ప్రి-డయాబెటిస్ ను గుర్తించండి

ఆంధ్రజ్యోతి(26-09-2016): మధుమేహంతో వచ్చే సమస్యలు అందరికీ తెలిసిందే. మధుమేహం వచ్చాక ఎప్పుడూ మందులు వాడాల్సిందే. ఒకసారి వచ్చాక తగ్గించడం అంటూ సాధ్యం కాదు. అయితే మధుమేహం వచ్చే అవకాశాలను ముందే గుర్తిస్తే కనుక రాకుండా ఆపడం సాధ్యమవుతుందని అంటున్నారు వైద్యులు. అంటే ప్రి-డయాగ్నొసిస్‌ చేయడం ద్వారా డయాబెటిస్‌కు చెక్‌ పెట్టవచ్చని అంటున్నారు. దీన్నే ప్రి-డయాబెటిస్‌ అని పిలుస్తున్నారు. డయాబెటిస్‌ వచ్చే అవకాశాలను ఎలా గుర్తించాలంటే ఫాస్టింగ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవెల్స్‌ 100 నుంచి 125 ఎంజి/డిఎల్‌ ఉన్నట్లయితే ప్రి-డయాబెటిస్‌గా భావించాలని సూచిస్తున్నారు. ఈ స్థితిలో ఓరల్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌, గ్లైకేటెడ్‌ హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేయించడం ద్వారా ప్రి-డయాబెటిస్‌ను నిర్ధారించుకోవచ్చని అంటున్నారు. ప్రి-డయాబెటిస్‌ స్థితిలో డయాబెటిస్‌ లక్షణాలు ఉండొచ్చు, ఉండక పోవచ్చు. ఒకవేళ ప్రి-డయాబెటిస్‌గా తేలితే లైఫ్‌స్టయిల్‌లో మార్పులు చేసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఫిజికల్‌ యాక్టివిటీ పెంచడం, హెల్తీ వెయిట్‌ వంటివన్నీ పాటించడం ద్వారా గ్లూకోజ్‌ లెవెల్స్‌ నార్మల్‌కు వచ్చేలా చేసుకోవచ్చని అంటున్నారు. లైఫ్‌స్టయిల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా డయాబెటిస్‌ రాకుండా నిరోధించుకోవచ్చని సూచిస్తున్నారు.