13-09-2019: పుట్టగొడుగులు పోషకాల నిధి అని తెలిసినా కూడా చాలామంది వీటిని తినరు. కేలరీలు తక్కువగా, ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ సూపర్‌ఫుడ్ మధుమేహాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఇవి ఔషధంగానూ పనికొస్తాయి. ప్రోబయాటిక్ గుణాలున్న వీటిని రోస్ట్ చేసుకొని లేదా సూప్‌ల రూపంలో ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పుట్టగొడుగుల్లోని ఎర్గోథియోనిన్, సెలీనియం వంటి యాంటీ-ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి.
ప్రోబయాటిక్ ఫుడ్‌గా పనిచేస్తాయి. జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఇవి తోడ్పడతాయి.
కేలరీలు, కొవ్వు తక్కువగా ఉండే వీటిని బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్ ప్లాన్‌లో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది.
మధుమేహంతో బాధపడేవారు పుట్టగొడుగుల్ని ఎక్కువ మొత్తంలో తింటే కావల్సినంత ఫైబర్ అందుతుంది. దాంతో రక్తపీడనం, కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
వీటిలోని లెక్టిన్ ప్రోటీన్లు కేన్సర్ కణాలను గుర్తించి, వాటి వృద్ధిని అడ్డుకుంటాయి. మష్రూమ్స్‌లోని సెలీనియం మూత్రకోశ కేన్సర్ వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది.
పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉండే పుట్టగొడుగులు రక్తపీడనాన్ని తగ్గించి, గుండె సంబంధ వ్యాఽధుల నుంచి రక్షణనిస్తాయి.
పుట్టగొడుగులు విటమిన్ డికి మంచి వనరు. వీటిలోని క్యాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఆస్టియోపోరోసిస్ ముప్పును, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
వీటిలోని కాపర్ ఐరన్ శోషణను అధికం చేసి రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది.