మధుమేహులు ఏం తినకూడదు?

ఆంధ్రజ్యోతి,20-11-15:రక్తంలో చక్కెరస్థాయి నియంత్రణలో ఉన్నంత వరకు మధుమేహం ఇబ్బంది పెట్టదు. షుగర్‌ ఉన్నవారు ఏది పడితే అది తినడం మంచిది కాదు. ఎటువంటి పదార్థాలకు దూరంగా ఉండాలో ఒకసారి చూద్దాం.వైట్‌ బ్రెడ్‌, వైట్‌ఫ్లోర్‌, పాలిష్డ్‌ రైస్‌లు ఎక్కువగా తినకకపోవడం ఉత్తమం. వీటి మోతాదు పెరిగితే షుగర్‌లెవెల్స్‌ పెరిగే అవకాశం ఉంది. వీటికి బదులు బ్రౌన్‌రైస్‌, బ్రౌన్‌ బ్రెడ్‌, గోధుమలకు ప్రాధాన్యం పెంచాలి.పాల ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇందులోని శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వార హృద్రోగ ముప్పు తలెత్తుతుంది. 

 కాబట్టి పాల ఆధారిత పదార్థాలైన- బటర్‌, మీగడ పెరుగు, నెయ్యిలను మానేయాలి. వీటికి ప్రత్యామ్నాయంగా మీగడ తీసిన పెరుగు, చిలికిన మజ్జిగ, డబుల్‌ టోన్డ్‌ మిల్క్‌ వంటివి తీసుకోవచ్చు.చెడుకొవ్వును పెంచే వాటిలో వేగించిన పదార్థాలు ప్రమాదకరమైనవి. షుగర్‌ ఉన్న వాళ్లు ఫ్రెంచ్‌ప్రైస్‌, ఆలూ చిప్స్‌, పకోడీ, పాపడ్‌ల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. నూనెలో వేగించిన పదార్థాలు తినడం వల్ల బరువు పెరుగుతారు. స్థూలకాయం మధుమేహానికి శత్రువు.శీతలపానీయాల్లో చక్కెరస్థాయి అత్యధికం. ఒక్క బ్రాండెడ్‌ డ్రింక్‌లోనే ఆరు నుంచి ఏడు స్పూన్ల చక్కెర ఉంటుందని తేలింది. షుగర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న పానీయాలను తాగడం వల్ల మధుమేహులకు ఇబ్బందులు తప్పవు.పండ్ల రసాల వల్ల కూడా బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవెల్స్‌ ఎక్కువవుతాయి. కాబట్టి జ్యూస్‌లు మాని.. తాజా పండ్లు తినడం ప్రయోజనకరం. పండ్లలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచుపదార్థం లభిస్తుంది. జీర్ణశక్తి చురుగ్గా ఉంటుంది.