చక్కెర వ్యాధికి చెక్‌ పెట్టేందుకు

19/08/14


చక్కెర వ్యాధి(డయాబెటిక్‌)తో బాధపడుతున్న వాళ్లు ప్రత్యేకంగా చేయాల్సిన యోగాసనాల గురించి ఇస్తున్న ఈ సిరీస్‌లో గత వారం నాలుగు యోగాసనాల గురించి చెప్పుకున్నాం. ఈ వారం మరో నాలుగు ఆసనాల గురించి, ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. 

ధనురాసనం

బోర్లా పడుకుని చేతులు ముందుకు చాపాలి. నుదుటిని నేలకి ఆన్చి పది సెకన్లు అదే భంగిమలో ఉండాలి. ఆ తరువాత కాళ్లు పైకి ముడిచి  రెండు చేతులతో కాలి మడమలు పట్టుకుని నెమ్మదిగా ఛాతి భాగాన్ని పైకి లేపి మెడ పైకెత్తాలి. 30 సెకన్లు ఈ భంగిమలో ఉండాలి. తరువాత మొదటి స్థితిలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఆసనంలో మెడ పైకెత్తి ఉంచడం వల్ల థైరాయిడ్‌ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది.
తినాల్సినవి - తినకూడనివి
డ్రై ఫ్రూట్స్‌, వాల్‌నట్స్‌ తినాలి. 
బాదంపప్పుని మాత్రం రాత్రి నానపెట్టి ఉదయాన్నే తినాలి. దీనివల్ల డయాబెటిస్‌ 40 శాతం వరకు అదుపులోకి వస్తుంది.
ఉదయాన్నే దాల్చిన చెక్క నీళ్లు తాగినా, ప్రతి రోజూ ఉదయాన్నే 16 కరివేపాకులు తిన్నా ఫలితం ఉంటుంది.
కిస్మిస్‌, పిస్తా, జీడిపప్పు, ఉప్పు వేసి వేగించిన నట్స్‌ మాత్రం అస్సలు తినొద్దు. వేపుళ్లకు కూడా దూరంగా ఉండాలి.
 
సేతు బంధాసనం
వెల్లకిలా పడుకుని కాళ్లు ముడిచి చేతులతో కాలి మడమల్ని పట్టుకోవాలి. శ్వాస లోపలికి పీలుస్తూ నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపాలి. 30 సెకన్ల ఈ భంగిమలో ఉన్న తరువాత శవాసనంలో పడుకుని 15 సెకన్లు విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఆసనానికి ముందు, తరువాత కూడా శవాసనంలోనే ఉండాలి.
 
శీర్షాసనం
మొదట వజ్రాసనంలో కూర్చోవాలి. ఆ తరువాత తలని నేలకి ఆన్చి నెమ్మదిగా కాళ్లు పైకి లేపాలి. (ఫోటోలో చూపించినట్టు.) తరువాత తల వెనుకగా చేతులు పెట్టుకుని పైకి లేపి ఉంచిన కాళ్లను వెడల్పుగా చాపాలి. ఈ ఆసనంలో కూడా 30 సెకన్లు ఉండాలి. కాని కొత్తగా చేస్తున్న వాళ్లు ఉండగలిగినంత సేపే ఉండాలి. రిస్క్‌ చేయొద్దు.
 
 
వజ్రాసనం
ఫోటోలో చూపించిన విధంగా కూర్చోవాలి. ఐదు నిమిషాలపాటు కదలకుండా ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. ఇది డయాబెటిక్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్లకి చాలా మంచిది.
 
మాన్సి గులాటి
యోగ నిపుణురాలు
హైదరాబాద్‌