నైట్‌షిఫ్ట్‌లతో ఇబ్బందులొస్తాయా!

22/05/15

మీలో ఎవరైనా ఆఫీసులో నైట్‌ షిఫ్ట్‌లో పనిచేస్తున్నారా...? లేక నైట్‌ షిఫ్ట్‌లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారా..? అయితే మీరు కొన్ని క్రమశిక్షణ పద్ధతులు పాటించాలి. ఎందుకంటే రాత్రి సమయాల్లో పని చేసేవారికి ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకూ ఉండే షిఫ్టులో పనిచేసే వారినీ,  రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారినీ ఓ సర్వేలో పరిశీలించారు.  1593 మందిని ఈ సర్వేలో పరిశీలించారు. ఉదయం సమయంలో పనిచేసే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవనీ, రాత్రి సమయాల్లో పనిచేసే వారు డయాబెటీస్‌, మెటబాలిక్‌ సంబంధ వ్యాధుల వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తేలింది.

వీరందరి బాడీ మాస్‌ ఇండెక్స్‌(బీఎమ్‌ఐ) ప్రకారం పరిశీలకులు ఈ సర్వేను ప్రకటించారు. రాత్రి సమయాల్లో పనిచేసే వారు నిద్రలేమికి సంబంధించిన హానికరమైన సమస్యలతో సతమతమవుతుంటారని తేలింది. వారి ముఖంలో వర్చస్సు కూడా తగ్గిపోతుందని పరిశీలకులు కనుగొన్నారు. దీంతో పాటు రాత్రి సమయాల్లో పనిచేసే వారు ఉదయం సమయాల్లో పనిచేసే వారికంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఈ సర్వేలో తెలిపారు. తరుచుగా పనిచేసే సమయాలు మారడం, పగటి సమయాల్లో నిద్ర రాకపోవడం వంటి వాటి వల్ల వారు పనిపైన దృష్టి పెట్టలేకపోతారని ఈ సర్వే తేల్చి చెప్పింది. అలాగే ఉదయం పని చేసేవారి కంటే రాత్రి పూట పని చేసేవారు బరువెక్కువగా ఉంటారని ఈ సర్వేలో తేలింది. సమయం ప్రకారం ఆహారం తినకపోవడమే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. దీనికితోడు ఆహార నియమాలు పాటించక పోవడం కూడా మరో కారణమని వారు చెబుతున్నారు.