ని ఎర్ర రక్త కణాలు నాశనమవకుండా కాపాడతాయి. టి సెల్స్‌ దాడిచేసే వైర్‌సను గుర్తించి అప్రమత్తం చేస్తుంటాయి. వీటిలో కొన్ని వ్యాధి పెరగకుండా వైర్‌సతో ఇన్‌ఫెక్ట్‌ అయిన కణాల్ని నేరుగా నాశనం చేసేస్తాయి. మరికొన్ని యాంటీబాడీస్‌ ఉత్పత్తిలో బి సెల్స్‌కు సహాయపడతాయి. అలా టి, బి సెల్స్‌ వైర్‌సను సమర్థవంతంగా శరీరం నుంచి నిర్మూలించిన తర్వాత ఆ వైరస్‌ నమూనాను ఙ్ఞాపకం పెట్టుకుంటాయి. ఇలా గుర్తుపెట్టుకోవడం మూలంగా అదే రకమైన వైరస్‌ మరోసారి దాడి చేయకుండా శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ మనకు రక్షణ కల్పిస్తుంది. ఇలాంటి వ్యాధి నిరోధకశక్తినే ‘అక్వైర్‌డ్‌ ఇమ్యూనిటీ’ అంటారు. ఇలాంటి ఇమ్యూనిటీ మనకు జీవితకాలపు వ్యాధి నిరోధక శక్తిని సమకూర్చి పెడుతుంది. అందువల్లే చిన్నతనంలో వచ్చిన ఆటలమ్మ (చికెన్‌ పాక్స్‌), గవద బిళ్లలు (మంప్స్‌)లాంటి వ్యాధులు జీవితంలో రెండోసారి దాడి చేయకుండా ఉంటున్నాయి. అయితే స్వైన్‌ ఫ్లూ వైరస్‌ విషయంలో ఇలాంటి అక్వైయిర్‌డ్‌ ఇమ్యూనిటీ పనిచేయలేకపోవటానికి ఇతర కారణాలున్నాయి.
వైరస్‌లు ఎందుకు తిరగబడుతున్నాయి?
ఫ్లూ వైరస్‌ ఎంతో తెలివిగా, త్వరితంగా రూపాలు మార్చుకునే గుణం కలిగి ఉంటుంది. అలా పుట్టే ప్రతి కొత్త వైరస్‌ మనిషి నుంచి మనిషికి వ్యాపించే క్రమంలో జన్యుపరమైన మార్పులు చేసుకుంటూ మరింత బలపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో దాని రూపు కూడా మారిపోవడంతో మన శరీరంలోని వ్యాధినిరోధక ఙ్ఞాకపశక్తి కలిగి ఉండే కణాలు వీటిని గుర్తుపట్టలేకపోతూ ఉంటాయి. దాంతో కణాలు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతాయి. అందువల్లే ఒకసారి చికిత్సతో నయమైనా మళ్లీ మళ్లీ కూడా ఫ్లూ దాడి చేస్తూనే ఉంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ గర్తుపట్టలేని విధంగా కొత్త కొత్త రూపాల్లో వైరస్‌ వృద్ధిచెందుతూ మనల్ని వ్యాధిగ్రస్థుల్ని చేస్తూనే ఉంటుంది. మరి ముఖ్యంగా జంతువుల్లో వృద్ధి చెంది మనుషులకు వ్యాపించిన వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపించి శరీరంలో విస్తరిస్తుంది. అయితే అన్ని రకాల వైర్‌సలూ ఇంత క్లిష్టంగా ఉండవు. 
జలుబు ఎలా తగ్గుతోంది?
జలుబును కలగజేసే వైర్‌సలో వందల రకాలుంటాయి. ఇవి ఫ్లూ వైర్‌సలా ఒకే రకానికి చెందిన వైరస్‌ కాదు. పైగా ఫ్లూ వైర్‌సలా జలుబును కలగజేసే వైరస్‌ మ్యుటేట్‌ (పరివర్తనం) చెందవు. కాబట్టి ఒకసారి జలుబు చేసినప్పుడు దానికి కారణమైన వైరస్‌ వ్యాధినిరోధకతను శరీరం పెంచుకుంటుంది. ఒకసారి తగ్గినా కొంతకాలానికి మళ్లీ జలుబు చేయటం సహజం. అంతమాత్రాన ఆ జలుబుకు కూడా అదే రకం వైరస్‌ కారణం అనుకోకూడదు. పదే పదే జలుబు చేస్తూనే ఉందంటే....అంతకుముందు జలుబుకు కారణంకాని మరో కొత్త జలుబుకారక వైరస్‌ దాడి చేసిందని అర్థం చేసుకోవాలి. కొన్ని రకాల వైర్‌సలు శరీరంలో నిద్రాణంగా ఉండి మానసిక, శారీరక ఒత్తిడి ప్రభావం వల్ల తిరిగి విజృంభిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిలో చికెన్‌పాక్స్‌ గురించి చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితినే వైద్య పరిభాషలో ‘షింజిల్స్‌’ అంటారు. ఇలా ప్రతి పది మందిలో ఒకరు షింజిల్స్‌కు గురవుతూ ఉంటారు. హెర్పిస్‌ సింప్లెక్స్‌ అనే వైరస్‌ వ్యాధి నిరోధక వ్యవస్థకు కనిపించకుండా నాడీ కణాలైన న్యూరాన్లలో దాక్కుని ఉంటుంది. కొన్ని హార్మోన్ల వల్ల నాడీ కణాలు ఒత్తిడికి గురైన సందర్భంలో కణాల నుంచి వ్యాధి రూపంలో బయటపడతాయి. 
 నవ్య డెస్క్‌
 
ఫేస్‌ మాస్క్‌  స్వైన్‌ ఫ్లూ వ్యాధిని అడ్డుకోలేదు 
స్వైన్‌ ఫ్లూ వార్తలు వినగానే బయటికి వెళ్లేటప్పుడు ముఖాలకు మాస్కులు ధరిస్తే సరిపోతుందిలే అనుకుంటాం. అవి కొనుక్కుని నిబ్బరంగా తిరిగేస్తాం. కానీ ఈ మాస్క్‌లేవీ స్వైన్‌ ఫ్లూను సమర్థంగా అడ్డుకోలేవంటున్నారు వైద్యులు. వైరస్‌ రిస్క్‌ నుంచి తప్పించుకోవాలంటే ఫేస్‌మాస్క్‌ ధరించటంతోపాటు ఇతర జాగ్రత్తలు కూడా పాటించాలి. అవేంటంటే...
చేతుల్ని తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
కళ్లు, ముక్కు, నోటిని తరచుగా చేతులతో తాకకూడదు.
ఫ్లూ లక్షణాలు కనిపిస్తే జ్వరం తగ్గిన 24 గంటల వరకూ ఇతరులకు దూరంగా ఉండాలి.
స్వైన్‌ ఫ్లూను పోలిన జబ్బు వ్యక్తులకు కనీసం 6 అడుగుల దూరం పాటించాలి.
ఫేస్‌ మాస్క్‌ను ఒకేసారి వాడి పారేయాలి. పదే పదే ఒకే మాస్క్‌ వాడటం వల్ల ప్రయోజనం ఉండదు.
 
 రోగనిరోధక శక్తితో అడ్డుకోవచ్చు
స్వైన్‌ ఫ్లూ వైరస్‌ కాంటాక్ట్‌లోకొచ్చిన ప్రతి ఒక్కరూ వ్యాధికి గురయ్యే పనైతే మరణాల సంఖ్య అపారంగా ఉంటుంది. ఇలా జరగకపోవడానికి కారణం శరీరంలోకి చొచ్చుకుపోయి విస్తరించే వైరస్‌ శక్తిని బలహీనపరిచే గుణం కొందరు కలిగి ఉండటమే! వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండే కొందరి శరీరాల్లోని రిసెప్టార్స్‌ బలంగా ఉండి వైరస్‌ వ్యాప్తిని నిరోధిస్తాయి. కాబట్టి స్వైన్‌ ఫ్లూను సమర్థంగా నియంత్రించాలంటే అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవటంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవాలి. ఇందుకోసం ఈ జాగ్రత్తలు పాటించాలి.
 
ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి.
రోజుకి 8 గంటల నిద్ర తప్పనిసరి.
పోషకాహారం తీసుకోవాలి.
తాజా కూరగాయలు, పళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
పరిశుభ్రత పాటించాలి.
మత్తు పదార్థాలకు, సిగరెట్లకు దూరంగా ఉండాలి.
తరచుగా చేతులు కడుక్కోవాలి.
స్వైన్‌ ఫ్లూ రోగులకు దూరం పాటించాలి.
మధుమేహులు, ఆల్కహాలిక్స్‌ రెట్టింపు జాగ్రత్తలు పాటించాలి.
స్వైన్‌ ఫ్లూ మ్యూక్‌సలో వైరస్‌ బయటి వాతావరణంలో కూడా రెండు రోజులపాటు సజీవంగా ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధిగ్రస్థుల ఉమ్మిని తాకడం చేయకూడదు.
డా.బి.విజయ్‌ కుమార్‌, 
సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌
యశోద హాస్పిటల్స్‌,      సికింద్రాబాద్‌.