‘చేదు చేదు...’ చక్కెర వ్యాధి!

‘కంగ్రాచ్యులేషన్స్‌ డాక్టరుగారూ! మీకో తీపి కబురు’... అంటూ నా గదిలోకి వచ్చాడు ఓ చిరకాల మిత్రుడు. 

అతను ‘తీపి’ అన్న మాటను కాస్త ఒత్తి పలకడం నేను గమనించకపోలేదు.
‘ఏమిటో అంత తీ....పి’ అంటూ నేనూ ఆ స్థాయిలోనే స్పందించాను.
‘రోగుల సంఖ్య పెరగడం ఏ డాక్టరుకైనా శుభవార్తేగా...’ అంటూ నర్మగర్భంగా జవాబిచ్చాడు. 

ప్రశ్నార్థకంగా చూశాను.

‘ఇదిగో ఈ వార్త చదవండి. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధానిగా మారుతోంది. మధుమేహం ఉందంటే, అంగస్తంభన సమస్యా ఉన్నట్టేగా! చూస్తూ ఉండండి.. మీ టర్నోవర్‌ అనూహ్యంగా పెరిగిపోతుంది’ అంటూ ఆరోజు దినపత్రికలోని ఓ వార్తా కథనాన్ని చూపించాడు. నిజమే, గణాంకాలతో సహా ఇచ్చారు. 

సంపాదన సంగతి ఎలా ఉన్నా... మధుమేహానికి, అంగస్తంభన సమస్యకూ నేరుగా ముడిపెట్టేవారి సంఖ్య మాత్రం నిజంగానే పెరుగుతోంది. మధుమేహం ఉన్నంత మాత్రాన, అంగస్తంభన సమస్య ఉండితీరాలన్న నియమమేం లేదు. ఉన్నా అందుకు మధుమేహమే నేరుగా కారణం కాకపోవచ్చు. ఆ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోలేక పోవడమే అసలు సమస్య. దేనికి ఏది కారణం అన్నది వైద్యుడే నిర్ధారించగలడు.

ఒక్క అంగస్తంభన సమస్యే ఏమిటి, మధుమేహం దుష్ఫ్రభావాల వల్ల ‘రెట్రోగ్రేడ్‌ ఎజాక్యుయేషన్‌,  డిస్పరేనియా’ లాంటి అనేక జాడ్యాలు చుట్టుముట్టేస్తాయి. ఈ ఇబ్బంది ఉన్నవారిలో.. భావప్రాప్తి సమయంలో వీర్యం పురుషాంగం లోంచి బయటికి స్ఖలించకుండా... బ్లాడర్‌లోకి చేరుకుంటుంది. దీంతో శృంగారంలో పతాకస్థాయికి చేరాక కూడా... వీర్యం పడదు, పడినా ఏ ఆవగింజంత పరిమాణంలోనో ఉండవచ్చు. దీన్నే ‘డ్రై ఆర్గాజమ్‌’ అంటారు.

మధుమేహ రోగుల్లో సాధారణంగా ... పురుషుల్లో అయితే అంగస్తంభనం, మహిళల్లో అయితే భావప్రాప్తిపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. రక్త నాళాలూ నరాల వ్యవస్థా తీవ్రంగా దెబ్బతినడం వల్ల ఈ లైంగిక సమస్యలు చుట్టుముడతాయి. అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్‌ ఎండ్‌ ప్రాడక్ట్స్‌ అని పిలవబడే కొన్ని పదార్థాలు శరీరంలో పోగైపోవడం వల్లే ఈ ఉత్పాతమంతా! మిగతా వ్యక్తుల్లోనూ ఇవి పోగవుతాయి. కాకపోతే, చాలా నింపాదిగా సాగుతుందా ప్రక్రియ. వయసు ప్రభావమూ ఉంటుంది. మధుమేహ రోగుల్లో మాత్రం... గ్లూకోజ్‌ నిల్వలు పుష్కలంగా ఉండటంతో వేగవంతంగా జరిగిపోతుంది. రక్తనాళాల గోడలకు ఉన్న ప్రొటీన్ల పనితీరునూ, నిర్మాణాన్నీ ఆ అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్‌ ఎండ్‌ ప్రాడక్ట్స్‌... సమూలంగా మార్చేస్తాయి. మరింత మందంగా తయారు చేస్తాయి. ఫలితంగా గుండె, మూత్రపిండాలు, పురుషాంగం, యోని తదితర భాగాలకు రక్త సరఫరా మందగిస్తుంది. రక్త ప్రవాహం తగ్గిపోవడంతో.. నరాల పనితీరు దెబ్బతింటుంది. ఎందుకంటే, నాడీవ్యవస్థ కూడా రక్తంతో పాటు అందే ఆక్సిజన్‌ మీదే ఆధారపడుతుంది. పురుషాంగానికి రక్త సరఫరా తగ్గిపోయినప్పుడు... పురుషుడిలో స్తంభన సామర్థ్యం దెబ్బతింటుంది. 

దాదాపుగా ప్రతి ముగ్గురు మధుమేహ రోగుల్లో ఒకరు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అలా అని, తాము మధుమేహ పీడితులు అయినంత మాత్రాన.. తమలోనూ ఏదో ఓ లైంగిక సమస్య ఉండవచ్చని భయపడాల్సిన అవసరమూ లేదు. మధుమేహ రోగుల్లో ... ఒత్తిడి, ఔషధాల చెడు ప్రభావం, మానవ సంబంధాల లోపం... మొదలైనవి కూడా అంగస్తంభన సమస్యకు ప్రధాన కారణాలు కావచ్చు. నేరుగా మధుమేహమే ముద్దాయి కాకపోనూవచ్చు. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోగలిగితే చాలా శృంగార సమస్యల్ని అధిగమించవచ్చు. మధుమేహం ఉంది కాబట్టే, అంగస్తంభన సరిగా ఉండటంలేదన్న నిర్ణయానికి వచ్చేయకుండా... వైద్యుడిని సంప్రదించి, నిస్సంకోచంగా తమ సమస్యల్ని చెప్పుకోవాలి. వయాగ్రా లాంటి మాత్రలూ, పెనైల్‌ ప్రోస్థెసిస్‌ లాంటి శస్త్రచికిత్సలూ అందుబాటులో ఉన్నాయి ప్పుడు. అంగస్తంభన మాత్రమే సెక్స్‌కు ప్రాథమిక అర్హత కాదని గ్రహించాలి. ఆలింగనాలూ చుంబనాలూ, నఖశిఖ స్పర్శలూ... కూడా వలపు ‘తీపి’ని అందిస్తాయి. 

డాక్టర్‌ డి.నారాయణరెడ్డి
కన్సల్టెంట్‌, సెక్సువల్‌ మెడిసిన్‌
డేగ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై.
www.degainstitute.com