మాకు పిల్లలు పుట్టరా?

22-10-2019: డాక్టర్‌! నా వయసు 34. మా వారి వయసు 38. మాకు పెళ్లై ఐదేళ్లు. ఇంతవరకూ పిల్లలు కలగలేదు. ఇద్దరం పరీక్షలు కూడా చేయించుకున్నాం. నాలో ఏ లోపమూ లేదు. మా వారికి స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉంది. అయితే వైద్యులు ఐవిఎఫ్‌ ద్వారా గర్భం దాల్చమని సూచిస్తున్నారు. మేం సాధారణ పద్ధతిలో పిల్లలను కనలేమా?
 
- ఓ సోదరి, హైదరాబాద్‌.
 
చికిత్సతో మీ వారి సమస్యను సరిదిద్దే వీలుంది. అయితే వైద్యులు ఐవిఎఫ్‌ సూచించడానికి కారణం మీ వయసు ఎక్కువగా ఉండడమే! సాధారణంగా మహిళల్లో 35 సంవత్సరాలు దాటినప్పటి నుంచి అండాల నాణ్యత, సంఖ్య తరిగిపోతూ ఉంటుంది. మీరు ప్రస్తుతం అదే దశలో ఉన్నారు. చికిత్సతో మీ వారి సమస్యను సరిదిద్దినా, మీరు గర్భం దాల్చే అవకాశాలు తక్కువే. 35 ఏళ్లు దాటిన తర్వాత ఐవిఎఫ్‌ సక్సెస్‌ రేటు తరుగుతూ ఉంటుంది. పైగా ఖర్చు కూడా పెరుగుతుంది.
 
ఈ వయసులో ఐవిఎఫ్‌ను ఆశ్రయిస్తే సక్సెస్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐవిఎఫ్‌ వద్దు, సహజసిద్ధంగా గర్భం దాల్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటే, ఓ పక్క మీ వారికి చికిత్స ఇప్పిస్తూ, ఆరు నెలల వరకూ ప్రయత్నించి చూడవచ్చు. అప్పటికీ గర్భం దాల్చకపోతే తప్పనిసరిగా ఐవిఎఫ్‌ లేదా ఐయుఐను ఆశ్రయించవలసిందే. అంతకు మించి ఆలస్యం చేస్తే సక్సెస్‌ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ అండాలను అరువు తీసుకుని గర్భం దాల్చినా, పుట్టే పిల్లలు తన పిల్లలు కారనే భావన కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆలోచించి సత్వర నిర్ణయం తీసుకోండి.