బాబోయ్‌ బీపీ.. అమ్మో షుగర్‌!

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు

ఎన్‌ఐఎన్‌ అధ్యయనంలో వెల్లడి
 
ఆంధ్రజ్యోతి, 25-07-2018: ఆధునిక జీవనశైలి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. రక్తపోటు, మధుమేహం, రక్తహీనత వంటి సమస్యలకు దారితీస్తోంది. ఇటీవల నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) విడుదల చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ఏపీ, తెలంగాణల్లో 15-49 ఏళ్ల వయస్సు ఉన్న స్త్రీ,పురుషులపైన.. 1-5 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలపైన ఈ అధ్యయనం చేశారు.
 

 పల్లెల్లో కన్నా పట్టణప్రాంతాల్లో నివసించే ప్రజల్లో మధుమేహం(టైప్‌2) ఎక్కువగా ఉంటుందనే భావన తప్పని ఈ అధ్యయనంలో తేలింది. పట్టణాలు, పల్లెలు.. స్త్రీపురుషులు అనే భేధం లేకుండా అందరిలోను మధుమేహం తీవ్రంగా ప్రబలుతోంది.

 ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణలో మధుమేహ వ్యాధి కొద్దిగా తక్కువగా ఉంది.

 తెలంగాణలోని పట్టణాల్లో నివసించే పురుషులు ఎక్కువ మంది రక్తపుపోటు సమస్యతో బాధపడుతున్నారు. పట్టణాల్లో నివసించే మహిళలతో పోల్చుకుంటే వీరి సంఖ్య దాదాపు రెట్టింపు ఉంది.

 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రజలు.. ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారు.
  -  స్పెషల్‌ డెస్క్‌