చక్కెర వ్యాధితో పురుషుల్లో వంధ్యత్వం

వాషింగ్టన్‌: మధుమేహం పురుషుల్లో వంధ్యత్వానికి ఓ కారణం అవుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చాలా సందర్భాల్లో చక్కెర వ్యాధిగ్రస్తుల పిల్లల్లోనూ డయాబెటిస్‌-1 లక్షణాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఏటా ఎంతోమంది మధుమేహులకు శారీరక వైకల్యం, అవయవ లోపాలు కలిగిన సంతానం కలుగుతున్నట్లు చెప్పారు. మధుమేహ బాధితులైన గర్భిణులకు గర్భస్రావం ముప్పు అధికమని, గర్భస్త దశలో వారి శిశువు ఎదుగుదలపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా రక్తంలో చక్కెర మోతాదును అదుపులో పెట్టుకోవచ్చన్నారు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం, పొగాకు, మద్యం అలవాట్లను మానేయడం, వ్యాయామం, ధ్యానాలతో వంధ్యత్వం ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నారు.