మా అబ్బాయికి సమస్య ఉన్నట్టా? లేనట్టా?

03-06-2019: డాక్టర్‌! మా అబ్బాయుకి పెళ్లై రెండు నెలలైంది. ఆ అమ్మాయిని ఎంతో ఇష్టపడి, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు కోడలితో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ గడిపేవాడు. అలాంటి వాడు మొదటి రాత్రి తర్వాత నుంచి కోడలికి శారీరకంగా దూరంగా ఉంటున్నాడు. కారణం అడిగితే, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అనీ, తనని చూస్తే కోరికలు కలగడం లేదనీ అంటున్నాడు. అసలు మా అబ్బాయికి సమస్య ఉన్నట్టా? లేనట్టా?
- ఓ సోదరుడు, కాకినాడ
 
మీ అబ్బాయికి ఉన్న సమస్య సర్వసాధారణమైనది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు కాబట్టి, తర్వాత ఆ అమ్మాయి నచ్చలేదు అంటున్నాడంటే అది నమ్మదగిన విషయం కాదు. సాధారణంగా మొదటి రాత్రి నాడు లైంగికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేసి, ఆ తర్వాత నుంచీ దూరంగా ఉంటున్నారంటే, కారణం పడక గదిలో దంపతుల మధ్య జరిగిన సంఘటనతో ముడిపడి ఉంటుంది. మీరు భయపడుతున్నట్టు మీ అబ్బాయికి లైంగిక సామర్థ్యం లోపం ఉండి ఉండదు. ఎక్కువ శాతం పురుషులు తొలిసారి కలయిక సమయంలో పర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ ఎదుర్కొంటారు. ఆ ఆందోళనతో సక్రమంగా సెక్స్‌లో పాల్గొనలేకపోవడం, లేదా శీఘ్రస్ఖలనం, సమయానికి అంగం స్తంభించకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ తాత్కాలికమైనవి. కానీ ఆ సమస్యలను భూతద్దంలో చూసుకుని కుంగిపోయి, మరోసారి కూడా అలాగే జరుగుతుందేమోననే భయంతో సెక్స్‌కు దూరంగా ఉండిపోతారు. కారణం అడిగితే మీ అబ్బాయి చెప్పినట్టు ఆ అమ్మాయి నచ్చలేదనీ, తనను చూస్తే కోరికలు కలగడం లేదనీ అబద్ధం చెబుతూ ఉంటారు. కాబట్టి అబ్బాయిని అనునయించి నిజం రాబట్టే ప్రయత్నం చేయండి. లేదా వైద్యుల దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించండి. అంతా
సర్దుకుంటుంది.
 
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.
833285090 (కన్సల్టేషన్‌ కోసం)