మధుమేహులకు మరో చికిత్స!

స్థూలకాయం వల్ల వచ్చే సుగర్‌కు సెక్రెటా గోగిన్‌ ఇంజెక్షన్‌తో ఊరట

దాని పాత్రపై సీసీఎంబీ పరిశోధన

తార్నాక/హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):మధుమేహాన్ని నియంత్రించడంలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఇన్సులిన్‌ ప్రభావాన్ని పెంచడంలో సెక్రెటా గోగిన్‌ (ఎస్‌సీజీఎన్‌) అనే పొట్రీన్‌ పాత్ర గురించి వారు తెలుసుకోగలిగారు. సీసీఎంబీ శాస్త్రవేత్త యోగేంద్ర శర్మ, రాధిక ఖండేల్వార్‌, అమృత చిదానంద ఈ పరిశోధన నిర్వహించారు. ఎస్‌సీజీఎన్‌ అనేది ఇన్సులిన్‌ బైండింగ్‌ ప్రొటీన్‌. అంటే.. ఇన్సులిన్‌ను అతుక్కుని ఉంటుంది. ఇది ఇన్సులిన్‌ను వివిధ రకాల ఒత్తిళ్ల నుంచి కాపాడి, దాని స్థిరత్వాన్ని పెంచుతుంది. అంతేకాదు.. అది కొవ్వును కూడా నియంత్రిస్తుంది.
 
స్థూలకాయం వల్ల మధుమేహం (టైప్‌-2) బారిన పడేవారిలో ఈ ఎస్‌సీజీఎన్‌ స్థాయులు తక్కువగా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. ప్రయోగాల్లో భాగంగా.. స్థూలకాయంతో ఉన్న ఎలుకలకు ఎస్‌సీజీఎన్‌ను ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వగా.. వాటి రక్తంలో అదనంగా ఉన్న ఇన్సులిన్‌ను, కొవ్వును తగ్గించింది. ఈ ఇంజెక్షన్‌ ఇచ్చిన జీవుల్లో హానికారక ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గడాన్ని, కాలేయ కణాల్లో తక్కువ కొవ్వు ఉండడాన్ని శాస్త్రజ్ఞులు గమనించారు. మున్ముందు మధుమేహ వ్యాధి నియంత్రణలో ఎస్‌సీజీఎన్‌ మార్కర్‌ కీలక పాత్ర పోషిస్తుందని, దాని స్థాయులను కూడా పరీక్షల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుందని శాస్త్రజ్ఞులు వివరించారు.