మంచినిద్రతో మధుమేహం అదుపు

10-10-15,ఆంధ్రజ్యోతి:మధుమేహ నియంత్రణలో ఆహార, వ్యాయామాలతో సమానంగా నిద్ర పాత్ర కూడా అంతే కీలకమని ఇటీవలి పరిశోధనలు మరింతగా స్పష్టం చేస్తున్నాయి. కోల్‌కాతాలోని ఎఎమ్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఎండోకిరనాలజిస్టుగా ఉన్న డాక్టర్‌ బినాయక్‌ సిన్హా సేకరించిన సమాచారం ప్రకారం, నిద్రలేమి ఇన్సులిన్‌ నిరుపయోగత్వాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని స్పష్టమవుతోంది. దీనికి తోడు ఏకంగా గ్లూకోజ్‌ జీవక్రియా వ్వవస్థనే నిద్రలేమి అస్తవ్యస్తం చేస్తుందని వారి ఆధ్యయనంలో బయటపడింది. ఎక్కువ రాత్రులు ఆరుగంటల కన్నా తక్కువగా నిద్రించే వాళ్లల్లో షుగర్‌ నిలువలు పెరిగే పరిస్థితి మిగతా వారి కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుందని యాన ల్ప్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ పరిశోధనలో కూడా స్పష్టమయ్యింది. డచ్‌ వారు నిర్వహించిన పరిశోధన ప్రకారమైతే ఎన్నో రోజులని కూడా కాదు,   ఎప్పుడో ఒక రాత్రి నిద్రలేమికి గురైనా, శరీరంలో ఇన్సులిన్‌ను వినియోగించుకునే సామర్థ్యం తగ్గిపోతుందని తేలింది.

 అమెరికాలో  జరిగిన  మరో పరిశోధనలో తక్కువ సమయం నిద్రించే వారి శరీరం బరువు పెరిగే అవకాశముందని,  ఆరు గంటల కన్నా తక్కువగా  నిద్రించే 87 వేల మందిలో 33 శాతం మంది స్థూలకాయులైనట్లు వారు పేర్కొన్నారు. అదే ఏడు గంటలు నిద్రించే వారిలో ఈ పరిస్థితి లేదు. నిద్రలేమి వల్ల ఆకలిని క్రమబద్ధం చేసే హార్మోన్ల , గ్రెలిన్ల ఉనికిని దెబ్బ తింటుందని  కూడా వారు కనుగొన్నారు. ఆకలి పెరగడంతో పాటు షుగర్‌ నిలువలున్న స్నాక్స్‌,  స్ర్టాచెస్‌  వంటి  ఆహార పదార్థాల వైపు వీరి మనసు మొగ్గు చూపుతుందని  కూడా వారన్నారు. సహజంగా కొంత  మందికి 7 నుంచి 9 గంటల అవసరం  ఉంటుంది. కానీ, వారంతా అంతకన్నా తక్కువ సమయమే నిద్రిస్తున్నారు. అయితే ఎన్ని గంటలు నిద్రిస్తున్నామనేది ఎంత ముఖ్యమో,  ఎంత గాఢంగా నిద్రించారన్నది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఏడు గంటలు  పడుకున్నా మధ్యలో పదే పదే మెలకువ వస్తే అది కూడా షుగర్‌ నిలువలు పెరగడానికి దారి తీస్తుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలున్నా ఏడు గంటల నిద్రకు ఎవరికి వారు ప్రణాళిక సిద్ధం చేసుకోవలసిందేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.