చక్కెర అంతా మన గుప్పెట్లోనే

15/05/14

 
మధుమేహవ్యాధిగ్రస్తుల జాబితాలో మీరూ చేరిపోయారా? డోంట్‌ వర్రీ! మధుమేహాన్ని ఎదుర్కోవడం ఇప్పుడు ఎంతో సులభం. చక్కెర వ్యాధి వచ్చేసిందే అని బాధపడుతూ కూర్చోకుండా దాన్ని అదుపులో ఉంచే మార్గాలకై అన్వేషించండి. దాని కళ్లెం మీ చేతుల్లోకే వచ్చేస్తుందంటున్నారు ప్రముఖులు. మధుమేహం వచ్చిందని తెలియగానే  అన్నింటికన్నా ముందు మన కర్తవ్యమేంటో తెలిస్తే ఆ  తర్వాత పెద్దగా ఆందోళన చెందాల్సింది ఏమీ ఉండదు అంటున్న నిపుణుల సూచనలు మీకోసం...
 
సుమారు 17 శాతం మందిని బాధిస్తున్న అనేక సమస్యల వలయం ఈ వ్యాధి. ఒకసారి మధుమేహానికి గురయితే ఇక జీవితాంతం మందులు వాడుతూ రోగిగా ముద్ర పడాల్సిందేనని ఆందోళన పడుతుంటాం. నిజానికి మధుమేహానికి డాక్టర్ల కన్నా రోగులే మంచి వైద్యాన్ని అందించగలుగుతారు. వైద్యులు ఇచ్చే మందుల కన్నా మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలే మధుమేహాన్ని ఎదుర్కోగల శక్తివంతమైన అస్ర్తాలు.
సాధారణంగా ఆపరేషన్‌ చేయించుకునే ముందో, అవసరం కలిగినప్పుడు చేయించుకునే పరీక్షల్లోనో కాకతాళీయంగా మధుమేహం ఉన్నట్టు బయటపడుతుంటుంది. ఇలాంటప్పుడు వెంటనే ఏం చేయాలో అర్థం కాదు. ఈ ఆందోళన కాస్తా మనసుపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఆ ఒత్తిడి మధుమేహాన్ని మరింత జటిలం చేస్తుంది. కాబట్టి రక్తంలో చక్కెరలు పెరిగాయని తెలియగానే ముందుగా ఆందోళన, ఒత్తిళ్లకు లోనవకుండా ఉండడం అవసరం. మధుమేహాన్ని నియంత్రించడానికి సమర్థవంతమైన మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కొత్త కొత్త డయాబెటిక్‌ ఫుడ్స్‌ కూడా వస్తున్నాయి. మధుమేహుల కోసం ప్రత్యేకమైన స్వీట్లు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. తక్కువ కేలరీలు ఉండే వరి ధాన్యం కూడా అందుబాటులోకి రానుంది.  
ఈ పరీక్షలు తప్పనిసరి
మధుమేహం ఉందని తెలియగానే పూర్తిస్తాయిలో నిర్ధారించుకోవడానికి మరో సారి పరీక్ష చేయించుకోవాలి. ర్యాండమ్‌గా చేసే పరీక్షలను బట్టి మధుమేహం ఉన్నదో లేదో నిర్ధారణ చేయలేము. తినకముందు, తిన్న తరువాత రెండు రకాల పరీక్షలూ చేయించుకున్న తరువాతే నిర్ధారణకు రావాలి. 
హెచ్‌బిఎ1సి
పరీక్షల్లో బయటపడినప్పుడే మధుమేహం వచ్చినట్టు కాదు. అది ఎప్పటి నుంచో లోపల ఉండి ఉండవచ్చు. ఇలాంటప్పుడు అప్పటికే మధుమేహానికి సంబంధించిన సమస్యలు ప్రారంభమై ఉండే అవకాశం ఉంది. మూడు నెలల క్రితమే మధుమేహం మొదలై ఉంటే ఆ విషయాన్ని హిమోగ్లోబిన్‌ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. గ్లైకాసిలేటెడ్‌ హిమోగ్లోబిన్‌ శాతాన్ని లెక్కించడం ద్వారా మధుమేహాన్ని నిర్ధారిస్తారు. గ్లైకాసిలేటెడ్‌ హిమోగ్లోబిన్‌ 7 శాతం దాటితే మూడు నెలల క్రితమే మధుమేహం ఉన్నదని అర్థం. 
లిపిడ్‌ ప్రొఫైల్‌
 కొవ్వుల మోతాదును తెలుసుకోవడానికి కొలెస్ర్టాల్‌, ట్రై గ్లిజరైడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. మనవాళ్లకి కొలెస్ర్టాల్‌ కన్నా ట్రై గ్లిజరైడ్స్‌ వల్ల కలిగే హానే  ఎక్కువ. కాబట్టి మధుమేహం ఉందన్న అనుమానం రాగానే ట్రైగ్లిజరైడ్‌ పరీక్షలు చేయించుకోవడం మంచిది. 
యూరియా క్రియాటిన్‌
మధుమేహం మూడు నెలల క్రితమే ఉన్నట్టు బయటపడితే కిడ్నీ సంబంధిత పరీక్షలు కూడా చేయించాలి. సాధారణంగా మధుమేహుల్లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల వల్ల కిడ్నీలు చెడిపోతాయి. క్రియాటిన్‌ మోతాదును బట్టి కిడ్నీల సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. వీటితో పాటు గుండెకు సంబంధించిన ఇసిజి, టిఎంటి లాంటి పరీక్షలు, నేత్ర పరీక్షలు చేయించుకుంటే మంచిది.
ఇవి మరవొద్దు
ప్రీ డయాబెటిస్‌ను మాస్క్‌డ్‌ డయాబెటిస్‌ అంటారు. దీన్నే ఇంపెయిర్డ్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌గా కూడా చెబుతారు. ఏమీ తినక ముందు ఫాస్టింగ్‌లో రక్తంలో చక్కెరలు 120 , తిన్న తరువాత పోస్ట్‌లంచ్‌ టెస్ట్‌లో 140 నుంచి 180 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్‌ దశగా పరిగణించాలి.తినక ముందు రక్తంలో చక్కెరల మోతాదు 140 కన్నా ఎక్కువ, తిన్న తరువాత  200 కన్నా ఎక్కువ ఉంటే మందులు అవసరం అవుతాయి. అంతకన్నా తక్కువ ఉంటే ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవడం, వ్యాయామం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చు. 
ఒత్తిడి పెరిగినప్పుడు కార్టిసాల్‌, అడ్రినలిన్‌ హార్మోన్లు పెరుగుతాయి. ఇవి ఇన్సులిన్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. థైరాయిడ్‌ సమస్య ఉన్నప్పుడు కూడా మధుమేహం ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే థైరాయిడ్‌ నయమైతే మధుమేహం కూడా అదుపులోకి వస్తుంది. 
యోగా మధుమేహాన్ని పూర్తిగా పారదోలుతుందన్నది నిజం కాదు. అయితే మానసిక ఒత్తిడిని మాత్రం తగ్గిస్తుంది. తద్వారా ఇన్సులిన్‌ అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. ఫలితంగా మధుమేహం అదుపులో ఉంటుంది. దీనివల్ల తీసుకునే మందుల అవసరం తగ్గుతుంది.
 
మధుమేహ సంకేతాలు...
ఎన్ని నీళ్లు తాగినా నోరెండిపోవడం, పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం
ఆకలి ఎక్కువగా ఉండడం, బరువు తగ్గడం, చిన్న శ్రమకే ఎక్కువగా అలసిపోవడం, 
చిరాకు, చూపు తగ్గడం, నిద్ర పట్టకపోవడం, శరీరం అంతా దురదగా అనిపించడం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం 
35 ఏళ్లు దాటిన వారిలో తీవ్రమైన వాంతులు, వికారం, కడుపునొప్పి, బరువు తగ్గిపోవడం, ఆకలి ఎక్కువ కావడం, డీహైడ్రేషన్‌ లాంటి సమస్యలు ఉత్పన్నమైతే  టైప్‌ 1 మధుమేహం ఉండే అవకాశం ఉంటుంది. కీటోన్లు అనే రసాయనాలు పెరిగి కీటోఅసిడోసిస్‌ స్థితి ఏర్పడడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.
 
డైట్‌ చార్ట్‌
3  ఉదయం 8 నుంచి 9 గంటలు - అల్పాహారం - ఒక ఇడ్లీ లేదా రెండు రొట్టెలు లేదా ఉప్మా లేదా నూనె లేని ఒకటిన్నర దోసె, ఆ తరువాత ఒక కప్పు పాలు
3  11 నుంచి 12 గంటలు - కప్పు పాలు, లేదా మజ్జిగ లేదా టీ
3 మధ్యాహ్నం 1 నుంచి 2 గంటలు - భోజనం - అన్నం, పప్పు, పెరుగు, కూరగాయ, నూనె తక్కువగా ఉండే కూర, దుంపలు తినవద్దు.
3 4 గంటలు - స్నాక్స్‌ -  పండు - మధుమేహులు పండ్లు తినకూడదు అన్నది పూర్తిగా నిజం కాదు. అయితే అరటి, మామిడి, సీతాఫలం, సపోటా మాత్రం తినవద్దు. 50 నుంచి 100 గ్రాముల పండు ఏదైనా తినవచ్చు. అంటే అర లేదా ఒక పండు తినవచ్చు. 
3  రాత్రి - 8 నుంచి 9 గంటలు - చపాతీ, కూర, పప్పు, పెరుగు
3  రాత్రి 10 గంటలు - కప్పు పాలు