ఆహారంతో మధుమేహం తగ్గుతుందా..?

ఆంధ్రజ్యోతి (03-11-2019): ప్రశ్న: మధుమేహ రోగులు పాటించాల్సిన ఆహార నియమాలేమిటి? సరైన ఆహారంతో వ్యాధి నయమవుతుందా? 

 - విజయ్‌, కదిరి 

జవాబు: ఆహారంలోని గ్లూకోజు శరీరంలోని కణాలన్నిటికీ శక్తినిస్తుంది. రక్తంలోని గ్లూకోజు... కణాలకు అందాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరం. ఇన్సులిన్‌ను క్లోమగ్రంథి ఉత్పత్తి చేస్తుంది. టైప్‌- 1 డయాబెటిస్‌లో ఇన్సులిన్‌ ఉత్పత్తి కొంతవరకు లేదా పూర్తిగా ఆగిపోతుంది. టైప్‌- 2 డయాబెటిస్‌లో  ఇన్సులిన్‌ను క్లోమగ్రంథి ఉత్పత్తి చేసినా కణాలు దీనికి ప్రభావితం కావు. ఈ రెండు రకాల మధుమేహాల్లో రక్తంలో గ్లూకోజు శాతం ఎక్కువ. దీని వల్ల సూక్ష్మ రక్తనాళాలుండే.. కళ్ళు, మూత్రపిండాలు, అరికాళ్ళు లాంటి శరీర భాగాలకు దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు. రక్తంలో గ్లూకోజు పరిమాణం, వ్యాధి స్థాయి, వాడుతున్న మందులు, జీవన విధానాన్ని బట్టి ఆహార నియమాలను పాటిస్తే గ్లూకోజును అదుపులో ఉంచవచ్చు. అన్నం, రొట్టెలు, జావ, అటుకులు... మొదలైనవన్నీ పరిమితంగా తీసుకోవాలి. పండ్లలో ఉండే చక్కెరలూ గ్లూకోజును పెంచుతాయి.  అందుకే, పండ్లను పరిమితంగా తీసుకోవాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, గుడ్లు, పప్పుధాన్యాలు, పాలు, పెరుగు లాంటివి ప్రతి పూటా తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు తప్పనిసరి. బంగాళా దుంప, క్యారెట్‌, కంద, చేమదుంప లాంటి కూరలు, అరటి కాయలు తక్కువగా తినాలి. ఆరోగ్యకర జీవన విధానంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. 
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను [email protected]కు పంపవచ్చు)