షుగర్‌ రాకుండా డైట్‌ ఉందా?

09-11-2018: మా తాతయ్యకు 60 ఏళ్లకు షుగర్‌ వచ్చింది. మా నాన్నాకు 35 ఏళ్లకే షుగర్‌ వచ్చింది. ఇప్పుడు నా వయసు 35. నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. పంచదార పూర్తిగా మానేశాను. ఎప్పటిప్పుడు షుగర్‌ టెస్ట్‌ చేయించుకుంటాను. నార్మల్‌గానే ఉంటుంది. కానీ నాకు షుగర్‌ వచ్చేస్తుందేమోననే భయం ఉంటుంది. అది రాకుండా నివారించవచ్చా? ఇంకా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి.
-రాజేష్‌
మీ మెయిల్‌ మొత్తం చదివాను. మీరు చాలా జాగ్రత్తగా మీ తాతయ్యను, నాన్నను గమనించి జాగ్రత్తలు పాటిస్తున్నారు. మిమ్మల్ని తప్పక అభినందించాలి. ఇప్పటికీ వారిద్దరు ఆరోగ్యంగా ఉన్నారంటే మీరు వారి పట్ల తీసుకున్న జాగ్రత్త కూడా తెలుస్తోంది.
జబ్బు రాకుండా ప్రివెంట్‌ చెయ్యడం చాలా మంచి విషయం. డయాబెటీస్‌ రాకుండా ఉండాలంటే మన లైఫ్‌స్టయిల్‌ ఒక క్రమంలో ఉండాలి. ఎప్పుడైతే గాడి తప్పుతుందో అప్పుడు లైఫ్‌ స్టయిల్‌ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. డయాబెటీస్‌ రాకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.
 
డైట్‌: ఆహారంలో పీచు పదార్థం బాగా ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా తృణధాన్యాల నుంచి వచ్చే ఫైబర్‌ షుగర్‌ లెవల్స్‌ని నార్మల్‌గా ఉండేట్టు చేస్తుంది. తృణధాన్యాలు అంటే తృణధాన్యాల పిండి, బ్రౌన్‌ రైస్‌, అన్ని రకాల మిల్లెట్స్‌. ఒక తృణధాన్యాల పిండి, ఏదైనా ఒక కూరగాయ, ఒక పండు మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలి. ఆహారం సమతుల్యంగా ప్లాన్‌ చేసుకుని తీసుకోవాలి. టైమ్‌ ప్రకారం ఆహారం తీసుకోవడం ముఖ్యం. అలాగే టైమ్‌ ప్రకారం మలవిసర్జన చేయటం అలవాటు చేసుకోవాలి.
 
వ్యాయామం: ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం చాలా ముఖ్యం. అది కేవలం వాకింగ్‌ అయినా సరే. కొంచెం హార్ట్‌రేట్‌ పెరిగేట్టు వాకింగ్‌ చేస్తే మెటబాలిక్‌ యాక్టివిటీ సక్రమంగా ఉంటుంది.
 
నిద్ర: సమయానికి నిద్ర పోకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రి 10 గంటలకల్లా నిద్రపోతే, శరీరం దానికదే రిపేర్‌ చేసుకుని ఆరోగ్యంగా ఉంటుంది.
 
ఒత్తిడి: ఒత్తిడి అనేది అందరికీ ఉంది. అది కొంతవరకు మనకు మేలు చేస్తుంది. కొద్దిపాటి ఒత్తిడి వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. అయితే క్రానిక్‌ ఒత్తిడి వల్ల ఆరోగ్యం చెడుతుంది. ఒత్తిడిని అధిగమించడానికి ఎవరికి వారే ఒక సూత్రం కనిపెట్టుకోవాలి. ఉదాహరణకు పెంపుడు జంతువులతో ఆడుకోవడం, మొక్కలు పెంచడం, పుస్తకాలు చదవడం, చక్కటి సువాసనలతో వేడి నీళ్ల స్నానం చెయ్యడం మొదలైనవి. ఇలాకాకుండా చాలామంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధూమపానం, మద్యపానం అలవాటు చేసుకుని లేని జబ్బులు కొని తెచ్చుకుంటారు.
 
మీ జీవన శైలిని ఒకసారి పరీక్షించుకుని చూడండి. వెంటనే ఎక్కడ జాగ్రత్త పడాలో తెలుస్తుంది. దానికి తగిన చర్యలు చేపట్టి, అవసరమైతే ప్రొఫెషనల్స్‌ సాయం తీసుకుంటే డయాబెటీస్‌ మీ దగ్గరికి రాదు. ఆరోగ్యంగా ఉంటారు.
 
-డాక్టర్‌ బి. జానకి, న్యూట్రిషనిస్ట్‌