చికున్‌ గున్యా చెక్‌ పెట్టేద్దాం !

24-09-2018: అప్పటిదాకా చకచకా నడిచిన వ్యక్తిలో హఠాత్తుగా అంగవైకల్యంలా ఇదేమిటి? ఎన్నో ఏళ్లుగా మంచాన పడి ఉన్నట్లు, లేవాలేక, కూర్చోలేక నానా అవస్థలూ పడటమేమిటి? చికున్‌గున్యాతో ఎదురయ్యే చిత్రమైన పరిస్థితే ఇది.

సమస్య తలెత్తాక పడే సాధక బాదకాలు సరే! అసలు రాకుండానే నివారించలేమా?
పోనీ వ చ్చాకనైనా ఏం చెయ్యాలి?
 
వైరస్‌ను ఓడించడం ఈజీ! 
 
వ్యాధి నిర్ధారణ
చికున్‌ గున్యా వైర్‌సను ఎలిసా (ఎంజైమ్‌ లింక్డ్‌ ఇమ్యూనోసార్టెంట్‌ ఎస్సే) అనే పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఆయుర్వేదంలో రోగి అగ్ని (ఆకలి-దాహం)ని పరీక్షించడం ద్వారా, ఏయే జీవకణజాలాలు (ధాతువులు) ప్రభావితం అయ్యాయో విశ్లేషించడం ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు.
 
కీళ్లనొప్పులు.. మోకాళ్లనొప్పులు... చాలా మందికి అప్పటిదాకా ఏ మాత్రం తెలిసిరాని అనుభవం. ఎప్పుడో వార్ధక్యంలో ఎదురు కావలసిన బాధలు నడివయసులోనే మొదలైతే ఏమనుకోవాలి? మనం ఏమనుకున్నా, అనుకోకపోయినా, చికున్‌గున్యా నిలువెల్లా ఛిద్రం చేస్తుంది. భరించరాని కీళ్లనొప్పులకు మారుపేరుగా నిలిచే ఈ వ్యాధి అదే పేరుగల వైరస్‌ సోకడం ద్వారా సంక్రమించే సమస్య.
 
ఎలా వస్తుంది?
చికున్‌గున్యా వైర్‌సను కూడా ‘ఈడిస్‌’ అనే ఒక రకం దోమలు మనుషుల మీదికి యుద్ధానికి ఉసిగొల్పుతాయి. ఒకసారి ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తే చాలు కీళ్లు, కండ రాల్లో విపరీతమైన నొప్పి రావడంతో పాటు, ఆయా భాగాల్లో వాపులు మొదలవుతాయి. వీటితో పాటు జ్వరం కూడా మొదలవుతుంది. కొద్దిరోజుల్లో జ్వరం తగ్గినా కొందరిలో ఈ కీళ్లనొప్పులు నెలల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. ఇది ఈ వైరస్‌ ద్వారా కలిగే అదనపు బాధ. ఆయర్వేదంలో ఈ కారణంగా వచ్చే జ్వరాలను విషజ్వరాలు, ఆనుషంగిక జ్వరాలు, ఆవర్త జ్వరాలు, సన్నిపాత జ్వరాలు, ఆమ జ్వరాలు - ఇలా జ్వరం అవస్థను బట్టి అనేక రకాలుగా పిలుస్తారు. చికున్‌ గున్యా వైరస్‌ వల్ల తీవ్రమైన జ్వరంతో పాటు, జీర్ణవ్యవస్థ , రస, రక్తధాతు వ్యవస్థ కుంటుపడుతుంది. చివరికి కదల్లేని స్థితి ఏర్పడుతుంది.
 
ఎందుకొస్తుంది?
ఎక్కువగా 50 ఏళ్లకు పైబడిన వారిలో ప్రత్యేకించి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిన వారిలోనే చికున్‌ గున్యా వైరస్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. జీర్ణశక్తి లోపించిన వారిలో, జీవ క్రియలు కుంటుపడిన వారిలోనే ఈ వైరస్‌ తీవ్రత కనిపిస్తుంది. జీవక్రియలు, ధాతు పరిణామ క్రియలు లోపించిన వారు పుష్టికరమైన ఆహారం తీసుకున్నా, మధ్యంతర ధాతు పరిణామ ఘటకాలు (ఇంటర్మీడియెట్‌ సబ్‌స్టాన్సెస్‌) ఉత్పత్తై ఆ యా కణజాలాలను పనిచేయకుండా చేస్తాయి. దీనికంతటికీ శరీరంలో సహజంగా ఉండే అగ్ని త గ్గిపోవడమే కారణం. దీనివల్ల శరీరంలో విషతుల్యమైన అజీర్ణఽ ధాతు ఘటకాలు తయారవుతాయి. దీన్నే ఆయుర్వేద పరిభాషలో ‘ఆమం’ లేదా ‘ఆమవాతం‘ అని పిలుస్తారు.
 
ఏం తినాలి?
జ్వరంతో పాటు జీర్ణక్రియ మందగించడంతో ఆహార పదార్థాలు, ‘ఆమ విషం’ గా మారతాయి. ఈ స్థితిలో జీర్ణవ్యవస్థ పైన మరింత భారం పడకుండా, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి.
ద్రవాహారమైతే మరీ మేలు. వాటిల్లో ముఖ్యంగా జావ, అంబలి, పండ్లు, పండ్ల రసాలు, పలుచని పాలు, మజ్జిగ, పలుచని పప్పు, ఉడికించిన కూరగాయల రసం, కొబ్బరి నీళ్లు, గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఆకలి మందగించినప్పుడు కొందరికి వికారం ఉండవచ్చు. వాంతి కావచ్చు. ఇలాంటి సమయాల్లో ద్రవపదార్థాలే ఉత్తమం.
 
గృహ వైద్యంగా...
ధనియాలు లేదా శొంఠి కషాయాన్ని అరకప్పు మోతాదులో రోజుకు నాలుగు సార్లు సేవిస్తే, జ్వరంతో పాటు నొప్పులూ తగ్గుతాయి.
శొంఠి కషాయంలో ఒక చెంచా ఆముదం కలిపి తీసుకుంటే, నొప్పులు తగ్గడంతో పాటు పేగులు శుభ్రపడి జీర్ణశక్తి పెరుగుతుంది.
తిప్పతీగె రసం గానీ, కషాయం గానీ తాగితే జ్వరం తగ్గడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఇవి తాగితే... నివారించవచ్చు!
వాస్తవానికి, వ్యాధినిరోధక శక్తి బలంగా ఉన్న వారికి ఏ వైరస్‌ సోకినా ఏమీ కాదు. అందువల్ల వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడమే లక్ష్యం కావాలి. అదేదో వ్యాఽధి సోకిన తర్వాతే మొదలెట్టడం కాదు, జీవన శైలిలో భాగం కావాలి. అందులో భాగంగా
సి- విటమిన్‌ ఎక్కువగా ఉండే ఉసిరి, నిమ్మరసాలను నిత్యం తాగాలి. వీటితో పాటు నీళ్లు కలపకుండా తీసిన తిప్పతీగె రసం, రోజూ ఒక స్పూను చొప్పున
పరగడుపున తీసుకోవాలి.
ఒక కప్పు పాలు, 8 కప్పుల నీళ్లు కలిసిన ద్రావణంలో 5 గ్రాముల వెల్లుల్లిపాయల గుజ్జును కలిపి మరిగించాలి. కప్పు పాలు మాత్రమే మిగిలేదాకా మరిగించి ఆ తర్వాత చల్లార్చి పరగడుపున రోజుకోసారి తాగాలి.
బొప్పాయి ఆకు రసాన్ని ఒక స్పూను తేనెతో కలిపి సేవిస్తే రోగనిరోధానికీ, వ్యాధినిరోధకశక్తికీ తోడ్పడుతుంది. అప్పుడిక చికున్‌గున్యా వైరసే కాదు, మరే ఇతర వైరస్‌, బ్యాక్టీరియాలూ దరిచేరవు.

చికిత్సా విధానం!

ఆకలిని సంరక్షించడం, శరీరంలోని ఆమ విష ఘటకాలను (ధాతుగత అమం) నిర్వీర్యం చేయడం, నొప్పులు, జ్వరానికి ఉపశమన మందులు వాడటం, రోగ నిరోధకంగా పని చేసే రసాయన మందులను శక్తికారక మందులను ఇవ్వడం ద్వారా చికున్‌ గున్యాను తగ్గించే వీలుంది. అయితే, చికున్‌ గున్యా తీవ్ర దశలో ఉన్నప్పుడు ఉపశమన లేదా సంశమన చికిత్సలు చేయాల్సి ఉంటుంది.
వ్యాధి దీర్ఘకాలికంగా కొనసాగుతున్నప్పుడు సంశోధన చికిత్సలు అవసరమవుతాయి. సంశమన చికిత్సలో భాగంగా రోగి పాటించవలసిన ఆహార, జీవన విధానాలు కూడా ఉంటాయి. సంశోధన చికిత్సలో వమన, విరేచన, వస్తి చికిత్సలు ఉంటాయి. యోగరాజ గుగ్గులు లేదా త్రయోదశాంగ గుగ్గులు, రాస్నాఽధి కాఢా, వంటి మందులు నొప్పుల ఉపశమనానికి, కీళ్లనొప్పులు, వాపులు తగ్గడానికి ఉపయోగపడతాయి. 
పైపూతగా విషగర్భ తైలం, సైంధవాది తైలం వాడవచ్చు. నొప్పులు ఉన్న భాగంలో వీటిల్లోని ఏదో ఒక తైలంతో మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. 
వీటి తో పాటు మృత్యుంజయ రసం లేదా శీతాంశురసంతో పాటు, సంశమన వటి, కస్తూరి వైభవ రసం వంటివి ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో తీసుకుంటే వ్యాధి సమూలంగా తొలగిపోతుంది.
ప్రొఫెసర్‌ చిలువేరు రవీందర్‌
ప్రభుత్వ బి.ఆర్‌.కే.ఆర్‌ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్‌
 
 
 
ఆ నొప్పులు పోవాలంటే?
చికున్‌ గున్యా తాలూకు కీళ్ల నొప్పులు నెలల పర్యంతం కొనసాగుతున్న వారికి, లైకోపోడియం, సైలీషియా, కాల్కేరియా కార్బ్‌ వంటి మందుల్ని వారి లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కీళ్లనొప్పులను సమూలంగా తగ్గించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అయితే ఈ మందులతో పాటు, శరీర పోషణకు అవసరమైన విటమిన్లు, లవణాలు, ప్రొటీన్లు తప్పనిసరి తీసుకోవాలి.
 
చికున్‌ గున్యా వైరస్‌ వల్ల వచ్చే కీళ్లనొప్పులు భరించలేనంత తీవ్రంగా ఉంటాయి. అందుకే ఆ పేరు వినగానే చాలా మందికి భయం. చికున్‌ గున్యా వైర్‌సతో ఎదురయ్యే మరో సమస్య ఏమిటంటే, జ్వరం, తలనొప్పి వంటివి కొద్ది రోజుల్లోనే తగ్గినా, కీళ్ల నొప్పులు మాత్రం కొందరిలో 6 నుంచి 18 మాసాల పాటు కొనసాగుతూనే ఉంటాయి.
 
ప్రాథమికంగా,...
వైరస్‌ సోకిన తొలిదశలో తీవ్ర మైన జ్వరం, భరించరాని తలనొప్పి, కీళ్లనొప్పులు, చర్మమంతా దద్దుర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలా కనిపించగానే, హోమియో వైద్యులు ‘బెల్లడోనా-200’ మందు ఇస్తారు. జ్వరం కాస్త తగ్గగానే ‘ఇపటోరియం- పర్ఫోలియేటం’ అనే మందు సూచిస్తారు. రోజుకు రెండు సార్ల చొప్పున నాలుగు రోజుల పాటు వేసుకుంటే చికున్‌గున్యా లక్షణాలు బాగా తగ్గుతాయి. ఆ తర్వాత ‘రూస్టాక్స్‌-200’ మందు ఇవ్వడంతో అన్ని రకాలుగా ఉపశమనం లభిస్తుంది.
 
కొంత మందికి సమస్య తగ్గినట్లే తగ్గి వారానికి ఒకసారో, నెలకొకసారో మళ్లీ మళ్లీ కీళ్లనొప్పులు వస్తుంటాయి. అలాంటి వారికి ‘జెల్సీమియం -200’ మందు ఇస్తారు. దీన్ని రోజుకు 3 సార్ల చొప్పున రెండు మూడు రోజుల పాటు వేసుకుంటే తిరిగి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
 
అంతకాలం ఎందుకు?
చికున్‌ గున్యా తాలూకు కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు కొందరిలో ఎక్కువ కాలం కొనసాగడానికి, ఆ వైరస్‌ విడుదల చేసే విషం అంత తీవ్రమైనది కావడం ఒక ప్రధాన కారణం. దీనికి తోడు ఆ యా వ్యక్తుల్లో వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం కూడా కారణమే. వీటికి విరుగుడుగా ఇతర వైద్య విధానాల్లో పెయిన్‌ కిల్లర్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ ఇస్తూ ఉంటారు. వీటివల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. మరికొందరేమో నొప్పులు త్వరగా తగ్గుతాయని స్టెరాయిడ్లు ఇస్తుంటారు. ఇవి మరీ ప్రమాదకరం. అయితే అలాంటి దుష్ప్రభావాలేవీ లే కుండానే ఈ నొప్పులను తగ్గించే మందులు హోమియోలో ఉన్నాయి.

ఏ వ్యాధైనా తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తోందీ అంటే, వారిలో వ్యాధినిరోధక శక్తి బాగా తగ్గిపోయిందని అర్థం. ‘ట్యుబర్‌కులమ్‌’ అనే మందును అప్పుడప్పుడు ఇవ్వవలసి ఉంటుంది. 

వీటితో పాటు...

నిరంతరమైన మానిసిక ఒత్తిళ్ల వల్ల సహజంగానే, మెదడు నుంచి వచ్చే ఆదేశాలేవీ శరీర భాగాలకు అందవు. దీనివల్ల జీవక్రియలు కుంటుపడి ఇది కూడా వ్యాధినిరోఽధక శక్తి తగ్గడానికి కారణమవుతుంది. దీనికి నివారణగా అర్జెంటమ్‌ నైట్రికమ్‌, నేట్రమ్‌ మూర్‌, ఇగ్నీషియా వంటి మందులు ఉపయోగపడతాయి.
ఈ తరహా హోమియో చికిత్సల వల్ల చికున్‌ గున్యా తాలూకు బాధలు మూడు నాలుగు వారాల్లోనే సమూలంగా తగ్గిపోతాయి.
 
నివారణగా...
ఒకసారి చికున్‌ గున్యా సోకిన తర్వాత బాధపడేకన్నా అసలు ఆ వైరస్‌ బారిన పడకుండా ముందే నివారించే హోమియో మందులు తీసుకోవడం శ్రేయస్కరం. వాటిలో ‘ఇపటోరియం పర్‌ఫోలియేటం - 200’ మందును ఒక రోజు మూడు పూటలా వేస్తే సరిపోతుంది. ఈ మందు వ్యాధి నివారణకే కాకుండా చికిత్సగా కూడా పనిచేస్తుంది. అయితే, ఒకవేళ ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ వైరస్‌ బారిన పడుతూ ఉంటే ఓ వారం తర్వాత మళ్లీ ఒక రోజు మూడు పూటలా వేసుకోవాలి. ఆ తర్వాత వారానికి ‘ట్యుబర్‌కులమ్‌- 200’ మందును ఒక డోసు వేసుకుంటే చాలు. చికున్‌గున్యా వైరస్‌ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చు.
 
డాక్టర్‌ కె. గోపాల కృష్ణ
కన్సల్టెంట్‌ హోమియో ఫిజిషియన్‌
హైదరాబాద్‌