నో షుగర్‌ ఛాలెంజ్‌..!

ఆంధ్రజ్యోతి (06-11-2019): నవంబర్‌ నెలలో ‘నో షేవ్‌ ఛాలెంజ్‌’ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ నవంబర్‌లో మాత్రం సెలబ్రిటీల ‘నో షుగర్‌ ఛాలెంజ్‌’ యూత్‌ను అమితంగా ఆకర్షిస్తోంది. ఉదయం టీ తో మొదలు... ఆఫీస్‌ బ్రేక్‌ టైమ్‌లో కప్పు స్ర్టాంగ్‌ కాఫీ సిప్‌ చేసే వారు కూడా ఈ ఛాలెంజ్‌ను ట్రై చేస్తున్నారు. ట్రెండ్‌ను అనుసరించేవారు లైఫ్‌ స్టయిల్‌లో మార్పు కోసం ఈ ఛాలెంజ్‌ను ఫాలో అవ్వాలంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ పూజా మఖీజా.
 
ఫేస్‌బుక్‌లో సరిగ్గా రెండేళ్ల క్రితం... అంటే 2017 ఇదే నెలలో ఒక ఆన్‌లైన్‌ కమ్యూనిటీ ఈ ఛాలెంజ్‌ను మొదలెట్టింది. నవంబర్‌ వచ్చేసరికి దాదాపుగా పెద్ద పండుగలన్నీ అయిపోతాయి. దాంతో స్వీట్స్‌, చక్కెర నుంచి బాడీకి కాస్త బ్రేక్‌ ఇవ్వాలనే ఆలోచనతో ప్రారంభమైందీ ‘నో షుగర్‌ ఛాలెంజ్‌’. హెల్తీ, బ్యాలెన్స్డ్‌ లైఫ్‌ కోరుకుంటున్న ఈతరం యువత దీన్ని సవాల్‌గా తీసుకుంటున్నారు. ఈ ఛాలెంజ్‌ను మొదటి సారిగా స్వీకరించే వాళ్లకు దీని అవసరం, ప్రాధాన్యాన్ని పూజా మఖీజా వివరిస్తున్నారిలా...
 
ఈ ఛాలెంజ్‌లో భాగంగా నవంబర్‌ నెల మొత్తం ఆహారంలో చక్కెర, తీపిపదార్థాలు లేకుండా చూసుకోవాలి. అందుకు మానసికంగా సిద్ధపడాలి. ఎందుకంటే ఎవరో వచ్చి మిమ్మల్ని మానిటర్‌ చేయరు. 
 
ఎవరికి వారు స్వీయ నియంత్రణ, క్రమశిక్షణతో ఉండాలి. నిజాయతీగా ‘నో షుగర్‌ ఛాలెంజ్‌’ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
 
మీ లైఫ్‌ స్టయిల్‌లో మార్పుకోసం ఈ ముప్పై రోజులను ఉపయోగించుకోండి. 30 రోజులు ఒక ఛాలెంజ్‌ను ఫాలో అవడం మీకు బాగా పనికొస్తుంది.
 
షుగర్‌, స్వీట్స్‌ లేకుండా రోజును ఊహించడం కొంచెం కష్టమే. కానీ ఈ చిన్న సవాల్‌ని ప్రయత్నించి చూడండి. ఆరోగ్యం దిశగా ఒక అడుగు వేయండి. మీకు సౌకర్యంగాఅనిపించిందనుకోండి సందర్భం వచ్చినప్పుడు తరచుగా ఈ ఛాలెంజ్‌ ఫాలో అవ్వండి.
 
నెల రోజులు ఈ ఛాలెంజ్‌ స్వీకరిస్తే ఆహారంలో షుగర్‌ తగ్గించాలని మిమ్మల్ని మీరే కన్విన్స్‌ చేసుకుంటారు. ఈ నెల మీకు ఆరోగ్యంగా గడిచిందనుకోండి. ఇక రోజూ పాటిస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో ఆలోచించండి. షుగర్‌ను ప్రతిసారి కాకుండా సందర్భాన్ని బట్టి తీసుకోవడం అలవాటు చేసుకోండి.
 
ఈ ఛాలెంజ్‌తో బరువు తగ్గడంతో పాటు ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. హెల్తీ లైఫ్‌స్టయిల్‌ అలవడుతుంది.