మధుమేహం ఉంటే... పళ్లు తినొచ్చా?

02-02-2018: పళ్లు ఆహారంతో పాటు తీసుకుంటే మంచిది కాదంటారు (పొట్టలో కుళ్ళిపోతుంది. నిజమేనా?). వాటిని ఎప్పుడు ఎలా తీసుకోవాలో తెలుపగలరు. అలాగే మధుమేహం ఉన్నవారు పళ్లు తినొచ్చా?

 
పళ్ళు ఎప్పుడైనా తినవచ్చు. కేవలం ఉదయం మాత్రమే తినాలని లేక భోజనానికి భోజనానికి మధ్యనే తినాలని కానీ రూలేం లేదు. సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ కూడా ఏమీలేదు. పళ్ళు ఏ టైం లోనైనా తినొచ్చు. ఆహారంతో పాటు పళ్ళు తీసుకుంటే, ఆహారం పొట్టలో కుళ్లిపోదు. పొట్టలో ఉన్న అసిడిక్‌ మీడియం బ్యాక్టీరియాని చంపుతుంది. కావున పొట్టలో పళ్ళు కుళ్లిపోయే అవకాశమే లేదు. పళ్ళలో ఉన్న పీచు పదార్థం మలబద్దకం లేకుండా చేస్తుంది. పేగులను శుభ్రంగా ఉంచుతుంది. పళ్ళలో వున్న అనేక ‘ఫైటో రసాయనాలు’ ఆరోగ్యాన్ని రక్షిస్తుంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బి- విటమిన్లు, సి- విటమిన్లు, ఖనిజ లవణాలు పళ్ళలో ఉంటాయి. వంట అవసరం లేకుండా తినే ఏకైక ఆహారం పళ్ళు! వీటిలో పీచు పదార్థం అన్నాశయంలోని ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణయమయ్యేలా చేస్తుంది. దీని వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా ఉంటాయి.
పళ్లలో సులువుగా కరిగే ఫైబర్‌ (టౌజూఠఛజ్ఛూ జజీఛ్ఛట) ఉంటుంది. అది షుగర్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది. ప్రతి 7.5 గ్రాముల ఫైబర్‌కి 25 శాతం బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు పళ్ళు నిరభ్యంతరంగా తినవచ్చు. ఆహారంతో పాటు తీసుకోవచ్చు. నిజానికి మధుమేహం ఉన్నవారు ఆహరంతో పాటు తీసుకుంటేనే షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా ఉంటాయి. భోజనానికి భోజనాకి మధ్య తీసుకున్నట్లయితే తాత్కాలికంగా షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం వుంది. అన్ని పళ్ళు అందరూ అన్ని వేళలా తీసుకోవచ్చు. రోజుకు 500 గ్రాముల పళ్ళు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకోవాలి.
- డాక్టర్ జానకి