మధుమేహంతో పుండు పడితే...

15-10-2018: మధుమేహంతో కాలికి పుండు పడిన ప్పుడు, అదే మానిపోతుందిలే అనుకుంటే ప్రమాదమే! అందువల్ల పుండు పడగానే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అన్నింటికన్నా ముందు పాదానికి విశ్రాంతినివ్వడం చాలా అవసరం. వైద్యుని పర్యవేక్షణలో ఉంటూనే తాముగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని...

గాయాన్ని రెండుసార్లు సెలైన్‌తో కడగాలి. లేదా మరగ కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పుకలిపి కడగవచ్చు. నీళ్లల్లో ఇతర ద్రావకాలేవీ కలపకూడదు. కడిగిన తర్వాత తేమ లేకుండా నూనెతో అద్దాలి. పైన ఏదైనా పౌడర్‌ చల్లడం మేలు. పౌడర్‌ తేమను పీల్చుకుంటుంది కాబట్టి ఇన్‌ఫెక్షన్లకు అవకాశం ఉండదు. ఆ తర్వాత పుండు మీద గాజ్‌గుడ్డ ఉంచి కాస్త వదులుగా కట్టు కట్టాలి. రోజూ డాక్టర్‌ వద్దకు వెళ్లడం కష్టం కాబట్టి ఎనరికి వారు కట్టుకోవడం నేర్చుకోవాలి.
 పుండు మీద ఆయింట్‌మెంట్లు గానీ, ఇతర పూత మందులుగానీ వైద్యులు సూచిస్తే తప్ప పూయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పుండు మీద దుమ్ముపడకుండా, ఈగలు వాలకుండా జాగ్రత్త పడాలి.
పుండ్ల విషయంలో డాక్టర్లు, మధుమేహం ఉన్నవారికీ లేని వారికీ చేసే చికిత్సలు వేరువేరనే విషయాన్ని తెలియాలి.
గాయం పైన స్పిరిట్‌ గానీ, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ గానీ వేయకూడదు. అంతగా అవసర మనుకుంటే, ఆ ద్రావణాన్ని బాగా పలుచన చేసి మాత్రమే వాడాలి.
కొంతమంది బోరిక్‌ యాసిడ్‌, టార్టారిక్‌ యాసిడ్‌ పౌడర్లను గ్లిజరిన్‌తో కలిపి పేస్టులా తయారు చేసి పుండు మీద రాసి కట్టుకడతారు. దీనివల్ల పుండు ఆ రోజు ఆరోగ్య కణజాలంలా తయారవుతుంది గానీ, మరునాటికే అది నల్లగా మృతకణజాలంగా (డెడ్‌ టిష్యూ)గా మారిపోతుంది. అందువల్ల అలాంటి వాటిని వాడకపోవడమే మేలు.
పుండు ఒకవేళ చీముపడితే, నొక్కడం గానీ, సూదితో గుచ్చడం గానీ, కట్‌ చేయడానికి ప్రయత్నించడం గానీ చేయకూడదు. అలా చేస్తే, ఇన్‌ఫెక్షన్‌ పైపైకి వ్యాపిస్తూ, సమస్య మోకాలి దాకా పాకుతుంది.
ఒకసారి పుండు పడితే అది పూర్తిగా మానడానికి 3 నుంచి 6 మాసాలు పడుతుంది. రోజూ తమకు తామే పుండు పైన కట్టుకడుతున్నా, అప్పుడప్పుడు డాక్టర్‌కు పుండును చూపించడం తప్పనిసరి. అయితే, ఒకసారి పుండు పూర్తిగా మానిపోయాక మళ్లీ కొత్త పుండు పడకుండా నిరంతరం జాగ్రత్త వహిస్తూ ఉండాలి.