ఉల్లితో చక్కెరకు బ్రేక్‌...

ఉల్లిరసంతో రక్తంలో చక్కెరస్థాయి తగ్గుతుంది. దాంతోపాటు చక్కెర వ్యాధిగ్రస్తుల్లో కొలెస్ర్టాల్‌ స్థాయిని కూడా తగ్గిస్తుంది అంటున్నారు పరిశోధకులు. ‘‘యాంటీ బయాటిక్‌ డ్రగ్‌ మెట్‌ఫార్మిన్‌, ఉల్లిపాయ రసాన్ని కలిపి వాడి రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించొచ్చు. ఇదొక్కటే కాకుండా చక్కెర వ్యాధిగ్రస్తుల్లో కొవ్వుస్థాయి కూడా తగ్గిపోతుంది. ఎలుకల మీద చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఉల్లిలో ఉన్న ఏ గుణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయనే అంశం మీద ఇంకా పరిశోధన జరపాల్సి ఉంది. 

డయాబెటిక్‌ లేని ఎలుకల్లో ఉల్లిరసం వల్ల బరువు పెరిగింది. ఉల్లిలో కాలరీలు అధికంగా ఉండవు. అయినప్పటికీ జీవక్రియల రేటు పెంచే గుణం ఉంది కాబట్టి ఆకలి పెరిగి, ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగి ఉండొచ్చు’’ అన్నారు నైజీరియా, డెల్టా స్టేట్‌ యూనివర్శిటీ పరిశోధకులు ఆంథోని. పరిశోధనా ఫలితాలను కాలిఫోర్నియా, శాండిగోలో జరిగిన ‘ఎండోక్రైన్‌ సొసైటీ’ ఎండో 2015 వార్షిక సమావేశంలో వెల్లడించారు.