సూదిపోటు లేకుండా షుగర్‌ పరీక్ష

29-06-2018: రక్తంలో చక్కెర స్థాయి తెలుసుకోవాలంటే వేళ్లపై సూదితో పొడవాల్సిందే! ఆ రక్తపు చుక్కను ఎలక్ట్రా‌నిక్‌ స్ట్రిప్‌పై వేయగానే చక్కెర ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ప్రతీసారీ ఇలా చేయాలంటే సూది భయం ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలం. అయితే ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాయంతో వివరాలు తెలుసుకొనే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ విషయంలో ఒక రాడార్‌, ఏఐ కీలకంగా పనిచేస్తాయి. గూగుల్‌, జర్మనీ హార్డ్‌వేర్‌ కంపెనీ ఇన్ఫీనియాన్‌ సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. శరీరానికి గాటు పెట్టకుండానే పరీక్ష చేయడం దీని ప్రత్యేకత. శరీరానికి అతుక్కుని ఉండి.. లోపల రక్త ప్రసరణను, అందులోని గ్లూకోజ్‌, చక్కెర స్థాయిలను తెలుసుకొంటుందని కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్‌లూ శాస్త్రవేత్తలు తెలిపారు. పరీక్షల్లో 85 శాతం ఫలితాలు కచ్చితంగా వచ్చినట్లు తెలిపారు. ఆధునిక వైద్య చికిత్సలో దీనినో విప్లవంగా భావిస్తున్నారు. ఈ పరికరం ఖర్చు కూడా తక్కువేనని..కరెంటు వినియోగం కూడా పెద్దగా ఉండదని చెబుతున్నారు.